Viral: 32ఏళ్ళ కిందట ఆ తల్లి చూసిన ఒకే ఒక్క సినిమా ఆమె కొడుకు జీవితాన్ని మలుపు తిప్పింది.. అసలు వీళ్ల స్టోరీ ఏంటంటే..
ABN , First Publish Date - 2023-09-12T17:07:10+05:30 IST
పంక్చర్ షాపు ద్వారా వచ్చే ఆదాయంతో గుడ్డిదీపంలా నడిచే ఆ ఇల్లు, ఆ ఇంటి ఇల్లాలి ఆలోచనతో మార్పుకు లోనయ్యింది.
సినిమాలు సాధారణ ప్రజలమీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మంచి అయినా చెడు అయినా సినిమాల నుండి ప్రజలు నేర్చుకునేది ఎక్కువేననేది అందరూ నమ్మాల్సిన సత్యం. సినిమాలను చూసి స్పూర్తిని తెచ్చిపెట్టుకున్నా దాన్ని కొనసాగించి సక్సెస్ అయ్యేవారు బహుశా అరుదుగా ఉంటారు. అహద్ కుటుంబం అలాంటి అరుదైన కుటుంబం. 32ఏళ్ల కిందట అహద్ తల్లి చూసిన ఒకే ఒక్క సినిమా వారి కుటుంబ స్వరూపాన్నే మార్చేసింది. పంక్చర్ షాపు ద్వారా వచ్చే ఆదాయంతో గుడ్డిదీపంలా నడిచే ఆ ఇల్లు, ఆ ఇంటి ఇల్లాలి ఆలోచనతో మార్పుకు లోనయ్యింది. అసలింతకూ ఎవరీ అహద్ . అతని తల్లి చేసిన పనేంటి? వీరు సాధించిందేంటి? పూర్తీగా తెలుసుకుంటే..
1991లో రాజేష్ ఖన్నా(Bollywood actor Rajesh Khanna) నటించిన ఘర్ పరివార్(Ghar Parivar) అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాలో హీరోయిన్ బట్టలు కుట్టడం ద్వారా డబ్బు సంపాదించి తన పిల్లల స్కూల్ ఫీజు కడుతుంది. ఈ సినిమా అఫ్సానాను చాలా ప్రభావితం చేసింది. ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం ప్రయాగ్ రాజ్ కు చెందిన పెహజాద్ అహ్మద్ తో అఫ్సానా వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. గత 35ఏళ్ల నుండి పెహజాద్ అహ్మద్ ఇంటి దగ్గరే సైకిల్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. షాపు ద్వారా వచ్చే ఆదాయంతో ముగ్గురు పిల్లల చదువు, ఖర్చులు సరిపోయేవి కాదు. అదే సమయంలో అఫ్సానా ఘర్ పరివార్ సినిమా చూసి ప్రేరణ పొందింది. రుపాయి రుపాయి కూడబెట్టి కుట్టు మిషన్ కొని, ఊరిలో ఆడవారికి బట్టలు కుట్టిచ్చేది. దీనిద్వారా వచ్చే ఆదాయాన్ని పిల్లల స్కూలు ఫీజులకోసం ఉపయోగించేది. ఈ క్రమంలోనే పెద్ద కొడుకు తన చదువు పూర్తీ చేసి ప్రైవేటు ఉద్యోగం చూసుకున్నాడు. రెండవ కొడుకు అహద్ అహ్మద్ కు చిన్నతనం నుండి చదువు మీద ఉన్న ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కొడుకును ఏమాత్రం నిరాశపరచకుండా ప్రోత్సహించింది.
Viral Video: నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో.. పుట్టీ పుట్టగానే ఈ సింహం పిల్ల ఏం చేసిందో చూడండి..
అహద్ అహ్మద్ ఇంటర్ వరకు ప్రభుత్వ కాలేజీలోనే చదివాడు. ఆ తరువాత న్యాయశాస్త్రం చదువుతానని తల్లితో చెబితే ఆమె ప్రోత్సహించింది. దీంతో అలహాబాద్ యూనివర్సిటీలో బిఏ ఎల్ఎల్బి(B.A LLB) ఎంట్రన్స్ కూడా రాశాడు. అందులో అర్హత పొందాడు కానీ ఏడాదికి 38వేలు.. 5ఏళ్లు డబ్బు కట్టాల్సిరావడంతో వెనకడుగు వేయబోయాడు. కానీ అహద్ తల్లి మాత్రం వెనకడుగు వేయలేదు. అప్పు చేసి కొంత, తనకు దొరికిన ప్రతి నిమిషం బట్టలు కుడుతూ మరికొంత డబ్బు పోగు చేసి కొడుకును చదివించింది. ఎల్ఎల్బి పూర్తయ్యాక అహద్ కోర్టుకు ప్రాక్టీస్ కు వెళ్లేవాడు. కోవిడ్ కారణంగా కోర్టు మూతపడితే ఇంట్లోనే ఉంటూ PCS-J పరీక్షకు సన్నద్దం అయ్యాడు. ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించి, మెయిన్స్ లోనూ తన సత్తా చాటాడు. కానీ ఇద్దరు ప్రసిద్ద న్యాయమూర్తుల సమక్షంలో జిరగిన ఇంటర్య్వూలో ఇతను నిరాశ పడ్డాడు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సరిగా ఇవ్వలేకపోయానని అన్నాడు. ఆగస్టు 30న ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(UPPSC) ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాలలో అహద్ 157వ ర్యాంక్ తో సివిల్ జడ్జ్ గా ఎంపికయ్యాడు. అతను జడ్జ్ అయిన విషయాన్ని మొదట తన తల్లితోనే పంచుకున్నాడు. అన్నేళ్ళ తన కష్టానికి ఫలితంగా తన కొడుకు విజయం లభించిందని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తెలివైన, స్పూర్తివంతమైన మహిళ తన కుటుంబాన్ని, పిల్లలను విజయం వైపు ఎలా నడిపిస్తుందనే దానికి అఫ్సానా పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది.