Rahul Gandhi On I.N.D.I.A : ఇండియా వర్సెస్ నరేంద్ర మోదీ మధ్య పోరాటం: రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2023-07-18T18:24:30+05:30 IST
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఒకే వేదికపైకి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు తమ నూతన కూటమికి ‘ఇండియా’ అనే పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. I - ఇండియా, N - నేషనల్, D - డెమొక్రాటిక్, I - ఇంక్లూజివ్, A - అలయెన్స్ (INDIA)గా వర్ణించాయి.
బెంగళూరు: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఒకే వేదికపైకి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు తమ నూతన కూటమికి ‘ఇండియా’ అనే పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. I - ఇండియా, N - నేషనల్, D - డెమొక్రాటిక్, I - ఇంక్లూజివ్, A - అలయెన్స్ (INDIA)గా వర్ణించాయి. తెలుగులో చెప్పాలంటే.. భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్టి కూటమిగా నిర్ణయించాయి. బెంగళూరులో సోమ, మంగళవారాల్లో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, అప్నాదళ్ (కే), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే, వీసీకే, కేఎండీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), కేరళ కాంగ్రెస్ (జోసఫ్) పార్టీలు పాల్గొన్నాయి. రెండవ రోజయిన మంగళవారం కూటమి పేరుగా ఇండియాను ఖరారు చేశాయి. ఇండియా కూటమి తదుపరి సమావేశం ముంబైలో నిర్వహించేందుకు నిర్ణయించారు. అనంతరం కీలక నేతలు ప్రసంగించారు. కూటమిపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఎవరేమన్నారో చూద్దాం..
భారత్ గొంతు కోసం జరుగుతున్న పోరాటం: రాహుల్ గాంధీ
‘‘ఈ సమావేశంలో పాల్గొనడం నాకు గౌరవం. ఇండియా అనే భావవపై దాడి జరుగుతోంది. కోట్లాది మంది భారతీయుల నుంచి ఇండియా గొంతును లాక్కొని నరేంద్ర మోదీ సన్నిహితులైన కొంతమంది వ్యాపారులకు అప్పగిస్తున్నారు. ఇది భారత్ గొంతు కోసం జరుగుతున్న పోరాటం. అందుకే ఇండియా పేరును ఖరారు చేశాం. ఎన్టీఏ వర్సెస్ ఇండియా, నరేంద్ర మోదీ వర్సెస్ ఇండియా, ఇండియా వర్సెస్ వాళ్ల ఐడియాలజీ మధ్య పోరాటం ఇది. భారత రాజ్యాంగం, దేశ ప్రజల గొంతు, దేశం అనే గొప్ప భావనపై దాడిని మేము నిలువరిస్తున్నాం. భారత్ అనే భావనకు ఎదురు నిలబడితే ఎవరు గెలుస్తారో మనందరికీ తెలుసు’’ అని రాహుల్ గాంధీ ఎన్డీయే కూటమిని హెచ్చరించారు.
ఎన్డీయే.. ఇండియాను చాలెంజ్ చేయగలవా?: మమతా బెనర్జీ..
బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశం బాగా జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ కూటమిని ఇండియా అని పిలుస్తామని అన్నారు. ఇంగ్లిష్‌లో ఇండియా, భారత్ అని పిలవొచ్చు అని అన్నారు. ఎన్డీయే.. ఇండియా కూటమిని సవాలు చేయగలవా? అని ఛాలెంజ్ చేశారు. మాతృభూమిని తాము ప్రేమిస్తామని, ఈ దేశ భక్తులం తామేనని అన్నారు. దేశం కోసం, ప్రపంచం కోసం, రైతుల కోసం, అందరి కోసం ఉన్నామని మమతా బెనర్జీ అన్నారు.
ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు: మల్లికార్జున్ ఖర్గే..
మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రతిపక్ష పార్టీల సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని చెప్పారు. భారత దేశ ఆత్మ, రాజ్యాంగం, లౌకికవాదం, సాంఘిక న్యాయం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించడంపై మాత్రమే తమ పార్టీకి మక్కువ ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. అవి అధిగమించలేనంత పెద్ద విభేదాలు కావని, ప్రజలను కాపాడటం కోసం వాటిని పక్కన పెట్టవచ్చునని చెప్పారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారన్నారు. నిరుద్యోగంతో బాధ పడుతున్న యువత కోసం, హక్కుల అణచివేతకు గురవుతున్న పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల కోసం వాటిని వదిలిపెట్టవచ్చునని చెప్పారు.
స్వచ్ఛమైన అవినీతి కూటమి
ఇదిలావుండగా.. ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగళూరులో సమావేశమైన పార్టీలకు ఒకే ఒక మంత్రం ఉందని, అది.. కుటుంబం యొక్క, కుటుంబం ద్వారా, కుటుంబం కోసం అని వివరించారు. ఇది స్వచ్ఛమైన అవినీతి కూటమి అని ఆరోపించారు. అందుకే ప్రజలు 2024లో మళ్లీ ఎన్డీయేను అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్నారన్నారు.