Share News

ICC Rankings: టీ20ల్లో నంబర్‌వన్‌గా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్

ABN , First Publish Date - 2023-12-06T16:20:42+05:30 IST

Team India: టీమిండియా యువ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా రవి బిష్ణోయ్ అవతరించాడు. 699 పాయింట్లతో రవి బిష్ణోయ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ICC Rankings: టీ20ల్లో నంబర్‌వన్‌గా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్

టీమిండియా యువ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా రవి బిష్ణోయ్ అవతరించాడు. 699 పాయింట్లతో రవి బిష్ణోయ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో రవి బిష్ణోయ్ నిలకడగా రాణించడంతో ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపాడు. ఐదు మ్యాచ్‌లలో 9 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆప్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ రెండో స్థానానికి పడిపోయాడు. రషీద్ ఖాన్ ఖాతాలో 692 పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో శ్రీలంక బౌలర్ హసరంగ (679), ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ (679) సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. శ్రీలంక బౌలర్ మహీష్ తీక్షణ 677 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. శామ్ కరణ్ (ఇంగ్లండ్), ఫజల్లా ఫారుఖీ (ఆప్ఘనిస్తాన్), ముజీబుర్ రెహ్మాన్ (ఆప్ఘనిస్తాన్), ఆకీల్ హుస్సేన్ (వెస్టిండీస్), అన్రిచ్ నోకియా (దక్షిణాఫ్రికా) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

కాగా దక్షిణాఫ్రికా పర్యటనలోనూ రవి బిష్ణోయ్ సత్తా చాటితే వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంటాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకుల్లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 855 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ ఒక స్థానం దిగజారి ఏడో స్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా 265 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీ20 ఫార్మాట్‌తో పాటు వన్డే, టెస్ట్‌ల్లోనూ టీమిండియా నెంబర్‌వన్ జట్టుగా నిలిచింది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-06T16:20:44+05:30 IST