Nityananda Kailasa: అసలు ఎవరీ విజయప్రియ? ఇప్పుడిదే హాట్ టాపిక్..
ABN , First Publish Date - 2023-03-02T13:53:29+05:30 IST
ఐక్యరాజ్యసమితిలోని జెనీవా కార్యాలయంలో అందమైన ముఖ వర్చస్సుతో.. నుదుటిపై పెద్ద బొట్టు.. మెడలో రుద్రాక్ష జపమాల ధరించి ఆంగ్లంలో ప్రసంగిస్తున్న మహిళ వీడియో ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించింది.
జెనీవా : ఐక్యరాజ్యసమితిలోని జెనీవా కార్యాలయంలో అందమైన ముఖ వర్చస్సుతో.. నుదుటిపై పెద్ద బొట్టు.. మెడలో రుద్రాక్ష జపమాల ధరించి ఆంగ్లంలో ప్రసంగిస్తున్న మహిళ వీడియో ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించింది. స్వయంప్రకటిత దేవుడు.. రేప్, కిడ్నాప్ కేసుల్లో నిందితుడు అయిన నిత్యానంద ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆమె ఫోటోను పోస్ట్ చేయడంతో ఆ మహిళ మరింత సంచలనంగా మారారు. ప్రస్తుతం నిత్యానంద గ్లోబల్ స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్నారు. నిత్యానంద తానొక ‘యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస’ అనే దేశాన్ని సృష్టించానని, అక్కడ ప్రజలు హిందూ మత విశ్వాసాల ప్రకారం తమ జీవితాలను గడుపుతున్నారని తెలిపారు. ఇక ఇప్పుడు సొంత దేశం ‘కైలాస’ ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి (యూఎన్) సదస్సుకు హాజరయ్యారన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
నిత్యానంద తన సొంత దేశం కైలాస స్థాపన గురించి గొప్పగా చెబుతున్నప్పటికీ, దాని అసలు ఉనికిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. అలాంటిది.. జెనీవాలో నిర్వహించిన సదస్సుకు కైలాస తరఫున ‘మా విజయప్రియ నిత్యానంద’ తదితరులు హాజరయ్యారని నిత్యానంద చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు కైలాస తరుఫున ఆమె శాశ్వత రాయబారి అని చెప్పడం మరింత విడ్డూరంగా మారింది. ఐక్యరాజ్యసమితి ఫిబ్రవరి 24న జెనీవాలో 19వ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులపై సదస్సును నిర్వహించింది. ఫిబ్రవరి 24న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (CESCR) నిర్వహించిన సుస్థిర అభివృద్ధిపై జరిగిన ఒక చర్చలో.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస నుంచి ఇద్దరు వ్యక్తులు ప్రసంగించారు. అయితే కైలాస ప్రతినిధులు అందించిన ఇన్‌పుట్‌లను పరిగణలోకి తీసుకోబోమని ఐక్యరాజ్యసమితి తేల్చి చెప్పింది.
దేశం విడిచి పారిపోయి.. తనకున్న డబ్బు, పరపతితో ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించిన నిత్యానందస్వామి లాంటి వ్యక్తుల ప్రతినిధులకు ఐక్యరాజ్యసమితిలో ప్రవేశం ఎలా లభించింది? అలా ఎవరిని పడితే వారిని మాట్లాడడానికి అనుమతిస్తారా? నిత్యానందలా రేపు మరో నేరగాడు ఎవరైనా తానో దేశాన్ని ఏర్పాటు చేశానని ప్రకటించి తన ప్రతినిధులను యూఎన్‌కు పంపిస్తే వారికి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చేస్తారా? వంటి సందేహాలన్నీ పక్కనబెడితే అసలు ఎవరీ విజయ ప్రియ అనేది హాట్ టాపిక్‌గా మారింది.
విజయప్రియ ఎవరంటే..
'కైలాస'కు సంబంధించిన వెరిఫైడ్ ఫేస్‌బుక్ ఖాతా ప్రకారం.. ఐక్యరాజ్యసమితిలో విజయప్రియ నిత్యానంద కైలాస దేశం శాశ్వత రాయబారి. ఆమె తనను తాను అమెరికాలోని వాషింగ్టన్ డిసి నగర నివాసిగా పేర్కొన్నారు. విజయప్రియకు కైలాసలో దౌత్యవేత్త హోదా ఉంది. ‘కైలాస’ వెబ్‌సైట్ ప్రకారం.. విజయప్రియ నిత్యానంద ఈ వర్చువల్ కంట్రీ తరపున సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఐక్యరాజ్యసమితి సదస్సులో విజయప్రియ పలు దేశాల ప్రతినిధులతో సమావేశమై ఆ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక వీడియోలో విజయప్రియ నిత్యానంద కొంతమంది అమెరికన్ అధికారులతో కొన్ని ఒప్పందాలపై సంతకం చేస్తున్నట్లు కనిపించింది. కైలాస ప్రపంచంలోని అనేక దేశాలలో తన రాయబార కార్యాలయాలు, ఎన్‌జీవోలను ప్రారంభించిందని విజయప్రియ నిత్యానంద పేర్కొన్నారు.