Nehru Museum : నెహ్రూ మ్యూజియం పేరు మార్పు.. రాహుల్ గాంధీ మండిపాటు..

ABN , First Publish Date - 2023-08-17T13:20:28+05:30 IST

భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు కీర్తి, ప్రతిష్ఠలు రావడానికి కారణం ఆయన చేసిన కృషి అని, కేవలం పేరు కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. న్యూఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరును ప్రధాన మంత్రుల మ్యూజియం అని మార్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Nehru Museum : నెహ్రూ మ్యూజియం పేరు మార్పు.. రాహుల్ గాంధీ మండిపాటు..
Rahul Gandhi

న్యూఢిల్లీ : భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు కీర్తి, ప్రతిష్ఠలు రావడానికి కారణం ఆయన చేసిన కృషి అని, కేవలం పేరు కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారు. న్యూఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరును ప్రధాన మంత్రుల మ్యూజియం అని మార్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నెహ్రూ మ్యూజియం పేరు మార్పుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ‘ఎన్’ అనే అక్షరాన్ని మార్చి, ‘పీ’ అనే అక్షరాన్ని పెట్టారని, ఇది బీజేపీ చిల్లర రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాహుల్ గాంధీ గురువారం లడఖ్ వెళ్తూ, విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు. నెహ్రూ గారికి ఆయన చేసిన కృషి వల్ల కీర్తి, ప్రతిష్ఠలు వచ్చాయని, అవి కేవలం పేరు వల్ల లభించినవి కాదని చెప్పారు.

ఢిల్లీలోని నెహ్రూ స్మారక సంగ్రహాలయం మరియు గ్రంథాలయం పేరును ఆగస్టు 14న ప్రధాన మంత్రుల సంగ్రహాలయం మరియు గ్రంథాలయం అని మార్చారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందిస్తూ, ప్రధాని మోదీకి చాలా భయాలు ఉన్నాయన్నారు. సంక్లిష్టతలు, అభద్రతలతో ఆయన బాధపడుతున్నారన్నారు. నెహ్రూ చరిత్రను తిరస్కరించి, అపఖ్యాతిపాలు చేయడమే ఆయన ఏకైక ఎజెండా అని దుయ్యబట్టారు.

ఈ మ్యూజియానికి పేరు మార్చడంపై బీజేపీ వాదన ఏమిటంటే, గతంలో ఈ మ్యూజియం, లైబ్రరీలో నెహ్రూ మినహా ఇతరులకు స్థానం లేదు. ఇప్పుడు నెహ్రూతో పాటు ఇతర ప్రధాన మంత్రులకు కూడా స్థానం కల్పించారు. ఈ దేశానికి ప్రధాన మంత్రిగా పని చేసిన ప్రతి నేత చేసిన సేవలను గుర్తు చేసుకొనే విధంగా దీనిలో ఏర్పాట్లు చేశారు.

ఈ మ్యూజియం ఉపాధ్యక్షుడు ఏ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ, నెహ్రూ సేవలను తక్కువ చేసి చూపడం లేదన్నారు. నెహ్రూను తాము ఏ విధంగా చూపిస్తున్నామో ఎవరైనా చూడవచ్చునని చెప్పారు. ఆధునిక దేవాలయాలైన హీరాకుండ్, నాగార్జున సాగర్ ఆనకట్టల కోసం ఆయన చేసిన కృషిని వివరించామన్నారు.


ఇవి కూడా చదవండి :

Flesh-eating bacteria : ఒంట్లో మాంసాన్ని తినేసే బాక్టీరియా.. ముగ్గురి మృతి..

Fact Check : ఇస్రో శాస్త్రవేత్తలకు జీతాలివ్వడం లేదా?

Updated Date - 2023-08-17T13:20:28+05:30 IST