BRS Party : కారులో కొట్లాట
ABN , First Publish Date - 2023-06-17T03:54:13+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో సిటింగ్‌లకు, ఆశావహుల మధ్య కొట్లాటలు చోటుచేసుకుంటున్నాయి.

ఆశావహులు- సిటింగ్‌ల మధ్య కుమ్ములాటలు
అధికార బీఆర్‌ఎస్ పార్టీలో నేతల మధ్య కొట్లాటలు జోరందుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య వైరాలు ముదురుతున్నాయి. అధిష్ఠానం ప్రకటనతో నిమిత్తం లేకుండా వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకేనంటూ కొందరు ఆశావహులు చేసుకుంటున్న ప్రచారం స్థానిక ఎమ్మెల్యేలను ఇరుకున పెడుతోంది. సొంతంగా జనంలోకి వెళుతుండడంతో ఆశావహులు-సిటింగ్‌లకు మధ్య కుమ్ములాటలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు
వర్గాలుగా విడిపోతున్న బీఆర్‌ఎస్ నాయకులు
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జట్టుకడుతున్న అసమ్మతి
మంత్రుల సమక్షంలోనే బాహాబాహీకి సన్నద్ధం
ఎన్నికలు సమీపిస్తుండటంతో తారస్థాయికి విభేదాలు
మిత్రపక్షం ఎంఐఎం కూడా తన వంతు పాత్ర
ఇంత జరుగుతున్నా స్పందించని అధిష్ఠానం
ఆపకుంటే పుట్టి మునుగుతుందంటున్న పార్టీ శ్రేణులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో సిటింగ్‌లకు, ఆశావహుల మధ్య కొట్లాటలు చోటుచేసుకుంటున్నాయి. పలుచోట్ల ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సిటింగ్ ఎమ్మెల్యేలు, వారి ప్రత్యర్థి వర్గాలు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకుంటూ వ్యక్తిగత పరువుతో పాటు.. పార్టీ పరువును కూడా తీస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకున్న ఉదంతాలున్నాయి. అధిక శాతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఇవే బీఆర్‌ఎస్ పార్టీ పుట్టి ముంచుతాయేమోనని క్షేత్రస్థాయి నాయకులు భయపడుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత, జోగినపల్లి సంతోష్ అండదండలు ఉన్నాయని, టికెట్ హామీ లభించిందని ప్రచారం చేసుకుంటూ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొందరు నేతలు సొంతంగా కార్యకలాపాలు చేపడుతున్నట్లు తెలిసింది. ఎన్నికల వేళ ఈ బాపతు నేతలు తలనొప్పిగా మారారని సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు అభిప్రాయపడ్డారు. నేతల మధ్య విభేదాలు క్షేత్రస్థాయి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరికి వారు ముఠా కట్టి సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటుండంతో... ఎవరిదగ్గరికి వెళ్తే ఏమవుతుందో అన్న భయంతో కొందరు మొత్తం పార్టీ కార్యకలాపాలకే దూరంగా ఉంటున్నారు. దాంతో మెజారిటీ కార్యకర్తల్లో స్తబ్ధత నెలకొంది. నేతల గ్రూపు తగాదాలు ఎన్నికల నాటికి తారస్థాయికి చేరతాయని అంచనా వేస్తున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకోకుంటే ఎన్నికల నాటికి పార్టీలో ఇదే అతిపెద్ద సమస్యగా మారుతుందని అనుమానిస్తున్నారు.
ఉమ్మడి మెదక్, ఖమ్మం జిల్లాల్లో
కేసీఆర్ సొంత గడ్డ ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మెజారిటీ నియోజకవర్గాల్లో కుమ్ములాటలున్నాయి. పటాన్‌చెరు సిట్టింగ్ ఎమ్మెల్యే జి.మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా చిట్కుల్ సర్పంచినీలం మధు కార్యక్రమాలు చేస్తున్నారు. తనకే టికెట్ వస్తుందని, పెద్దల ఆశీస్సులున్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జహీరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే కే.మాణిక్‌రావును అక్కడి నాయకులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. టీఎ్‌సఎంఎ్‌సఐడీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తూ నియోజకవర్గంలోకి వస్తున్నారని, దాంతో గ్రూప్ రాజకీయాలు వేడెక్కుతున్నాయని మాణిక్‌రావు వర్గం ఆరోపిస్తోంది. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డిని వ్యతిరేకించే వాళ్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు డాక్టర్ రోహిత్‌ను రంగంలోకి దించారు. రోహిత్ నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు పద్మ, ఇటు రోహిత్ వర్గాలు సోషల్ మీడియా వేదికగా పార్టీ పరువు తీసే స్థాయిలో పరస్పరం పోస్టులు పెట్టడమే కాకుండా దీనిపై పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూడా మెదక్ నుంచే టికెట్ ఆశిస్తున్నారు. తన వర్గాన్ని సిద్ధం చేసుకున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డిల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. వయోభారంతో బాధ పడుతున్న మదన్‌రెడ్డిని తప్పించే ఆలోచనలో బీఆర్‌ఎస్ నాయకత్వం ఉందని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లా పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్‌ఎస్ టికెట్ కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. తుమ్మల గ్యాప్ లేకుండా క్యాడర్‌ను కలిసేందుకు రోజూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. కొత్తగూడెంలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సీటు తనదేనని ధీమాగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రంగంలోకి దిగారు. మరోవైపు ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్ మాత్రం సీఎం ఆశీస్సులు తనకే ఉన్నాయని చెబుతూ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. సీఎం ఆదేశిస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తానంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
ఉత్తర తెలంగాణలో..
