Aviation Safety : భారత విమానయానానికి గొప్ప గుర్తింపు

ABN , First Publish Date - 2023-04-12T20:12:03+05:30 IST

సురక్షిత విమానయానం విషయంలో భారతీయ వైమానిక రంగం అంతర్జాతీయ ప్రమాణాలను సాధించిందని అమెరికాకు చెందిన ఫెడరల్

Aviation Safety : భారత విమానయానానికి గొప్ప గుర్తింపు
Indian Aviation

న్యూఢిల్లీ : సురక్షిత విమానయానం విషయంలో భారతీయ వైమానిక రంగం అంతర్జాతీయ ప్రమాణాలను సాధించిందని అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకటించింది. చికాగో కన్వెన్షన్‌కు అనుగుణంగా పని చేస్తున్న భారతీయ వైమానిక రంగానికి ఎఫ్ఏఏ ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ అసెస్‌మెంట్ (IASA) కేటగిరీ 1 స్టేటస్‌ కొనసాగుతుందని వివరించింది. ఈ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం వెల్లడించింది.

2022 నవంబరులో మన దేశ విమానయానంపై ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ఆడిట్‌ జరిగింది. ఆ తర్వాత మన దేశ విమానయానం గ్లోబల్ ర్యాంకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. భారతీయ విమానయానంపై నిర్వహించిన మదింపులో సానుకూలాంశాలు కనిపించాయని, వీటి ఆధారంగా ఎఫ్ఏఏ ఐఏఎస్ఏ కేటగిరీ వన్ స్టేటస్‌ను కొనసాగిస్తున్నట్లు బుధవారం ఎఫ్ఏఏ తెలిపిందని డీజీసీఏ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. చికాగో కన్వెన్షన్, దాని అనుబంధ నిబంధనలకు అనుగుణంగా భారతీయ విమానయానం నిర్వహణ జరుగుతున్నట్లు తెలిపిందని వివరించింది.

కేటగిరీ వన్‌లో ఉన్న దేశాల్లోని ఎయిర్‌లైన్స్ అమెరికాలోని నగరాలకు విమానాలను నడపడానికి అనుమతి లభిస్తుంది. అమెరికాలోని ఎయిర్ క్యారియర్స్‌తో కోడ్‌షేర్ చేయడానికి కూడా అవకాశం లభిస్తుంది.

అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందానికి అనుగుణంగా విమానాలను నడపగలిగే సత్తా ఏదైనా దేశానికి ఉందా? లేదా? అనే అంశాన్ని ఐఏఎస్ఏ ప్రోగ్రామ్ ద్వారా పరిశీలిస్తారు. అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా విమానాలను నడపగలిగే దేశాలను గుర్తిస్తారు. అమెరికాలోని నగరాలకు విమానాలను నడుపుతున్న లేదా నడపాలని కోరుకుంటున్న దేశాల సమర్థతను పరిశీలించి, గుర్తింపును ఇస్తారు.

ఐఏఎస్ఏ ప్రోగ్రామ్ క్రింద ఎఫ్ఏఏ 2021 అక్టోబరు 25 నుంచి 29 వరకు డీజీసీఏలో ఆడిట్ జరిగింది. విమానాల కార్యకలాపాలు, ఎయిర్‌వర్దీనెస్, పర్సనల్ లైసెన్సింగ్ వంటి అంశాలను పరిశీలించారు. ఆ తర్వాత గత ఏడాది ఏప్రిల్ 25, 26 తేదీల్లో తుది సంప్రదింపులు జరిగాయి. అనంతరం గత ఏడాది జూలై, సెప్టెంబరు నెలల్లో తదుపరి సమీక్ష జరిగింది. భారత దేశ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ స్కోరు గతంలో 69.95 శాతం ఉండేది, తాజాగా ఇది 85.65 శాతానికి పెరిగింది. దీంతో భారత దేశ గ్లోబల్ ర్యాంకింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. భారత దేశ ఏవియేషన్ సిస్టమ్ యొక్క ఎఫెక్టివ్ సేఫ్టీ ఓవర్‌సైట్‌కు భరోసా ఇవ్వడానికి డీజీసీఏ నిబద్ధతను ప్రదర్శించిందని ఎఫ్ఏఏ తెలిపింది. తమతో కలిసి డీజీసీఏ చేసిన కృషిని ప్రశంసించింది.

మన దేశ విమానయాన రంగం అత్యధిక వృద్ధి పథంలో ఉన్న సమయంలో కేటగిరీ వన్ స్టేటస్ లభించడం హర్షణీయం. మన దేశంలోని విమానయాన సంస్థలు విస్తరణ ప్రణాళికలను రచిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం

Varun Gandhi : యోగి ప్రభుత్వానికి వరుణ్ గాంధీ వినతి

Updated Date - 2023-04-12T20:12:03+05:30 IST