Manipur: విమానాల కోసం విద్యార్థుల ఎదురుచూపు

ABN , First Publish Date - 2023-05-07T19:36:41+05:30 IST

మణిపూర్‌ (Manipur)లో ఘర్షణలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న విశాఖకు చెందిన విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 Manipur: విమానాల కోసం విద్యార్థుల ఎదురుచూపు

విశాఖపట్నం: మణిపూర్‌ (Manipur)లో ఘర్షణలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న విశాఖకు చెందిన విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజధాని ఇంపాల్‌లోని ఎన్‌ఐటీలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సుమారు 25 మంది చదువుతున్నారు. వీరిలో 20 మంది అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు వున్నారు. కొద్ది రోజుల నుంచి అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతోపాటు హాస్టల్‌కు సమీపంలో కాల్పులు, బాంబుల శబ్దాలు వినిపిస్తుండడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను స్వరాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం కూడా సరిగా అందడం లేదని, బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని ఎన్‌ఐటీలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్న టి.ఉదయ్‌కుమార్‌ అనే విద్యార్థి వాపోయాడు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేదని, హాస్టల్‌కు మంచినీటి సరఫరా జరిగే వాగును విషపూరితం చేశారని మణికంఠ అనే విద్యార్థి వాపోయాడు. ఇక్కడే బీటెక్‌ మొదటి ఏడాది చదువుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట ప్రాంతానికి చెందిన కె.హేమంత్‌ మాట్లాడుతూ.. పరిస్థితులు రెండు రోజుల్లో సర్దుకుంటాయని ఏపీ ప్రభుత్వానికి ఎన్‌ఐటీ కాలేజీ అధికారులు చెప్పినట్టు తెలిసిందని, కానీ ఇక్కడ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయని వాపోయాడు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలను ఇక్కడకు పంపించి తమ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను తీసుకెళ్లాయని, ఏపీ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. నష్టం జరిగిన తరువాత స్పందించడం కంటే.. ముందే స్పందించడం మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు.

పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు చెందిన ఎన్‌ఐటీ విద్యార్థులు కొందరు మణిపూర్‌లోని ఇంపాల్‌లో ఏపీ ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నారని తెలిసింది. విమానాల రాక కోసం నిరీక్షిస్తున్నారు. ఎన్‌ఐటీ విద్యా సంస్థ యాజమాన్యం జూన్‌ 30 వరకు సెలవులు ప్రకటించడంతో పాటు అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో వారంతా ఆంధ్రా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. విమానాలు ఏర్పాటు చేసేందుకు విద్యార్థుల నుంచి వివరాలు సేకరించినట్టు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్‌ తండ్రి గోవిందరావు ‘ఆంధ్రజ్యోతి’కి ఆదివారం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆ రాష్ర్టానికి చెందిన విద్యార్థులను ప్రత్యేక విమానాల ద్వారా తీసుకువచ్చిందన్నారు.

Updated Date - 2023-05-07T19:36:41+05:30 IST