Supreme Court verdict: 25 వేలమంది టీచర్ల నియామకాలు రద్దు
ABN , Publish Date - Apr 04 , 2025 | 06:11 AM
సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్‌లో 25 వేలమంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మొత్తం నియామక ప్రక్రియ అవకతవకలతో నిండి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది

సుప్రీంకోర్టు సంచలన తీర్పు
మమత ప్రభుత్వానికి ఝలక్
నియామక ప్రక్రియంతా అవకతవకలేనన్న ధర్మాసనం
నోట్ల కట్టల జడ్జిని బదిలీ చేసినట్లు టీచర్లను చేయొచ్చుగాఇంతమందిని తొలగిస్తే పాఠాలు చెప్పేదెవరు?: మమత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ పరిధిలోని 25 వేల మందికిపైగా టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. నియామక ప్రక్రియ మొత్తం మోసపూరితంగా, అవకతవకలతో కూడుకొని ఉందని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌ల సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. నియామక ప్రక్రియలో విశ్వసనీయత, చట్టబద్ధత లోపించాయని పేర్కొంది. పరిష్కరించడానికి సాధ్యంకానంతగా ఈ ప్రక్రియ మొత్తం కలుషితమైపోయిందని ఆక్షేపించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏమీ తమకు కనిపించడం లేదని తెలిపింది. మోసపూరితంగా నియామకాలు పొందిన అభ్యర్థులు ఏళ్లతరబడి పొందిన జీతాలను వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని, అయితే, వారి నియామకాలను రద్దు చేస్తున్నామని ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన మమతా బెనర్జీ ప్రభుత్వం.. కళంకిత అభ్యర్థులు, కళంకితంకాని అభ్యర్థులను వేర్వేరుగా చూడాలని కోరగా.. నియామక ప్రక్రియ ప్రతిదశలోనూ మభ్యపెట్టే, కప్పిపుచ్చే చర్యలున్నందున ఎవరు కళంకితులో, ఎవరు కాదో నిర్ధారించడం కష్టంగా మారిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నియామక ప్రక్రియలో బెంగాల్ ప్రభుత్వం సృష్టించిన సూపర్‌న్యూమరరీ పోస్టులు ఈ వివాదానికి కేంద్రంగా మారాయి. 2016లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎంపిక పరీక్షకు 23 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం ఖాళీలు 24,640 కాగా, 25,753 మందికి నియామక పత్రాలు జారీ చేశారు. దీంతో అక్రమ నియామకాల కోసమే అదనంగా సూపర్‌న్యూమరిక్ పోస్టులు సృష్టించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా, ఉపాధ్యాయ నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పును వ్యక్తిగతంగా తాను అంగీకరించబోనని, అయితే, ఆ తీర్పును తన ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. నియామక ప్రక్రియను తిరిగి నిర్వహిస్తామని చెప్పారు. గురువారం కోల్‌కతాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ బెంగాల్‌లో విద్యావ్యవస్థ కుప్పకూలాలని ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం కోరుకుంటున్నాయా? అని ప్రశ్నించారు. మోసపూరితంగా నియామకాలు పొందిన కొంతమంది వల్ల అభ్యర్థులందరినీ శిక్షించడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. ‘ఇటీవల ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడినప్పుడు ఆయనను బదిలీతో సరిపుచ్చారు. మరి ఈ ఉపాధ్యాయులను ఎందుకు బదిలీతో సరిపుచ్చరు?’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
Supreme Court Orders: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest National News And Telugu News