Viral News: 80 అడుగుల వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు.. దూకొద్దని చెప్పిన పోలీసులకు అతడు ఇచ్చిన సమాధానం విని నోరెళ్లబెట్టిన జనం..
ABN , First Publish Date - 2023-11-03T18:38:03+05:30 IST
కొందరు చిన్న చిన్న కారణాలకూ ఆత్మహత్యాయత్నం పేరుతో హడావుడి చేయడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు వారి డిమాండ్లకు తలొగ్గిన పక్షంలో నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుంటారు. అయితే మరికొన్నిసార్లు కామెడీ అనుకున్నది కాస్తా.. సీరియస్గా మారిపోతుంటుంది. ఇంకొన్నిసార్లు..
కొందరు చిన్న చిన్న కారణాలకూ ఆత్మహత్యాయత్నం పేరుతో హడావుడి చేయడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు వారి డిమాండ్లకు తలొగ్గిన పక్షంలో నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుంటారు. అయితే మరికొన్నిసార్లు కామెడీ అనుకున్నది కాస్తా.. సీరియస్గా మారిపోతుంటుంది. ఇంకొన్నిసార్లు సీరియస్ అనుకున్నది కాస్తా.. సిల్లీగా మారిపోతుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడు 80 అడుగుల వాటర్ ట్యాంక్ ఎక్కేశాడు. దూకొద్దు.. దూకొద్దు.. అని సలహా ఇచ్చిన పోలీసులకు అతడి ఇచ్చిన సమాధానం విని అంతా నోరెళ్లబెట్టారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) ఉజ్జయిని జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంట్రల్ భైరవగఢ్ జైలు సమీపంలో ఉన్న 80 అడుగుల వాటర్ ట్యాంక్ వద్దకు.. సాగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వచ్చాడు. ఉన్నట్టుండి ట్యాంకు గేట్ తాళాలు పగులకొట్టి ట్యాంక్ (young man climbs water tank)పైకి ఎక్కాడు. దీంతో చుట్టు పక్కల వారు ఒక్కసారిగా కంగారుపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. దూకొద్దు.. దూకొద్దు అని గట్టిగా అరుస్తూ సలహా ఇచ్చారు. తర్వాత కొందరు పోలీసులు.. ఎంతో చాకచక్యంగా పైకి ఎక్కారు.
చివరకు పోలీసులు.. నీ సమస్య ఏంటీ.. అని మెల్లగా అతన్ని ప్రశ్నించగా.. ‘‘నా బీడీ కింద పడిపోయింది.. దాన్ని వెతుక్కుంటూ పైకి వచ్చా’’.. అని సమాధానం ఇవ్వడంతో పోలీసులతో పాటూ అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఆ వెంటనే అతను.. ‘‘రండి అంతా కలిసి కిందకు దూకి బీడీ కోసం వెతుకుదాం’’.. అని అనడంతో చివరకు వారు నచ్చజెప్పాల్సి వచ్చింది. వేరే బీడీలు కొనిస్తామని పోలీసులు మాటివ్వడంతో ఎట్టకేలకు అతను వారితో పాటూ కిందకు వచ్చాడు. విచారణలో సదరు యువకుడి మానసకి పరిస్థితి సరిగా లేదని తెలిసింది. దీంతో చివరకు అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.