Tahsildar : హుందాతనం కోల్పోతున్న తహశీల్దారు!
ABN , First Publish Date - 2023-05-06T00:30:56+05:30 IST
ఉద్యోగులు రాజకీయాలు మాట్లాడకూడదు, వ్యాపారాలు చేయకూడదు, ప్రభుత్వ వ్యతిరేకమైన పనులు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి; కానీ..

ఉద్యోగులు రాజకీయాలు మాట్లాడకూడదు, వ్యాపారాలు చేయకూడదు, ప్రభుత్వ వ్యతిరేకమైన పనులు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి; కానీ ఉద్యోగి తన విధిని సక్రమంగా నిర్వర్తించకపోతే ఏ చర్యలు తీసుకోవాలో మాత్రం చట్టంలో లేదు. అందరూ పని చేయరని కాదు, కొందరు అన్నీ తామై పని చేస్తుంటారు. మరికొందరికి మాత్రం ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఈ జన్మకి అదో పెద్ద రిలీఫ్.
తహశీల్దారు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటులకు పరిపాలన, న్యాయాలయ అధికారాలు రెండూ కలిసిన ఉద్యోగ బాధ్యతలు, రాజ్యాంగబద్ధమైన విధులు ఉంటాయి. పరిపాలనలో ఉద్యోగిగా, వ్యక్తిగా తహశీల్దారు మొదటి పౌరుడు అవుతాడు. అన్ని శాఖలకు పెద్దన్నలా అన్నింటిలోనూ ముందుండి నడపాలి. మండల పరిధిలోనికి అత్యంత ముఖ్యమైన దేశ, రాష్ట్ర రాజకీయ నాయకులు, అత్యున్నత అధికారులు ఎవరు వచ్చినా ముందుగా స్వాగతం పలకవలసిన ప్రోటోకాల్ విధులు తహశీల్దారుకే ఉంటాయి. తాలూకాలోని ప్రజలకు ‘కుల, నివాస, ఆదాయ, జనన, మరణ, వ్యవసాయ, వ్యవసాయేతర’ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలోను, ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, రైల్వేలను పాడి పరిశ్రమలను కాపాడటంలోను తహశీల్దారు బాధ్యత వహిస్తాడు. వెట్టి చాకిరి నిర్మూలన, చెరువులను కాపాడుతూ వాటికింద పంట చేనులకు పన్నులు వసూలు చేయడం, ప్రభుత్వ భూములను కాపాడటం, చెట్లను, అడవులను, మండల సరిహద్దులను, ఉప్పు నేలలను కాపాడటం, ప్రభుత్వ భూముల కబ్జాలను నిరోధించడం, రెవెన్యూ రికవరీలు, భూ సేకరణలు... ఇవన్నీ తహశీల్దారు పరిధిలోనే ఉంటాయి. దేవాలయ భూములు, సోత్రియాలు, చుక్కల భూములు, వక్ఫ్ భూములు, పట్టా భూమలన్నింటికీ రక్షణదారుడు తహశీల్దారే. ఇలా తహశీల్దారు దాదాపు యాభై రకాల విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. వీరికి ప్రభుత్వం సర్వ సౌకర్యాలనూ అందిస్తుంది.
గతంలో వీరి నియామకానికి పదవ తరగతి సరిపోయేది, ఇప్పుడది డిగ్రీగా ఉన్నది. పై ఉద్యోగ స్థాయికి వెళ్లేందుకు అందరూ పద్దెనిమిది రకాల పరీక్షలు రాయాల్సి ఉంటుంది. కానీ వీరికి రాసే ఏ పరీక్షపైనా నిబద్ధత ఉండదు. ఎవరికీ నేర్చుకోవాలనే కుతూహలం, తపన ఉండదు. ఏదో ఒక రకంగా పాస్ కావడమే తరువాయి, ఇక ప్రమోషన్ల కోసం ఢిల్లీ నుంచి గల్లీదాక ‘నా ప్రమోషన్ ఆగిపోయింది’ అంటూ కొంపలంటుకున్నట్లు బాధపడుతుంటారు. పరిస్థితులు మారి ప్రమోషన్ రాగానే ఆలోచన ధోరణి మారిపోతుంది.
ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌లలో కొందరు ఇంగ్లీషులో కాదు కదా, తెలుగులో కూడా సక్రమంగా రాయలేరు. రాయరాకపోవడం తప్పు కాదు, నేర్చుకోకపోవడం తప్పు. అడిగితే తెలుస్తుంది కానీ, అడగటం నామోషి. ఈ సంఘర్షణలో సతమతవుతూ పరిపాలనను భ్రష్టు పట్టిస్తారు. మండల పరిధిలోని ప్రజా సమస్యలపై ఆందోళనలు జరుగుతున్నప్పుడు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తే 144 సెక్షన్‌ని ప్రయోగించి స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. కాని ఈ తహశీల్దారులు ఆ ప్రొసీడింగ్స్ రాయలేక అవస్థలు పడుతుంటారు.
భూమి అనేది రెవెన్యూ శాఖకు గుండె కాయలాంటిది. కానీ తహశీల్దారులు ఈ భూ వ్యవహారాలపై అవగాహన పెంచుకోరు. తెలియనితనంతో ప్రజలను ఇబ్బందులు పెడుతుంటారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిపాలన మెళకువల కొరకు శాఖాపరమైన తర్ఫీదు ఇచ్చేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం జుబ్లీహిల్స్, హైదరాబాదులో ఉంది. జిల్లావారీగా ట్రైనింగు సెంటర్లున్నాయి. కానీ ఒక్క ఉద్యోగికైనా సీరియస్‌గా నేర్చుకోవాలనే ధ్యాస ఉండటం లేదు.
నిజానికి సమాజంలో ఆదివాసీలు, అత్యంత వెనుకబడిన కులాలు, దళితులు, మైనార్టీలు, మహిళలు రెవెన్యూ కార్యాలయాన్ని దేవాలయంగా భావించి చెప్పులు వదిలి లోపలికి వస్తుంటారు. ఈ ప్రజలను చిరునవ్వుతో పలుకరించి పని చేయాలనే ఇంగితం ఉండదు. వారిని కుర్చీలో కుర్చోబెడదామనే సంప్రదాయం, సంస్కారం ఏదీ ఉండదు. పని లేని పైరవీకారులను మాత్రం గంటల తరబడి కుర్చీలేసి కూర్చోబెడుతుంటారు.
గతంలో ‘తహశీల్దారు గారు ఉన్నారా? కలవచ్చా?’ అనే ముందస్తు అనుమతితోనే స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చేవారు. కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎంపీలు కాకితో కబురంపినా తహశీల్దారు వాళ్ళ ఇంటి ముందు వాలిపోతున్నారు. మండల ప్రధాన పౌరుడిగా సమాజానికి ఇది మంచిది కాదు. అధికారం, ఆత్మగౌరవం, పరిపాలన బాధ్యతలు వీటి మధ్య ఎక్కడ సంయమనం లోపించినా పాలన కుంటుపడుతుంది. పరాయి మనుషులు వీరి మీద పెత్తనం చేస్తారు.
ప్రజలు తహశీల్దారు కార్యాలయాన్ని ఒక న్యాయస్థలిగా చూస్తారు, గౌరవిస్తారు. వారి సమస్యని అధికారులు శ్రద్ధగా వింటే చాలు వారి ఆనందానికి అవధులు ఉండవు. కానీ ఈ వాతావరణాన్ని తహశీల్దారులు తమ కార్యాలయాల్లో కల్పించలేకపోతున్నారు. అందుకే వారి హుందాతనం పలుచనవుతుంది. ఈ ధోరణి పాలకులకు, ప్రజలకు మంచిది కాదు. అందుకే పదోన్నతికి ముందే తహశీల్దారుకు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటుకు ప్రజలతో ఎలా మమేకమవ్వాలో శిక్షణ ఇవ్వాలి. ప్రమోషన్ ఇచ్చే ముందు వారి విధుల పరిధిలోని అంశాల పట్ల వారికి ఎంతటి ప్రవేశం ఉందో పరిశీలించాలి. యోగ్యత లేదని భావిస్తే పదోన్నతిని సంవత్సరం వాయిదా వేయాలి. అప్పుడు వారు తమ విధులు, అధికారాల పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వాలకూ మంచి జరుగుతుంది.
వి. బాలరాజు రిటైర్డు తహశీల్దారు