India Thailand Relations: భారత్‌ది వికాసవాదమే విస్తరణ వాదం కాదు
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:04 AM
ప్రధాని మోదీ థాయ్‌లాండ్ పర్యటనలో వికాసవాదాన్ని నమ్ముతామని, విస్తరణవాదాన్ని తాము ఆశించమని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, చట్టబద్ధ వ్యవస్థ కోసం భారత్ కట్టుబడి ఉందని తెలిపారు

థాయ్‌లాండ్‌తో సంబంధాలు
‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత,
సమ్మిళిత, చట్టబద్ధ వ్యవస్థ ఉండాలని ఆకాంక్ష
ఈశాన్య రాష్ట్రాలకు థాయ్‌తో మరింత సహకారం ..
థాయ్‌లాండ్ పర్యటనలో ప్రధాని మోదీ
బ్యాంకాక్, ఏప్రిల్ 3: భారత్ అభివృద్ధిని ఆకాంక్షించే వికాసవాదాన్ని నమ్ముతుందే తప్ప, విస్తరణవాదాన్ని కాదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, పారదర్శక, సమ్మిళిత, చట్టబద్ధ వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. థాయ్‌లాండ్ పర్యటనకు వచ్చిన ఆయన గురువారం థాయ్ ప్రధాని పెటోంగ్‌టార్న్ షినవత్రతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమెతో జరిపిన చర్చల్లో భారత్-థాయ్‌లాండ్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు-థాయ్‌లాండ్‌ల మధ్య పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాలు, విద్యా రం గాల్లో సహకారం పెంపొందింపచేసుకోవాలని నిశ్చయించినట్టు తెలిపారు. భారత్ అమలు చేస్తున్న ‘లుక్ ఈస్ట్ పాలసీ’, ఇండో-పసిఫిక్ విజన్‌లో థాయ్‌లాండ్‌కు ప్రత్యేక స్థానం ఉందని వివరిం చారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చాలని, రెండు దేశాల భద్రత సంస్థల మధ్య వ్యూహాత్మక చర్చలు జరగాలని కూడా నిర్ణయించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. తన పర్యటనను పురస్కరించుకొని థాయ్‌లాండ్ ప్రభుత్వం 18వ శతాబ్దంనాటి రామాయణ కుడ్య చిత్రాన్ని పోస్టల్ స్టాంప్‌గా విడుదల చేయడంపై మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని షినవత్ర బహూకరించిన త్రిపిఠక ‘స్వర గ్రంధాన్ని’ స్వీకరించారు. మోదీ రాకను పురస్కరించుకొని థాయ్ రామాయణం ‘రామకెయిన్’ను మనోహరంగా ప్రదర్శించారు. 6వ బిమ్‌స్టెక్- ‘బంగాళాఖాత బహుళరంగ సాంకేతిక ఆర్థిక సహకార ఉపక్రమణం’ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) సదస్సులో పాల్గొనేందుకు ఆయ న ఇక్కడికి వచ్చారు. ఈ కూటమిలో భారత్‌తో పాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్‌లకు సభ్యత్వం ఉంది. సముద్రయానంపై ఒప్పందం చేసుకునేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేశారు. సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ పక్కపక్కనే కూర్చోవడం గమనార్హం. కాగా, ఇటీవల సంభవించిన భూకంపంలో మరణించిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.