Anurag Thakur: మిస్టర్ 'వి' ఎవరు? కేజ్రీకి సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2023-03-11T19:53:26+05:30 IST

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీజేపీ విమర్శల దాడి పెంచింది. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి..

Anurag Thakur: మిస్టర్ 'వి' ఎవరు? కేజ్రీకి సూటి ప్రశ్న


న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi Excise policy) కేసులో బీజేపీ విమర్శల దాడి పెంచింది. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రధాన సూత్రధారి (Kingpin) అని కేంద్ర సమాచార, ప్రసార, యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శనివారంనాడు ఆరోపించారు. లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఆప్ కార్యకర్త విజయ్ నాయర్‌తో సీఎంకు ఉన్న సంబంధం ఏమిటని మంత్రి ప్రశ్నించారు.

లిక్కర్ స్కామ్‌ కేసులో విచారణ సందర్భంగా తాము కొన్ని వాట్సాప్ మెసేజ్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. "V needs money' అనే సంభాషణలు అందులో ఉన్నాయని ఈడీ పదేపదే చెబుతోంది. 'వి' అంటే విజయ్ నాయర్‌గా అనుమానిస్తోంది. అనురాగ్ ఠాకూర్ సైతం ఆప్ నేతలకు ఈ అవినీతిలో ప్రమేయం ఉందని, ఢిల్లీ ప్రజలను పదేపదే ఫూల్స్ చేస్తోందని చెబుతున్నారు. ఈ మొత్తం కుంభోకోణానికి ప్రధాన సూత్రధారి ఆయనే అని తాజాగా మరోసారి ఆరోపించారు.

''కింగ్‌పిన్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. 'వీ' అంటే ఎవరు? 'వీ నీడ్స్ మనీ' అనే మెసేజ్ రిసీవ్ చేసుకున్నదెవరు? ఆయనతో మీకు (అరవింద్ కేజ్రీవా) సంబంధం ఏమిటి? ఎక్సైజ్ పాలసీ డ్రాఫ్టింగ్ సమయంలో అతను ఉన్నాడా?'' అని ఠాకూర్ తాజాగా ముఖ్యమంత్రిపై ప్రశ్నలు గుప్పించారు.

లిక్కర్ కుంభకోణం కేసులో ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తొలుత సీబీఐ, ఆ తర్వాత మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. సీబీఐ అరెస్టు నేపథ్యంలో తన మంత్రి పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న మనీష్ సిసోడియా జైలు నుంచే శనివారంనాడు ఓ ట్వీట్ చేస్తూ, జైలులో ఉంచి తనకు కష్టాలు కల్పించవచ్చు కానీ, తన స్ఫూర్తిని నీరుగార్చలేరని అన్నారు.

Updated Date - 2023-03-11T19:53:26+05:30 IST