Seediri Appalaraju: ఏదో జరుగుతోంది.. జగన్ తీసే ఫస్ట్ వికెట్ సీదిరి అప్పలరాజే ఎందుకయ్యారంటే..
ABN , First Publish Date - 2023-04-01T09:24:01+05:30 IST
మత్స్య, పశు సంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు హడావుడిగా శుక్రవారం తాడేపల్లికి పయనమయ్యారు. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పలు కార్యక్రమాల్లో..
మంత్రి సీదిరి హడావుడిగా తాడేపల్లికి పయనం
సీఎం జగన్‌తో భేటీ
పదవి లేకపోయినా బాధపడను
తరచూ స్వీయ వివరణ ఇస్తున్న అప్పలరాజు
శ్రీకాకుళం జిల్లాలో జోరందుకున్న చర్చ
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
మత్స్య, పశు సంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు (YCP Minister Seediri Appalaraju) హడావుడిగా శుక్రవారం తాడేపల్లికి (Tadepalli) పయనమయ్యారు. సీఎం జగన్‌తో (CM Jagan) భేటీ అయ్యారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam District) పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనాల్సి ఉండగా.. వాటిని రద్దు చేసుకుని మరీ తాడేపల్లి వెళ్లడంతో.. ‘ఏదో జరుగుతోంది’ అన్న చర్చ సాగుతోంది. మంత్రి పదవి నుంచి ఆయనను తొలగిస్తారనే ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు (AP MLC Elections) కొద్దిరోజుల ముందే మంత్రి పదవిపై సీదిరి అప్పలరాజు స్వీయ వివరణ ఇవ్వడంతో వైసీపీ శ్రేణుల్లోనూ, ప్రజల్లోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల శ్రీకాకుళంలోని విలేకరుల సమావేశంలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్సీ సీట్ మా సామాజికవర్గానికి చెందిన వారికి ఇతర జిల్లాలో ఇచ్చారు. మంత్రిగా నన్ను తప్పించి.. ఎవరికి అవకాశం ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు’’ అని తెలిపారు. కాగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన నేతలపై కేసులు పెట్టించడంతో పాటు అధికార పార్టీ హవా చూపిస్తున్న ఓ ఎమ్మెల్సీకి మంత్రి పదవి కట్టబెడతారని.. సీదిరికి ఉద్వాసన పలుకుతారని కొద్దిరోజుల నుంచి ప్రచారం జోరందుకుంది.
ఇది కూడా చదవండి: Jagan Team 3.0 : ఏపీ కేబినెట్‌లో మళ్లీ మార్పులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులను తీసుకునే యోచనలో వైఎస్ జగన్..!
తాజాగా... శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి పదవి ఉన్నా లేకపోయినా బాధపడను. మంత్రి పదవికన్నా ప్రజా సేవే ముఖ్యం’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘బీసీ నుంచి వచ్చిన నాకు మంత్రి పదవి జగన్ ఇచ్చారు. కాగా కొత్తగా నలుగురికి మంత్రి పదవులు ఇవ్వనున్నారని.. పాతవారిని తొలగించనున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే సమాచారం నా వద్ద లేదు. పదవి లేక పోయినా బాధపడను’’ అని సీదిరి పేర్కొన్నారు. దీంతో మంత్రి పదవి నుంచి ఆయనను తొలగిస్తారనే అనుమానాలకు బలం చేకూరుతోంది.
ఇది కూడా చదవండి: YSRCP : ఏప్రిల్-3 చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు.. వైఎస్ జగన్ బిగ్ డెసిషన్స్ తీసుకుంటారా.. ఆ ఎమ్మెల్యేలకు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారా..!?
స్వపక్షంలోనే అసమ్మతి
శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా లేని విధంగా.. పలాస నియోజకవర్గంలో స్వపక్షంలో విపక్షం తయారైంది. రెండు వర్గాలుగా విడిపోయి.. మంత్రి సీదిరిపై బహిరంగంగానే అసమ్మతి వెళ్లగక్కుతున్నారు. పలుమార్లు అసమ్మతి నేతలు సమావేశమై.. మంత్రి నియోజకవర్గంలోని అక్రమాలను పరోక్షంగా వెలుగులోకి తెస్తున్నారు. మంత్రి చుట్టూ చేరిన నలుగురి వల్ల.. సీదిరికి మరింత ఇబ్బంది కరపరిస్థితి ఏర్పడిందని.., ఇదే అస మ్మతికి కారణమని ప్రచారం జరుగుతోంది. మంత్రి అనుచరులపై భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. వీటిని అరికట్టడంలో తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.