TSPSC: మళ్లీ గ్రూప్-1 ప్రిలిమ్స్ 3.0 ఎప్పుడంటే..!
ABN , First Publish Date - 2023-09-28T12:36:52+05:30 IST
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎ్‌సపీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ మరోమారు రద్దయింది. మూడోసారి పరీక్ష నిర్వహణ ఎప్పుడు? ప్రిపరేషన్‌కు సమయం ఉంటుందా? కనీసం కరెంట్ అఫైర్స్‌లో
ఇప్పుడప్పుడే నిర్వహించేందుకు నో చాన్స్
హడావుడిగా ప్రిలిమ్స్ 2.0తోనే సమస్యలు
అందుకే.. ఆచితూచి అడుగులేస్తున్న టీఎస్‌పీఎస్సీ
నవంబరులో గ్రూప్-2 పరీక్షలు.. డేట్స్ కష్టమే
డిసెంబరులో ఎన్నికలు జరిగే అవకాశం
జనవరి తర్వాతే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ?
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎ్‌సపీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ మరోమారు రద్దయింది. మూడోసారి పరీక్ష నిర్వహణ ఎప్పుడు? ప్రిపరేషన్‌కు సమయం ఉంటుందా? కనీసం కరెంట్ అఫైర్స్‌లో అప్‌డేట్ అయ్యే చాన్స్ ఇస్తారా? లేదంటే వెంటనే ప్రిలిమ్స్ 3.0కు ప్రకటన వస్తుందా? 3.8 లక్షల మంది గ్రూప్-1 ఆశావహుల్లో ఉత్పన్నమవుతున్న ప్రశ్నలివి. ప్రిలిమ్స్ 2.0 నిర్వహణలో టీఎ్‌సపీఎస్సీ దుందుడుకుతనంతో చేసిన పొరపాట్లు.. మొండివైఖరితో ముందుకు పోతే కోర్టులు మొట్టికాయలేస్తాయనే అనుభవాలు.. అన్నింటికీ ముఖ్యంగా డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలుండడంతో.. ఇప్పుడప్పుడే ప్రిలిమ్స్ 3.0కు అవకాశాలు లేవని తెలుస్తోంది.
డోలాయమానంలో నియామకాలు!
టీఎ్‌సపీఎస్సీ పరీక్షల నిర్వహణ పరిస్థితి ‘ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి..’ అన్నట్లుగా తయారైంది. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి కమిషన్ గతేడాది ఏప్రిల్ 26న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ముందెన్నడూ లేని విధంగా ఎక్కువ పోస్టు లు ఉండడం.. ముందు నుంచి టీఎ్‌సపీఎస్సీ పారదర్శకతపై ప్రకటనలు చేస్తుండడంతో తమ జీవితాల్లో వెలుగురేఖలను చూస్తామని నిరుద్యోగులు ఆశించారు. పెద్దపోస్టు కాకున్నా.. కష్టపడి చదివితే.. ఇంటర్వ్యూలు లేకపోవడంతో గ్రూప్-1 స్థాయిలో చిన్నపోస్టయినా దక్కకపోతుందా? అనే నమ్మకంతో హైదరాబాద్‌లో కోచింగ్‌లు తీసుకున్నారు. ఈ పోస్టులకు మొత్తం 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది అక్టోబరు 16న అత్యంత కఠినంగా ప్రిలిమ్స్ 1.0 నిర్వహణతో.. కమిషన్ పారదర్శకతపై విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఆ పరీక్షకు 2.83 లక్షల మంది హాజరవ్వగా.. ఈ ఏడాది జనవరిలో ఫలితాలు వచ్చాయి. 25,100 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే.. జూన్ 5 నుంచి మెయిన్స్ పరీక్షలు జరిగి.. ఇప్పటికి నియామకాలు కూడా పూర్తయ్యేవి. కానీ, ప్రశ్నపత్రాల లీకేజీతో గ్రూప్-1 ప్రిలిమ్స్ 1.0తోపాటు.. పలు పరీక్షలు రద్దయ్యాయి. మరికొన్ని పరీక్షలు రీషెడ్యూల్ అయ్యాయి. పరీక్షల రద్దు ప్రకటన చేసినప్పుడే.. టీఎ్‌సపీఎస్సీ అధికారులు జూన్ 11న ప్రిలిమ్స్ 2.0ను నిర్వహిస్తామని ప్రకటించారు. నిజానికి ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అభ్యర్థులకు ప్రిపరేషన్‌కు రెండు నెలలే అవకాశం లభించడంతో.. పలువురు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆ పిటిషన్లను కొట్టివేసింది. ‘‘అవకాశం ఇచ్చినా.. టీఎస్‌పీఎస్సీ దాన్ని వినియోగించుకోలేదు. సమర్థంగా పరీక్షను నిర్వహించలేదు’’ అని హైకోర్టు మంగళవారం మొట్టికాయలు వేసేలా ప్రిలిమ్స్ 2.0లో టీఎ్‌సపీఎస్సీ తప్పులు చేయడం గమనార్హం..! బుధవారం నాటి తీర్పుతో ప్రిలిమ్స్ 2.0 రద్దు, ప్రిలిమ్స్ 3.0కు సిద్ధం కావాల్సి రావడం దాదాపు ఖాయమైంది.
ఈ ఏడాది సాధ్యమేనా?
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై టీఎ్‌సపీఎస్సీ సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్తుందా? వెళ్తే.. ఆ కేసు ఫలితం త్వరలో తేలుతుందా? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే హైకోర్టు సింగిల్, డివిజన్ బెంచ్‌లతో మొట్టికాయలు వేయించుకున్న టీఎ్‌సపీఎస్సీ ఒకవేళ ప్రిలిమ్స్ 3.0కు వెళ్లాలని నిర్ణయించినా.. ఇప్పట్లో పరీక్షల నిర్వహణకు పరిస్థితులు కనిపించడం లేదు. అక్టోబరులో ప్రిలిమ్స్‌ను నిర్వహించాలనుకుంటే.. అభ్యర్థులు సమయం కావాలని డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. ఇదే డిమాండ్‌తో కోర్టుకు వెళ్తే.. టీఎ్‌సపీఎస్సీకి మళ్లీ ఇబ్బందులు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్ అయింది. ఒకవేళ అక్టోబరులో ఎన్నికల షెడ్యూల్ వెలువడితే.. ప్రిలిమ్స్ 3.0 ప్రకటన ఉండకపోవచ్చని అంటున్నారు. డిసెంబరులో ఎన్నికలు జరగనుండడంతో.. పరీక్ష హాల్స్‌కు చాన్స్ ఉండదు. జనవరిలో కొత్త అసెంబ్లీ కొలువుదీరుతుంది. ఆ తర్వాతే పరీక్ష నిర్వహణకు అవకాశాలుంటాయని తెలుస్తోంది. అంటే.. జనవరి తర్వాతే ప్రిలిమ్స్ 3.0 ఉంటుందని స్పష్టమవుతోంది. అంటే.. జనవరి తర్వాత ప్రిలిమ్స్ జరిగితే.. యూపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల షెడ్యూల్ లేని పక్షంలో జూన్/జూలైలో మెయిన్స్ జరిగే అవకాశాలున్నాయి.