Wrestlers : బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు తాత్కాలిక బెయిలు మంజూరు
ABN , First Publish Date - 2023-07-18T16:14:31+05:30 IST
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారం తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది.
న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (WFI chief Brij Bhushan Sharan Singh)కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారం తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది. ఈ కేసులో మరో నిందితుడు వినోద్ తోమర్‌కు కూడా తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తులతో వీరిద్దరికీ రెండు రోజులపాటు బెయిలు మంజూరైంది. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో జూన్ 15న ఛార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
నిందితులిద్దరూ రెగ్యులర్ బెయిలు కోసం చేసుకున్న దరఖాస్తులపై ఈ నెల 20న విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది. ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల ఆధారంగా వీరిపై ఐపీసీ సెక్షన్లు 354, 354డీ, 345ఏ, 506(1) ప్రకారం ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. బ్రిజ్ భూషణ్ తమను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించారని, తమ ఛాతీ నుంచి వెనుకవైపు చేతితో తడిమారని ఆరోపించారు. మహిళా రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌లతో చర్చలు జరిపిన అనంతరం పోలీసులు ఈ కేసులో ఛార్జిషీటును దాఖలు చేశారు.
ఇదిలావుండగా, బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు చేసిన మైనర్ రెజ్లర్ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. వినోద్ తోమర్ డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీగా పని చేసేవారు. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఇదిలావుండగా, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని బ్రిజ్ భూషణ్ చెప్తున్నారు.
ఈ కేసులో మీడియా విచారణ జరుగుతోందని, చార్జిషీటులో ఆరోపణలు సరైన రీతిలో లేవని నిందితులు ఆరోపించారు. అయితే సరైన రీతిలో దరఖాస్తు చేయాలని కోర్టు నిందితులను ఆదేశించింది. న్యాయమూర్తులను ప్రస్తావించేటపుడు తప్పుగా ప్రస్తావించవద్దని, అలా చేస్తే బాధ్యత వహించవలసి ఉంటుందని మీడియా సిబ్బందిని కోర్టు హెచ్చరించింది. తప్పుడు రిపోర్టింగ్ చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి :
Bengaluru Opposition meet : ప్రతిపక్షాల సమావేశం.. నితీశ్ కుమార్‌కు షాక్..