కలిసుందాం... రండి!
ABN , First Publish Date - 2023-07-07T04:34:04+05:30 IST
సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్డీయే మిత్రపక్షాలను మరింత సంఘటితం చేయడం... దూరమైన పార్టీలను దగ్గరికి చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ దిశగా ఈనెల

18న ఢిల్లీలో ఎన్డీయే సమావేశం..
దూరమైన పార్టీలకూ ఆహ్వానం
రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి కూటమి భేటీ
మాకు ఎలాంటి సమాచారం లేదు: టీడీపీ
న్యూఢిల్లీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్డీయే మిత్రపక్షాలను మరింత సంఘటితం చేయడం... దూరమైన పార్టీలను దగ్గరికి చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ దిశగా ఈనెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఎన్డీయేలో ఉండి... వేర్వేరు కారణాలవల్ల దూరమైన పార్టీలనూ ఈ భేటీకి ఆహ్వానిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి రాలేనిపక్షంలో... మిత్రుల మద్దతు కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే... తాము సొంతంగా అధికారంలోకి రాలేని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మాత్రం చాన్స్ దక్కకూడదని, అలాంటి చోట మిత్రపక్షాలకు మద్దతుగా ఉండాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటి నేపథ్యంలో... 18వ తేదీన బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్డీయే మిత్రపక్షాల భేటీకి కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక... కూటమి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సలహా మేరకు ఎన్డీయేలో గతంలోఉన్న పార్టీలను తిరిగి కూటమిలోకి ఆహ్వానించాలని భావిస్తున్న బీజేపీ ఇప్పటికే పలు పార్టీలతో చర్చలు జరిపింది. ఎన్డీయేలో బీజేపీ, శివసేన (ఏకనాథ్ షిండే వర్గం), రాష్ట్రీయ లోక్ జనశక్తి (చిరాగ్ పశ్వాన్ వర్గం), అన్నాడీఎంకే, అప్నాదళ్ (సోనెలాల్ ), నేషనల్ పీపుల్స్ పార్టీ (మేఘాలయ), నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (నాగాలాండ్), ఆల్ జార్ఘండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీ (జార్ఖండ్) తో పాటు పలు చిన్నా చితక పార్టీలున్నాయి. ఇటీవల బిహార్‌లో జితన్ రాం మాంఝీకి చెందిన హిందూస్థాన్ ఆవాం మోర్చా ఎన్డీయేలో చేరింది. తాజాగా అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సీపీ మహారాష్ట్రలో బీజేపీతో చేతులు కలిపింది. కర్ణాటకలో జనతాదళ్ (ఎస్) నేత దేవెగౌడ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకోవడంతో ఆ పార్టీ ఎన్డీయేలో చేరే అవకాశాలు లేకపోలేదు. కాగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీయే నుంచి తప్పుకొన్న అకాలీదళ్‌ను తిరిగి కూటమిలో చేర్చుకునేందుకు ఇటీవలి కాలంలో బీజేపీ తీవ్ర యత్నాలు చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అకాలీదళ్ నేతలతో చర్చలు జరిపారు. శిరోమణి అకాలీదళ్ సంస్థాపకుడు ప్రకాశ్ సింగ్ బాదల్‌కు శ్రద్ధాంజలి ఘటించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చంఢీగడ్‌కు వెళ్లిన తర్వాత బీజేపీఅకాలీదళ్‌ల మధ్య సయోధ్యకు వాతావరణం ఏర్పడింది. 18వ తేదీన జరిగే సమావేశానికి హాజరవుతున్నట్లు శిరోమణి అకాలీదళ్ అఽధినేత సుఖ్‌బీర్ బాదల్, లోక్ జనశక్తి (చిరాగ్ పశ్వాన్ వర్గం) నేత చిరాగ్ పశ్వాన్ ధ్రువీకరించారు.
మాకు సమాచారం లేదు: టీడీపీ
అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో జరిగే ఎన్డీయే సమావేశానికి తాము హాజరవుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని టీడీపీ స్పష్టం చేసింది. ఇటువంటి సమావేశం ఉన్నట్లు కూడా తమకు సమాచారం లేదని తెలిపింది. 18వ తేదీన జరిగే ఎన్డీయే సమావేశానికి టీడీపీ కూడా హాజరవుతున్నట్లు ‘రిపబ్లిక్ టీవీ’ గురువారం సాయంత్రం ఒక వార్తను ప్రసారం చేసింది. దీనిని టీడీపీ వర్గాలు ఖండించాయి. ‘‘మాకు ఎలాంటి ఆహ్వానం లేదు. అసలు ఆ సమావేశం ఉందో లేదో కూడా తెలియదు. ఒక కూటమిలో చేరేముందు అనేక విషయాలపై రాజకీయ చర్చలు జరగాలి. ఏదీ లేకుండా సమావేశానికి హాజరు కావడం జరగదు’’ అని ఆ పార్టీలోని ఒక ముఖ్య నేత తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018లో ఆ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఇటీవలి కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకటి రెండుసార్లు ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినా.... ఎన్డీయేలో చేరేంత స్థాయిలో రాజకీయ పరిణామాలేవీ సంభవించలేదు. ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు. అవినీతి ఉంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. అంతటితో ఆ చర్చ ఆగిపోయింది.