Waqf Bill Passed in Rajyasabha: పెద్దల సభలోనూ అలవోకగా
ABN , Publish Date - Apr 05 , 2025 | 02:50 AM
రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై బీజేపీ అంచనాలకు మించి 128 ఓట్లతో విజయం సాధించింది. బీజేపీకి మద్దతుగా బీజేడీ, వైసీపీ ఎంపీలు ఓటేయడం చర్చనీయాంశమైంది.

వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. 128-95 ఓట్ల తేడాతో విజయం
అర్ధరాత్రి 2 గంటలకు ఓటింగ్
మద్దతిచ్చిన ఐదుగురు బీజేడీ ఎంపీలు
వైసీపీ సభ్యుడు నత్వానీ కూడా!
శరద్ పవార్, శిబూ సోరెన్ గైర్హాజరు
విదేశాంగ మంత్రి జైశంకర్, మ్యాస్ట్రో ఇళయరాజా కూడా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో బీజేపీకి కష్టాలు తప్పవన్నారు.. ఎన్డీయేకు స్వల్ప మెజారిటీ మాత్రమే ఉందని.. నామినేటెడ్, స్వతంత్ర సభ్యుల మద్దతుతో బొటాబొటీ ఆధిక్యంతో విజయం సాధించవచ్చని అంచనా వేశారు. అయితే ఈ అంచనాలను బీజేపీ తలకిందులు చేసింది. బిల్లుకు 128 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకుంది. వీరిలో ఐదుగురు బీజేడీ ఎంపీలు, వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు. ఇంకోవైపు.. ప్రతిపక్షాలకు 33 ఓట్లు తక్కువగా కేవలం 95 ఓట్లే వచ్చాయి. అయితే తాము విప్ జారీ చేశామని, తమ పార్టీ ఎంపీలంతా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొంటున్నప్పటికీ.. నత్వానీ మద్దతుగా ఓటేసినట్లు విస్పష్టంగా తెలిసింది. ఆయన బటన్ నొక్కి వేసిన ఓటు తొలుత నమోదు కాలేదని.. తర్వాత కాగితం తెప్పించుకుని ఓటు వేశారని కొందరు ఎంపీలు చెప్పారు. బీజేపీ వర్గాలు కూడా ఆయన బిల్లుకు మద్దతిచ్చారని చెప్పడం గమనార్హం. బిజూ జనతాదళ్(బీజేడీ) రాజ్యసభా పక్ష నేత సస్మిత్ పాత్రా సభలో స్వయంగా బిల్లుకు మద్దతు ప్రకటించడం, తమ సభ్యులకు విప్ జారీచేయకపోవడం విశేషం. ఆయనతోపాటు ఐదుగురు బీజేడీ ఎంపీలు ఓటేశారు. ఒకరు మాత్రం గైర్హాజరయ్యారు.
ఎన్‌సీపీ(ఎ్‌సపీ) అధినేత శరద్ పవార్, జేఎంఎం అగ్రనేత శిబూ సోరెన్ అనారోగ్య కారణాలతో సభకు రాలేదు (పవార్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు లోక్‌సభలోనూ ఓటింగ్‌లో పాల్గొనలేదు. జేపీసీ సభ్యుడిగా ఉన్న ఆ పార్టీ ఎంపీ సురేశ్ మాత్రే కమిటీ సమావేశాలకే హాజరు కాలేదు). రాజ్యసభలో ఏ కూటమికీ చెందని ఎంపీలు 23 మంది ఉండగా.. వారిలో అత్యధికులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. కేవలం ఏడుగురే బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో 9 ఖాళీలు ఉండగా.. సభలో 236 మంది మిగిలారు. వీరిలో 128 మంది బిల్లుకు మద్దతుగా ఓటు వేయడం.. 13 మంది గైర్హాజరు కావడం బీజేపీ ఎన్నికల నిర్వహణ చాతుర్యాన్ని తెలియజేస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రత్యర్థి పార్టీల ఎంపీలతో పలు సార్లు మంతనాలు జరిపినట్లు సమాచారం.
ఎన్డీయే ఓటింగ్ ఇలా..
గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు సభలో ఓటింగ్ జరిగింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీకి రాజ్యసభలో 98 మంది సభ్యులుండగా.. 97 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విదేశీ పర్యటనలో ఉన్నందున సభకు రాలేదు. జేడీయూ-4, ఎన్‌సీపీ(అజిత్ పవార్)-3, టీడీపీ-2.. ఏజీపీ, ఎంఎన్‌ఎఫ్, ఎన్‌పీపీ, యూపీపీఎల్, జేడీఎస్, ఆర్‌ఎల్‌డీ, ఆర్‌పీఐ (అథావలే), శివసేన (షిండే), ఆర్‌ఎల్‌ఎం పార్టీలకు చెందిన ఒక్కో ఎంపీ బిల్లుకు మద్దతిచ్చారు. ఆరుగురు నామినేటెడ్ సభ్యుల్లో ఐదుగురు అనుకూలంగా ఓటేయగా.. ప్రముఖ సంగీత దర్శకుడు ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా గైర్హాజరయ్యారు. ఓ స్వతంత్ర సభ్యుడు కూడా అధికార కూటమికి మద్దతు పలికారు. వక్ఫ్ బిల్లుకు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ మద్దతివ్వడం ఆయన పార్టీ జేడీయూలో తీవ్ర విభేదాలకు దారితీసినా.. ఎంపీలంతా ఆయన మాటకే కట్టుబడి అనుకూలంగా ఓటేశారు. ప్రభుత్వం తమ సందేహాలను నివృతి చేసిందని, తాము ప్రతిపాదించిన సవరణలను ఆమోదించిందని రాజ్యసభలో ఆ పార్టీ నేత సంజయ్ ఝా చెప్పారు.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News