Share News

Uttarkashi Tunnel: ఆ టన్నెల్‌లో 41 మంది కార్మికులు ఎలా చిక్కుకున్నారు? ఎక్కడ తప్పు జరిగింది?

ABN , First Publish Date - 2023-11-28T16:33:25+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌కాశీ టన్నెల్ వ్యవహారానికి ఎట్టకేలకు ‘శుభం కార్డు’ పడింది. ఈ టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ఎన్నో ఒడిదుడుకుల మధ్య..

Uttarkashi Tunnel: ఆ టన్నెల్‌లో 41 మంది కార్మికులు ఎలా చిక్కుకున్నారు? ఎక్కడ తప్పు జరిగింది?

Uttarkashi Tunnel Rescue: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌కాశీ టన్నెల్ వ్యవహారానికి ఎట్టకేలకు ‘శుభం కార్డు’ పడింది. ఈ టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ఎన్నో ఒడిదుడుకుల మధ్య 17 రోజుల తర్వాత విజయవంతం అయ్యింది. దేశంలోని కోట్లాదిమంది చేసిన ప్రార్థనల పుణ్యమా అని.. ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యి, కార్మికులందరూ క్షేమంగా బయటపడ్డారు. అయితే.. ఈ కార్మికులు ఆ టన్నెల్‌లో ఎలా చిక్కుకున్నారు? ఎక్కడ తప్పు జరిగింది? అసలు ఈ టన్నెల్ కథ ఏంటి? అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. పదండి.. ఆ వివరాలేంటో మనం తెలుసుకుందాం..


ఉత్తర్‌కాశీ టన్నెల్

ఉత్తరాఖండ్‌లోని నాలుగు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి మధ్య కనెక్టివిటీని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చార్‌ధామ్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ 4.5 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దీనిని సిల్క్యారా టన్నెల్ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా, దండల్‌గావ్‌లను కలిపే మార్గంలో ఉంది. ఈ సొరంగం సిల్క్యారా వైపు నుండి 2.4 కి.మీ, మరోవైపు నుండి 1.75 కి.మీ నిర్మించబడింది. హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఈ సొరంగాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ గతంలోనూ ఎన్నో భారీ ప్రాజెక్టుల్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. కానీ.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న దాఖాలు లేవు.

ఎక్కడ, ఏం తప్పు జరిగింది?

నవంబర్ 12వ తేదీన సిల్క్యారా వైపు నుండి 205-260 మీటర్ల మధ్య సొరంగానికి చెందిన ఒక భాగం కుప్పకూలింది. దీంతో.. 260 మీటర్ల మార్కుకి అవతలి వైపు ఉన్న కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. బయటకు రావడానికి ఏ మార్గమూ లేదు. అదృష్టవశాత్తూ వాళ్లు ఇరుక్కుపోయిన ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరా ఉంది. అయితే.. ఈ సొరంగం ఎలా కూలిందనడానికి కచ్ఛితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు కానీ, కొన్ని సిద్ధాంతాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఒకటి.. పెళుసుగా ఉన్న హిమాలయ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. అది సున్నితమైన ప్రాంతమని, ఇంత భారీ సొరంగ పనుల వల్ల తట్టుకోలేక ఇలా జరిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

బహుశా.. నిర్మాణ బృందాలు లోపల పేలుడు జరిపి ఉండొచ్చని, దాని వల్లే ఒక భాగం కూలి ఉంటుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే.. ఇది నిజమని నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాలూ లేవు. ఉత్తరాఖండ్ యూనివర్శిటీ ఆఫ్ హార్టికల్చర్ & ఫారెస్ట్రీలో జియాలజిస్ట్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన ఎస్పీ సతి మాట్లాడుతూ.. పేలుడు విషయాన్ని ఏజెన్సీ ఎప్పటికీ అంగీకరించదని, కానీ ఒక పెద్ద పేలుడు వల్లే ఇది కూలిందని తాను కచ్ఛితంగా అనుకుంటున్నానని అన్నారు. ఏది ఏమైనా.. సొరంగంలో జరిగిన ఈ ఘటన వెనుక గల సరైన కారణాలు ఏంటనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలావుండగా.. కార్మికులు సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-11-28T16:33:26+05:30 IST