K viswanath: సినీ ప్రేమికుడు.. కార్మికుడు.. ఖాకీ కథ ఇదే!

ABN , First Publish Date - 2023-02-03T11:49:04+05:30 IST

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. కంటెంట్‌ క్రియేట్‌ చేసే ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టైల్‌ ఉంటుంది. వ్యక్తిగతంగా వారి తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్‌ దర్శకులు కొందరు సెట్‌లో అడుగుపెడితే ఒక్కో పద్దతిని, ఆహార్యాన్ని అనుసరిస్తుంటారు.

K viswanath: సినీ ప్రేమికుడు.. కార్మికుడు.. ఖాకీ కథ ఇదే!

సినిమా ఇండస్ట్రీలో (K viswanath)ప్రతి ఒక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. కంటెంట్‌ క్రియేట్‌ చేసే ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టైల్‌ ఉంటుంది. వ్యక్తిగతంగా వారి తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్‌ దర్శకులు కొందరు సెట్‌లో అడుగుపెడితే ఒక్కో పద్దతిని, ఆహార్యాన్ని అనుసరిస్తుంటారు. దర్శకరత్న దాసరి నారాయణరావు సెట్‌లో అడుగుపెడితే శ్రామికుడిలా మారిపోయేవారు. కె రాఘవేంద్రరావు (krr) ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తారు. కోడి రామకృష్ణ తలకు గుడ్డ కట్టుకుంటారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌ దర్శకుడిగా సెట్‌లో అడుగుపెడితే ఒంటిపై ఖాకీ దుస్తులు ఉండాల్సిందే. ఆయన ఖాకీ దుస్తులు ధరించడం వెనుక ఓ కథ ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన పంచుకున్నారు. (K viswanath, about khaki Dress)

3.jpg

‘‘సెట్‌లో ఖాకీ దుస్తులు ధరించడం వెనుక చాలా పెద్ద కథ ఉంది. (K.viswanath is nomore) సౌండ్‌ రికార్డిస్ట్‌గా ఉండి దర్శకుణ్ణి అయినవాణ్ణి. ఈ కారణాలతో తల బిరుసు రావడానికి అవకాశాలు ఎక్కువ. ఎమ్మెల్యే అయినవాడు మంత్రి కావాలనుకుంటాడు. మంత్రి అయినవాడు ముఖ్యమంత్రి సీట్‌లో కూర్చొవాలని కలలు కంటుంటాడు. సినిమా పరిశ్రమలోనూ అంతే. ఏ విభాగంలో అడుగుపెట్టినా.. ఫైనల్‌ టార్గెట్‌ దర్శకుడి కుర్చీనే. అలాంటి కుర్చీ నాకు దక్కితే కళ్లు నెత్తికెక్కే ప్రమాదం ఉంటుంది కదా? ఆ అవకాశం ఇవ్వకూడదనుకున్నా. దర్శకుణ్ణి అయిపోగానే తెల్ల ప్యాంట్‌, తెల్ల చొక్కా, తెల్ల బూట్లు, మెడలో గొలుసులు వేసుకుని హడావిడి చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు. అందరిలా మామూలు మనిషిలా ఉండాలనుకున్నా. అందుకే నిజాయతీగా ఓ ప్రయత్నం చేశా. నా సెట్లో పనిచేేస పెయింటర్స్‌, లైట్‌బాయ్స్‌, హెల్పర్స్‌.. అందరికీ ఖాకీ దుస్తులే ఇచ్చి ధరించమనేవాణ్ణి. కాకపోతే వాళ్లకు నిక్కరు, నాకు ప్యాంటు అంతే తేడా. ‘మీరు ఖాకీ డ్రస్సు వేసుకోవడం ఏమిటండీ..’ అని మా ఆర్ట్‌ డైరెక్టర్‌ తెగ గొడవ పడేవాడు. ‘మొదటి సినిమా సరైన ఫలితం ఇవ్వకపోతే.. వెంటనే టాక్సీ డ్రైవరుగా మారిపోతా. అప్పుడు కుట్టించుకోవడానికి వీలు ఉంటుందో లేదో.. ఓ జత రెడీ ఉన్నట్టుంటుంది’ అని చెప్పా! అది దొంగ మాటే అయినా.. అందులో కొంత నిజం లేకపోలేదు. తొలి సినిమా రోజుల్లో చాలా భయం ఉండేది. నాకు తెలిసిన జర్నలిస్ట్‌ ‘మీ సినిమా కోసం రాస్తాం’’ అని అడిగితే.. ‘మొదటి సినిమాకి ఏం రాయొద్దు. ఎందుకంటే నా సినిమా తుస్సుమంటే మీరేం రాసినా ఉపయోగం ఉండదు. రెండు, మూడు సినిమాలు తీశాక, నాలో ప్రతిభ ఉందనిపిస్తే రాయండి’ అనేవాడిని. వాళ్ల సరదాగా నవ్వుకునేవారు’’ అని చెప్పుకొచ్చారు.

2.jpg

కె.విశ్వనాథ్‌కు నివాళులు అర్పించిన దర్శకుడు చైతన్య దంతులూరి కళాతపస్వి ఖాకీ దుస్తులు ధరించడంపై ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ‘‘సినిమాను డైరెక్ట్‌ చేసే సమయంలో ఖాకీ ఽధరించి పని చేసే సినీ ప్రేమికుడు.. కార్మికుడు- ‘కె.విశ్వనాథ్‌గారు. కళల విషయంలో ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన తరహా చిత్రాలను ఇకపై చూడలేము. సినీ కళామతల్లి ముద్దు బిడ్డ, నా ప్రియమైన కామ్రేడ్‌ విశ్వనాథ్‌గారికి పాదాభివందనం’’ అని ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-02-03T12:44:32+05:30 IST