Share News

YS Jagan : జగన్‌పై తిరుగుబాటు గన్‌

ABN , Publish Date - Dec 19 , 2023 | 02:51 AM

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో జగన్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

YS Jagan : జగన్‌పై తిరుగుబాటు గన్‌

భ్రమలు తొలిగాయ్‌

‘నా బొమ్మ చూసే జనం వాళ్లకు ఓట్లు వేశారు. నా వల్లే వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యారు. నా మాటకు వాళ్లు కట్టుబడి ఉంటారు. ఉండాల్సిందే!’.. అనుకుంటున్న ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నమ్మకం, విశ్వాసం, ధీమా అన్నీ చెరిగిపోయాయి. ‘మాకు మళ్లీ టికెట్‌ ఇస్తేనే మిమ్మల్ని గౌరవిస్తాం’ అని అసంతృప్త ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. ఒకరూ.. ఇద్దరూ కాదు! ఏకంగా... 42 మంది ఎమ్మెల్యేలు జగన్‌పై తిరుగుబాటు తుపాకీ గురిపెట్టారు. వాళ్లను శాంతింపజేసేందుకు తన దూత ద్వారా చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో జగన్‌ నాలుగు అడుగులు కిందికి దిగి మరీ అసంతృప్త ఎమ్మెల్యేలకు ‘తాడేపల్లి కోట’ ద్వారాలు తెరవాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

42 మంది వైసీపీ ఎమ్మెల్యేల ధిక్కారస్వరం

జగన్‌తో భేటీకి పలువురి విముఖత

సోమవారం ఏడెనిమిది మంది నేతల రాక

పరిస్థితి ఇక్కడి దాకా వస్తుంటే ఏం చేస్తున్నారని

కీలక నేతలపై మండిపడ్డ ముఖ్యమంత్రి

ఈసారి టికెట్ల నిరాకరణతో అగ్గిమీద గుగ్గిలం

ఎక్కడికక్కడ అసంతృప్త భేటీలు, ఆగ్రహావేశాలు

జగన్‌ తరఫున రంగంలోకి ఎంపీ మిథున్‌

బెంగళూరు గెస్ట్‌హౌ్‌సలో ఎమ్మెల్యేలతో భేటీ

ముగ్గురు మంత్రులు కూడా హాజరు

టికెట్‌ ఇవ్వకుంటే తాడోపేడో అన్న నేతలు

తమకూ సొంత బలముందని స్పష్టీకరణ

చర్చల విఫలంతో తాడేపల్లిలో వణుకు

నేరుగా రంగంలోకి దిగిన సీఎం జగన్‌

ఎమ్మెల్యేలకు తాడేపల్లికి ఆహ్వానం

తొలిసారి తెరుచుకున్న ప్యాలెస్‌ తలుపులు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో జగన్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులకిందటే 11 మంది శాసన సభ్యులను ఇతర నియోజకవర్గాలకు మార్చేశారు. వీరిలోనూ చాలామందికి చివరి నిమిషంలో టికెట్లు ఎగవేస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా 80 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవని వైసీపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తమకున్న మార్గాల ద్వారా ‘అసలేం జరుగుతోంది? ఆ సర్వే సంగతులేంటి? టికెట్లు దక్కని వారి జాబితాలో మేమూ ఉన్నామా?’ అని ఆరాలు మొదలు పెట్టారు. తమను పక్కనపెట్టేశారని తెలిసి భగ్గుమంటున్నారు. అనుయాయుల వద్ద బాహాటంగానే జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కడికక్కడ ‘అసమ్మతి’ సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నా రు. ఈ నేపథ్యంలో.. అసంతృప్త ఎమ్మెల్యేలకు సర్దిచెప్పే బాధ్యతను తన సన్నిహితుడు, వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌ రెడ్డి తీసుకున్నారు.

బెంగళూరు గెస్ట్‌హౌ్‌సలో భేటీ...

