UNICEF: 40 లక్షల మంది పాక్ చిన్నారుల బతుకు దుర్భరం

ABN , First Publish Date - 2023-01-11T17:57:29+05:30 IST

పాకిస్థాన్ లోని 40 లక్షల మంది చిన్నారులు దుర్భర జీవనం గడుపుతున్నారు. మురుగు కాలువలను తలపించే కలుషిత వరదజలాల సమీపంలో జీవనం ...

UNICEF: 40 లక్షల మంది పాక్ చిన్నారుల బతుకు దుర్భరం

ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan)లోని 40 లక్షల మంది చిన్నారులు దుర్భర జీవనం గడుపుతున్నారు. మురుగు కాలువలను తలపించే కలుషిత వరదజలాల సమీపంలో జీవనం సాగిస్తున్నారు. లైఫ్ సేవింగ్ సపోర్ట్, తగిన షెల్టర్లు లేకుండా, పోషకాహార లోపం, శ్వాస సంబంధిత సమస్యలు, కలుషిత జలాల కారణంగా తలెత్తుతున్న వ్యాధుల మధ్య పోరాటం సాగిస్తున్నారు. గట్టకట్టిస్తున్న చలిగాలులు వారి జీవితాలను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల సహాయ నిధి (UNICEF) ఈ సంచలన నిజాలను తాజాగా వెల్లడించింది. పాకిస్థాన్‌లోని పిల్లల మనుగడ, సంక్షేమం విషయంలో తాజా లెక్కలు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపింది. నాలుగు నెలల క్రితం వరదలు పాక్‌ను ముంచెత్తినప్పటికీ ఆ ప్రభావం ఇప్పటికీ పిల్లల జీవన స్థితిగతులపై కనిపిస్తోందని పాకిస్థాన్‌లోని యునిసెఫ్ ప్రతినిధి ఫదీల్ (Fadil) తీవ్ర ఆవేదనం వ్యక్తం చేశారు.

''వరద బాధితల ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న పిల్లల పరిస్థితి ప్రమాదం అంచుల్లో ఉంది. వర్షాలు ఆగిపోయాయి, కానీ పిల్లల ఎదుర్కొంటున్న సంక్షోభానికి మాత్రం తెరపడ లేదు. సుమారు 10 లక్షల మంది బాలబాలికలకు తక్షణం లైఫ్ సేవింగ్ సపోర్ట్ అవసరం. చలిగాలలను తట్టుకునేందుకు తగిన షెల్టర్లు లేవు. తీవ్రమైన పౌష్టికాహార కొరత, రెస్పిరేటరీ, కలుషిత జలాల వల్ల తలెత్తే వ్యాధులతో లక్షలాది మంది బాలబాలికల జీవితాలు ప్రమాదంలో పడనున్నాయి'' అని ఫదీల్ తాజా ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత జీరో డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా పడిపోతున్న తరుణంలో యునెసెఫ్ ప్రతినిధి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

తాత్కాలిక శిబిరాల్లో లెక్కలేనన్ని కుటుంబాలు

పాక్‌లో వరదలు, వర్షాలకు తెరపడినా, పలు ప్రాంతాల్లో అనేక కుటుంబాలు సరైన షెల్టర్లు లేక, చలిగాలులు తట్టుకోలేక తీవ్ర అవస్థలకు గురవుతున్నాయి. జకోబాబాద్‌లో తాత్కాలిక శిబిరాల్లో మురుగునీరు వద్ద జీవనం సాగిస్తున్న అనేక మంది కనీసం ఒంటికి సరపడా దుస్తులకు సైతం నోచుకోవడం లేదని యునిసెఫ్ తెలిపింది. రాత్రి వేళల్లో అక్కడ ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటోందని చెప్పింది. పాక్‌ ఆర్థిక సంక్షుభిత పరిస్థితుల్లో చిక్కుందని, ఆర్థిక నిల్వలు తరిగిపోతున్నాయని, గోధుమ పిండి ధరలు చుక్కలనంటుతూ, వాటి కోసం జనం ఎగబతుండటంతో తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయని అనేక కథనాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పిల్లల విషయంలో యునిసెఫ్ ఆందోళన మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. పాక్ ప్రస్తుత మానవతా సంక్షోభంపై తగిన రీతిలో ఎప్పటికప్పుడు స్పందిస్తున్నట్టు యునిసెఫ్ తన తాజా ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2023-01-11T18:00:12+05:30 IST