TANA: తానా ఎన్నికల నామినేషన్ల ఘట్టం నేటితో ముగింపు.. రంగంలో హేమాహేమీలు

ABN , First Publish Date - 2023-02-23T18:43:29+05:30 IST

నేటితో తానాలో ముగియనున్న నామినేషన్ల ఘట్టం

TANA: తానా ఎన్నికల నామినేషన్ల ఘట్టం నేటితో ముగింపు.. రంగంలో హేమాహేమీలు
Srinivas Gogineni, Naren Kodali

  • తానా ఎన్నికల్లో భావోద్వేగ వాతావరణం - నామినేషన్ల గడువు పూర్తి

  • తానా అధ్యక్ష పదవికి పాత కాపుల పునః ప్రవేశంతో అంతటా ఉత్కంఠ

  • తానా ఎన్నికల్లో రెండువర్గాలు పోటాపోటీగా వేసిన నామినేషన్లతో మొదలైన సందడి

అత్యంత ప్రతిష్టాత్మకమైన తానా(TANA) ఎన్నికల నామినేషన్ల ఘట్టం నేటితో పూర్తి కాగా తాజా సమాచారం మేరకు రెండు వర్గాలు పోటాపోటీగా అన్నిపదవులకు నామినేషన్లు వేసినట్టు తెలుస్తోంది. 4 బోర్డు అఫ్ డైరెక్టర్స్, 29 ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు 7 తానా ఫౌండేషన్ ట్రస్టీ పదవులు కలసి మొత్తంగా 40 పదవులకు పోటాపోటీ నామినేషన్లను బలీయమైన రెండు వర్గాలు అమెరికాలోని 50 రాష్ట్రాల సభ్యులను జల్లెడ పట్టి మరీ ఎంపిక చేసి బరిలో నిలిపినట్లు సమాచారం. ముఖ్యంగా కీలకమైన తదుపరి అధ్యక్ష పదవికి పోటీకై మిచిగాన్ లో నివసించే శ్రీనివాస గోగినేని మరియు వర్జీనియా లో నివసించే నరేన్ కొడాలి వంటి ఉద్దండులు పోటీ చేస్తుండటం, వారిద్దరూ అత్యంత సీనియర్లే కాక ఇంతకూ మునుపు ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఉండటంతో పాటు వర్గాల దన్ను పుష్కలంగా ఉండటంతో ఈ సారి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తాజా సమాచారం మేరకు ఇద్దరి అధ్యక్ష అభ్యర్థుల ప్యానెల్ లోను అనుభవము తో పాటు మహిళలు, యువత కలగలిసిన టీమ్ లు సమకూరడంతో ఎన్నికల సరళి మరియు ఫలితాలపై ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా చర్చలు సాగుతున్నాయి.

శ్రీనివాస గోగినేని సీనియర్ తానా నాయకునిగా ఉండటమే గాకుండా గతంలో తానా ఫౌండేషన్ చైర్మన్ గా అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన గుర్తింపు తో పాటు 2015 డిట్రాయిట్ తానా కాన్ఫరెన్స్ నకు సెక్రటరీ గా కూడా పనిచేసి న కారణంగా అనేకమందితో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు కలిగి ఉన్నారు. సంస్కరణల అభిలాషిగా చెప్పబడే ఈయన గతం లో రెండుసార్లు ఇండిపెండెంట్ పోటీ చేసినప్పటికీ ఈసారి బలమైన వర్గం దన్నుతో పూర్తి ప్యానెల్ తో ముందుకు రావడం తో ఎన్నికల పోటీపై ఆసక్తి కలిగిస్తోంది. ఈయన ప్యానెల్ టీం నకు తదుపరి అధ్యక్షులైన నిరంజన్ శృంగవరపు, గత అధ్యక్షులైన జయ్ తాళ్లూరి తో పాటు పలువురు పెద్దలు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.

నరేన్ కొడాలి కూడా సీనియర్ నాయకునిగా ఉంటూ గతంలో బోర్డు చైర్మన్ గా విజయవంతంగా పనిచేయడమే గాకుండా 2019 వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ నకు చైర్మన్ గా పనిచేసియున్నారు. వృత్తి రీత్యా ప్రొఫెసర్ కావడంతో పాటు గత ఎన్నికలలో పూర్తి ప్యానెల్ తో గట్టి పోటీ ఇచ్చిన కారణంగా వచ్చిన గుర్తింపుకు కు తోడు అనేకమందితో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు కలిగి ఉన్నారు. గత ఎన్నికలు పూర్తైనప్పటి నుండీ తిరిగి బరిలో ఉండటానికి అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈయన ప్యానెల్ టీం నకు ప్రస్తుత అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, గత అధ్యక్షులు గంగాధర్ నాదెళ్ల, సతీష్ వేమన తో పాటు పలువురు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం

గత కొద్ద్దికాలంగా వివిధ కారణాలతో తానా లోని వివిధ కార్యవర్గాల మధ్యన మరియు నాయకుల మధ్యన పరిమితికి మించి పెరిగిన వర్గ వైషమ్యాలు మూలంగా కొంత ఇబ్బంది కర వాతావరణం కలగటంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలని లేదా సామరస్యపూర్వకంగా జరగాలని పలువురు కోరుతున్నారు. ఇందుకు గాను గత అధ్యక్షులైన జయరాం కోమటి ఇప్పటికే పలు దఫాలుగా ఇరు వర్గాలతో చేసిన చేసిన రాజీ ప్రయత్నాలు సఫలం కాకపోయినప్పటికీ ఎన్నికలు నివారించడానికై కృషి కొనసాగున్నట్లు వినికిడి.

Updated Date - 2023-02-23T19:17:08+05:30 IST