తన తండ్రి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న రాయలసీమ, తాను ఇన్‌చార్జిగా ఉన్న గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలతో మిథున్‌ రెడ్డి మాటామంతీ కలిపారు. ‘హితబోధ’లకు ఎవరూ పెద్దగా స్పందించకపోవడంతో... ‘కూర్చుని మాట్లాడుకుందాం రండి’ అని ఆయన బెంగళూరులోని తన గెస్ట్‌హౌ్‌సకు ఆహ్వానించా రు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఆదివారం బెంగళూరులో జరిగిన ఈ భేటీకి 42 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ జాబితాలో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. ఒక మంత్రి తా ను నేరుగా వెళ్లకుండా, తన జీవిత భాగస్వామిని పం పించారు. ‘‘కొన్ని రాజకీయ కారణాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఈసారి మీకు టికెట్‌ ఇవ్వడంలేదు. అంతకుమించి మరో కారణంలేదు. మీకు తగిన అవకాశాలుంటాయి’’ అని మిథున్‌ అనునయించారు. కానీ.. ఏ ఒక్కరూ ఆ మాటలతో సంతృప్తి చెందలేదు. పైగా, కొందరు అగ్గిమీద గుగ్గిలంలా మండిపడ్డా రు. సీమకు చెందిన ఒక ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మీరు ఏమనుకుంటున్నారు? మాకూ సొంతబలం ఉంది. రాటుదేలిన నాయకులను ఓడించి ఎమ్మెల్యేలయ్యాం. ఇప్పుడు టికెట్‌ లేదని పక్కన పడేస్తే జిల్లాల్లో తలెత్తుకుని ఎలా తిరగాలి! టికెట్‌ ఇచ్చి తీరాల్సిందే. అవసరమైతే... మా దారి మేం చూసుకుంటాం’’ అని సూటిగా, ఘాటుగా చెప్పేశారు. తన స్థాయిలో ఎంతగా సర్దిచెప్పినా ఫలితం రాకపోవడంతో మిథున్‌ చేతులెత్తేశారు. పరిస్థితి తీవ్రతను జగన్‌కు చేరవేశారు. ఒకేసారి ఇంతమంది ఎమ్మెల్యేలు తిరగబడటంతో తాడేపల్లి శిబిరంలో వణుకు మొదలైంది. ఇక తానే నేరుగా ఎమ్మెల్యేలకు నచ్చజెప్పాలని జగన్‌ నిర్ణయించుకున్నా రు. అసంతృప్త ఎమ్మెల్యేలతో విడతల వారీగా చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారమే పలువురిని తాడేపల్లి ప్యాలె్‌సకు ఆహ్వానించారు. అయితే.. కేవలం ఏడెనిమిదిమంది శాసనసభ్యులు మాత్రమే జగన్‌ పిలుపునకు స్పందించి వచ్చార ని, మిగిలిన వారికి నచ్చజెప్పి రప్పించే బాధ్యతను ఇద్దరు సీనియర్లకు అప్పగించారని తెలుస్తోంది.

తొలిసారి తెరుచుకున్న ‘కోట ద్వారాలు’

ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు జగన్‌ దర్శనం దుర్లభంగా మారిందని సోమవారం ‘ఆంధ్రజ్యో తి’ ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. యాధృచ్ఛికంగా... సోమవారమే ఎమ్మెల్యేలకు తాడేపల్లి ప్యాలెస్‌ ద్వారాలు తెరుచుకోవడం విశేషం. అసంతృప్త ఎమ్మెల్యేల కార్లు తాడేపల్లి పరిసరాలకు చేరగానే... ఎస్కార్ట్‌ వాహనం ఇచ్చి మరీ సాదరంగా తీసుకు వ చ్చారు. ‘‘150 మందిలో 80 మందికి టికెట్లు నిరాకరించి జగన్‌ ఏం సాధించదలచుకున్నారు? ప్రజల అభిప్రాయాలను కాకుండా, ఏదో ఉత్తరాది సర్వే సంస్థ ఇచ్చిన నివేదికలపై ఆధారపడటమేమిటి? ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు. ఇప్పుడు ఎన్నికల అవసరాలు గుర్తుకురావడంతో మ ర్యాదలు చేస్తున్నారు’’ అని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. అయితే... బెంగళూరు భేటీకి హాజరైన వారు ‘వెళ్లిన మాట నిజమే’ అని అంగీకరిస్తూనే.. ఇతర పనులమీద వెళ్లినట్లుగా చెబుతున్నారు.

జగన్‌ భగభగ: ‘ఎమ్మెల్యేలకు నేను చెప్పిందే వేదం. నా మాటే శాసనం’ అనే భ్రమల్లో ఉన్న జగన్‌ తాజా పరిణామాలతో రగిలిపోతున్నట్లు తెలిసింది. ‘తిరుగుబాటును ఎందుకు గుర్తించలేకపోయారు?’ అని ముఖ్య నేతలపై మండిపడినట్లు సమాచారం.

Updated Date - Dec 19 , 2023 | 02:51 AM