Asian Games 2023: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సెంచరీకి చేరువలో భారత్..!!
ABN , First Publish Date - 2023-10-06T21:41:46+05:30 IST
ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. 72 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు అందుకోనుంది.
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. 13వ రోజు షెడ్యూల్ పూర్తయ్యే నాటికి మొత్తం 95 పతకాలను కైవసం చేసుకుంది. సెంచరీకి చేరువలో ఉంది. దీంతో 72 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు అందుకోనుంది. 2018 ఆసియా గేమ్స్‌లో 70 పతకాలు రాగా.. ఇప్పటికే ఈ రికార్డును భారత క్రీడాకారులు అధిగమించారు. భారత్ సాధించిన పతకాల్లో 22 స్వర్ణాలు, 34 రజతాలు, 39 కాంస్యాలు ఉన్నాయి. మెడల్స్ పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. చైనా 354 పతకాలతో తొలి స్థానంలో ఉండగా జపాన్ 169 పతకాలతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు కూడా 169 పతకాలే ఉన్నాయి. అయితే స్వర్ణాలు జపాన్ ఎక్కువ సాధించడంతో మూడో స్థానానికి పరిమితమైంది.
ఇది కూడా చదవండి: Asian Games 2023: ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. గోల్డ్ మెడల్ పక్కా.. ఎందుకంటే..?
కాగా శుక్రవారం మొత్తం భారత్‌కు 9 పతకాలు వచ్చాయి. పురుషుల హాకీ విభాగంలో భారత్ స్వర్ణ పతకం సాధించింది. మహిళల ఆర్చరీ, పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో కాంస్య పతకాలు, బ్రిడ్జిలో పురుషుల టీమ్‌కు రజతం వచ్చాయి. అటు సెపక్‌తక్రా ఈవెంట్‌లో భారత మహిళల జట్టుకు కాంస్య పతకం రాగా పురుషుల రికర్వ్ ఆర్చరీ టీమ్ రజత పతకం సాధించింది. రెజ్లింగ్‌లో మహిళల 62 కేజీల విభాగంలో కాంస్యం, మహిళల 76 కిలోల విభాగంలో కాంస్యం, పురుషుల 57 కిలోల విభాగంలో కాంస్యం వచ్చాయి. అటు పురుషుల క్రికెట్ జట్టులో ఫైనల్ చేరిన టీమిండియా కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. శనివారం జరిగే ఫైనల్లో ఆప్ఘనిస్థాన్‌ను ఓడిస్తే భారత్‌కు స్వర్ణం దక్కనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియాకు ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని అభిమానులు భావిస్తున్నారు. మహిళల కబడ్డీ జట్టు సైతం ఫైనల్ చేరి మెడల్ ఖాయం చేసింది.