ప్రమాదాలు జరిగితేనే పట్టించుకుంటారా?
ABN , First Publish Date - 2023-01-23T23:42:03+05:30 IST
అది జాతీయ ప్రధాన రహదారి. ఆ మార్గంలోనే వైరా నదిపై హై లెవల్ వంతెన ఉంది. ఈ మార్గం మీదుగా రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి.

వైరా, జనవరి 23: అది జాతీయ ప్రధాన రహదారి. ఆ మార్గంలోనే వైరా నదిపై హై లెవల్ వంతెన ఉంది. ఈ మార్గం మీదుగా రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రహదారికి, వంతెన నిర్వహణను సంబంధిత అధికారులు గాలికి వదిలేశారు. ఈ వంతెనపైన ఏర్పడిన గుంతలు ప్రాణాంతకంగా ఉన్నాయి. చూసేందుకు చిన్నగుంతలే అయినప్పటికీ నిత్యం ప్రయాణీకులకు ప్రాణసంకటంగా తయారయ్యాయి. వంతెన శ్లాబ్‌లోని జాయింట్ల వద్ద గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్రవాహన చోదకులు ప్రమాదాల బారినపడుతున్నారు. ద్విచక్రవాహనాలతో పాటు ఆటోలు, కార్లు ఇక్కడ ప్రమాదాలకు గురవుతున్నాయి. శ్లాబ్‌ల జాయింట్ల వద్ద అడుగులోతు గోతులు ఏర్పడి దగ్గరకు వచ్చేవరకు అవి కన్పించటం లేదు.
రాత్రి వేళల్లో అయితే..
ఇక రాత్రివేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుంది. ద్విచక్రవాహనాలు ఈ గోతిలోకి దూకిన సమయంలో వంతెనపైనే పల్టీకొడుతూ అనేకమందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. నెలలతరబడి ఈ వంతెనపై గుంతలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కొద్దిరోజుల కిందట ఈ గుంతల వద్ద ముందువెళ్తున్న ద్విచక్రవాహనం వేగం తగ్గడంతో వెనుకనుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. దాంతో దంపతులిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ గుంతల్లో ద్విచక్రవాహన చోదకులు పడిన సమయంలో వారిపై నుంచి భారీ వాహనాలు దూసుకువెళ్లే ప్రమాదం కూడా ఉంది. పలు అంతర్రాష్ట్రాలకు జాతీయ రహదారిగా ఉన్న ఈ వంతెన పైనుంచి నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇలాంటి ఈ వంతెనపై ఏర్పడిన కొద్దిపాటి గుంతలు కూడా పూడ్చటం లేదు. దీనికితోడు ఈ వంతెన కింది భాగంలోనే వైరా మునిసిపాలిటీ డంపింగ్‌యార్డు చెత్తపోసి నిప్పు పెడుతుండటంతో దట్టమైన పొగ అలుముకొని ఈ గుంతలు కన్పించటం లేదు. ఆసమయంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి ఈ గుంతలకు జాతీయ రహదారి అధికారులు వెంటనే మరమ్మతులు చేయించాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.