Budget 2023 : కేంద్ర బడ్జెట్‌పై స్పందనలు

ABN , First Publish Date - 2023-02-01T14:39:49+05:30 IST

జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) మాట్లాడుతూ, ఇది కేవలం క్రోనీ కేపిటలిస్టులు,

Budget 2023 : కేంద్ర బడ్జెట్‌పై స్పందనలు
Nirmala Sitharaman

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు. దీనిపై వివిధ రాజకీయ పక్షాలు విభిన్నంగా స్పందించాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మాట్లాడుతూ, నారీ శక్తి సాధికార దేశాన్ని ఏ విధంగా నిర్మించగలదో ఈ బడ్జెట్ స్పష్టం చేసిందని తెలిపారు. ఈ బడ్జెట్‌ను రూపొందించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఓ మహిళ అనే విషయాన్ని స్మృతి ఇరానీ పరోక్షంగా ప్రస్తావించారు. బాలలు, వయోజనుల కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను స్వాగతించారు. ఇది మధ్య తరగతి బొనాంజా బడ్జెట్ అని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమ్మిళిత అభివృద్ధి గురించి నొక్కి వక్కాణించారని చెప్పారు. ఇది సమ్మిళిత బడ్జెట్ అని పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, వృద్ధులు... ఇలా అందరికీ ఈ బడ్జెట్‌లో స్థానం కల్పించారన్నారు.

రాజ్‌నాథ్ సింగ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఇచ్చిన ట్వీట్‌లో, ఈ బడ్జెట్‌తో దేశంలో సకారాత్మక (Positive) మార్పులు వస్తాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు అభివృద్ధి చెందాలనే మన లక్ష్యం దిశగా ఈ మార్పులు నడిపిస్తాయన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడాన్ని, పన్ను స్లాబులను సవరించడాన్ని స్వాగతించారు. ఈ పరిమితిని ప్రస్తుత రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మార్గదర్శనంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమాలపై దృష్టి సారించిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. రైతులు, మహిళలు, అణగారిన వర్గాలు, మధ్య తరగతి ప్రజలకు ప్రాధాన్యం లభించిందన్నారు. ఈ బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కన్నా 13 శాతం ఎక్కువ.

మెహబూబా ముఫ్తీ

జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) మాట్లాడుతూ, ఇది కేవలం క్రోనీ కేపిటలిస్టులు, పెద్ద వ్యాపారులకు మాత్రమే లబ్ధి చేకూర్చే బడ్జెట్ అని ఆరోపించారు. గడచిన 8-9 సంవత్సరాల నుంచి వస్తున్న బడ్జెట్ వంటిదే ఇది కూడానని తెలిపారు. పన్నులు పెంచారని, సంక్షేమ పథకాల కోసం నిధులు ఖర్చు చేయడం లేదని పేర్కొన్నారు. కొందరు క్రోనీ కేపిటలిస్టులు, పెద్ద వ్యాపారుల కోసం పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. పన్నుల వల్ల ప్రజలు లబ్ధి పొందాలని, కానీ వారి వెన్ను విరుగుతోందని చెప్పారు. సామాన్యులకు ఇచ్చే రాయితీలను రద్దు చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో పేదరికం నుంచి బయటపడ్డామని, కానీ ఇప్పుడు మళ్లీ పేదరికంలోకి జారుకుంటున్నామని మండిపడ్డారు.

అఖిలేశ్ యాదవ్

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ఇచ్చిన ట్వీట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజల్లో ఆశలను పెంచడానికి బదులు నిరాశ మిగిల్చిందని ఆరోపించారు. ఈ బడ్జెట్ వల్ల ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మరింత పెరుగుతాయన్నారు.

శశి థరూర్

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్‌లో కొన్ని మంచి విషయాలు ఉన్నాయని తెలిపారు. అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ నిరుపేదలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం వంటివాటి గురించి దీనిలో ప్రస్తావనే లేదన్నారు. కొన్ని ప్రాథమిక ప్రశ్నలు సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయన్నారు.

కార్తి చిదంబరం

కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం (Karti Chidambaram) ఇచ్చిన ట్వీట్‌లో, తక్కువ పన్నుల విధానం వల్ల ప్రయోజనం ఉంటుందని తాను నమ్ముతానని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉత్తమ మార్గం ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు పెట్టడమని , అందువల్ల ఆదాయపు పన్ను తగ్గింపు స్వాగతించదగినదని తెలిపారు.

మార్కెట్లు

కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (NSE Nifty 50) దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 1,076.55 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 264.25 పాయింట్లు పెరిగింది. రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోల్చినపుడు 8 పైసలు పెరిగి, 81.80కు చేరింది.

Updated Date - 2023-02-01T14:39:55+05:30 IST

News Hub