AP Politics: ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి.. విప్‌ల నియామకంపై సర్వత్రా ఆసక్తి
ABN , Publish Date - Nov 12 , 2024 | 04:48 PM
ఆంధ్రప్రదేశ్ ఉభయ సభల్లో చీఫ్ విప్, విప్ ల నియామకం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవిపైనా ఉత్కంఠ వీడనుంది. ఏ పార్టీకి ఏ పదవులు అందుకుంటుందనే విషయంపై క్లారిటీ రానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం జరుగుతోంది.
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. శాసనసభ, మండలిలో అనుసరించే వ్యూహం, రాజకీయ పరిణామాల పై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఉభయ సభల్లో చీఫ్ విప్, విప్ ల నియామకం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నిన్న జరిగిన బీఏసీలో సీఎం చంద్రబాబు చీఫ్ విప్, విప్ ల ప్రస్తావన లేవనెత్తారు. శాసనసభలో 9 మంది విప్ లను నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. టీడీపీ నుంచి ఐదుగురు, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ ను నియమించే అవకాశం ఉంది.
ఉచిత ఇసుక విధానం సమగ్రంగా అధ్యయనం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇసుక, మద్యం జోలికి వెళ్ళొద్దని గట్టిగా ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ సమావేశంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అంశాన్ని లేవనెత్తారు. ఈ విధానం సరిగా లేదన్నారు. అందుకు సమాధానమిచ్చిన సీఎం.. ముందు అసలు ఇసుక విధానం చదివావా అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఇసుక విధానం సమగ్రంగా చదివి ఎవరి పరిధిలో వారు అది సక్రమంగా అమలు చేయాల్సిందేనని చంద్రబాబు అన్నారు. ఇసుక విధానంలో సమస్య ఎక్కడుందో చెప్తే ఇప్పుడే పరిష్కారం చెప్తానంటూ ఎమ్మెల్యేలకు సీఎం సవాల్ విసిరారు.
పర్యాటక రంగం అభివృద్ధి పైనా సమావేశంలో సుదీర్ఘ చర్చ నడిచింది. ప్రతీ నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. టీటీడీ సిఫార్సు లేఖల అంశాన్ని లేవనెత్తబోయిన రఘురామ కృష్ణ రాజుకు నారా లోకేష్ సమాధానమిచ్చారు. 18న జరిగే బోర్డు సమావేశంలో సమస్య పరిష్కారమవుతుందని ట్రిపులార్ ఆయన వివరించారు.