Diwali Holiday: ఇకపై దీపావళికి అమెరికాలోనూ హాలీడే.. న్యూయార్క్ బాటలోనే పెన్సిల్వేనియా!
ABN , First Publish Date - 2023-04-27T13:51:34+05:30 IST
హిందువులు ఎంతో వైభవంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళికి (Diwali) రోజురోజుకు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోంది.
ప్రభుత్వ సెలవు ప్రకటించిన పెన్సిల్వేనియా
పెన్సిల్వేనియా: హిందువులు ఎంతో వైభవంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళికి (Diwali) రోజురోజుకు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో లక్షలాదిగా సెటిలైన భారతీయుల కోసం అక్కడి ప్రభుత్వాలు సెలవులు (Diwali Holidays) సైతం ఇస్తున్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో భారీ సంఖ్యలో ఉన్న భారతీయులు కూడా ప్రతియేటా దీపావళిని అంగరంగా వైభవంగా నిర్వహించుకుంటారనే విషయం తెలిసిందే. ఏకంగా దేశ అధ్యక్షుడు అధికార భవనం వైట్ హౌజ్‌లోనూ (White house) ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్‌లోని పెన్సిల్వేనియా రాష్ట్రం (Pennsylvania State) కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ రోజు స్టేట్ హాలీడే (State Holiday) ప్రకటించింది. దీపావళి రోజున సెలవు ఇవ్వాలనే బిల్లును తాజాగా సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ మేరకు సెనేటర్ నికిల్ సవాల్ (Senator Nikil Saval) ట్వీట్ చేశారు. దీపావళిని జరుపుకునే పెన్సిల్వేనియా ప్రజల తరపున ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ బిల్లును ఆమోదించడంలో సెనేటర్ జార్జ్ రోత్‌మన్‌తో (Greg Rothman) కలిసి పనిచేయడం తాను గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కాగా, ఈ బిల్లును సెనేట్ 50-0 ఓట్ల తేడాతో ఆమోదించిందని రోత్‌మన్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ఏడాది నవంబర్ 12న దీపావళి సందర్భంగా పెన్సిల్వేనియాలోనూ సెలవు రానుంది. ఇక పెన్సిల్వేనియాలో దాదాపు 2లక్షల మంది దక్షిణాసియా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇదిలాఉంటే.. ఇప్పటికే న్యూయార్క్ కూడా దీపావళి రోజున సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పెన్సిల్వేనియా కూడా అదే బాటలో నిర్ణయం తీసుకోవడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.