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలకు సొంత పార్టీలోనే కుంపటి తయారైంది. జనగామపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి కన్నేశారు. టికెట్ ఖాయమని సన్నిహితులకు నమ్మకంగా చెబుతున్నారు. ఇటీవల రజక సంఘం జిల్లా మహాసభ ఖర్చును ఆయనే పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ముత్తిరెడ్డి అనుచరులను కూడా పోచంపల్లి రహస్యంగా వెళ్లి కలుస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బదులుగా తన కూతురు కావ్యకు టికెట్ ఇప్పించుకోవాలని కడియం శ్రీహరి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేేస్త భగ్గుమంటోంది. ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌కు పార్టీ నేత భుక్య జాన్సన్‌కు మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. ఆయన ప్రత్యేకంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బాదావత్ పూర్ణచంద్ర నాయక్, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సైతం ఎమ్మెల్యేను పట్టించుకోకుండా సొంత కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ రెండు సార్లు గెలిచిన రేఖా నాయక్‌కు వ్యతిరేకంగా ఇంతమంది కార్యకలాపాలు చేపడుతున్నా అధిష్ఠానం మౌనంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్నకు వ్యతిరేకంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టికెట్ తనకేనంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. బోథ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు వ్యతిరేకంగా.. మాజీ ఎంపీ గోడం నగేష్ , నేరడిగొండ మండల జెడ్పీటీసీ సభ్యుడు అనిల్ జాదవ్ ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నారు.
లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్ల పార్టీలో, ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో ఆయనకు వ్యతిరేకంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు పోటీగా చలమెడ లక్ష్మీనరసింహారావు, ఏనుగు మనోహర్‌రెడ్డి టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. మనోహర్‌రెడ్డిని చెన్నమనేని పూర్తిగా దూరం పెట్టేశారు. జిల్లాలో మంత్రి కేటీఆర్ పాల్గొనే సమావేశాల్లో మనోహర్‌రెడ్డికి ప్రాధాన్యం లభిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మంథని నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మాజీ జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి వర్గాల మధ్య పోరు ఉదృతంగా సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. జగిత్యాలలో జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు ప్రచారం ఉంది. శిలాఫలకంలో పేరు చేర్చకపోవడానికి ఎమ్మెల్యే సంజయ్ కారణమని వసంత అనుచరులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మహబూబాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌కు పోటీగా ఎంపీ మాలోతు కవిత టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది. బోధన్‌లో పాగా వేయాలని చూస్తున్న ఎంఐఎం నేతలు అక్కడి టీఆర్‌ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే షకీల్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. శుక్రవారం మిత్రపక్షం అని కూడా చూడకుండా ఎమ్మెల్యేను ఘెరావ్ చేశారు. పట్టణ ప్రగతి సమావేశంలోనూ అదే దూకుడును ప్రదర్శించారు.
దక్షిణ తెలంగాణలో
వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఇతర పార్టీల వారిని చేర్చుకుని వారికే పెద్ద పీట వేస్తున్నారని అలకబూనిన బీఆర్‌ఎస్ నేతలు అధికార పార్టీలోప్రతిపక్షంగా తయారయ్యారు. వడ్ల నందు వారికి నాయకత్వం వహిస్తున్నారు. తాండూరు నియోజక వర్గంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వర్గ విబేధాలు కొనసాగుతున్నాయి. ఎవరికి వారు ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. టికెట్ రాకుంటే మహేందర్ రెడ్డి కాంగ్రె్‌సలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహే్‌షరెడ్డికి పోటీగా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి పార్టీ టికెట్ కోసం తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరూ వేర్వేరుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. వీరి వర్గపోరులో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. కొడంగల్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి మధ్య ఎడం బాగా పెరిగింది. చేవెళ్లలో కాలే యాదయ్యను కాదని టికెట్ తనకే ఇస్తారని కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కె.ఎ్‌స.రత్నం నమ్మకంగా ఉన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ.. సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి కాకుండా ఈసారి తనకే టికెట్ వస్తోందంటూ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు.
ఇద్దరికీ బాహాటంగానే గొడవలు జరుగుతున్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలోనూ ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. తన కుమారుడు భరత్‌కు ఉద్దేశ పూర్వకంగా జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇవ్వలేదని ఎంపీ గుర్రుగా ఉన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గపోరులో కార్యకర్తలు నలిగిపోతున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వ్యతిరేక వర్గం.. ఈసారి ఆయనకు టికెట్ దక్కకూడదని చూస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి, బీఆర్‌ఎ్‌సనేత పిల్లి రామరాజు యాదవ్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పనిచేస్తుండటంతో బీఆర్‌ఎ్‌సలో రెండు వర్గాలు ఏర్పడి విభేదాలు పెరిగాయి. మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వ్యతిరేకించే వారంతా.. ఈ సారి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నోముల భగత్‌కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. అక్కడి నుంచి టికెట్ ఆశించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, బుసిరెడ్డి పాండురంగారెడ్డి, నూకల వేణుగోపాల్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రాజధానిలో సగానికి సగం
రాజధాని హైదరాబాద్‌లో 24 నియోజకవర్గాలు ఉండగా సగం చోట్ల పంచాయితీ నడుస్తోంది. కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు పోటాపోటీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మహేశ్వరంలో మంత్రి సబితకు బదులుగా తనకే టికెట్ ఇవ్వాలంటూ తీగల కృష్ణారెడ్డి పట్టుబడుతున్నారు. రాజేంద్రనగర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌కు బదులుగా టికెట్ కోసం ఎంపీ రంజిత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఖైరతాబాద్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నప్పటికీ.. మన్నె గోవర్ధన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ టికెట్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఉప్పల్‌లోనూ బేతి సుభా్‌షరెడ్డి ఉండగానే.. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే ఆయన కార్యాచరణ కొనసాగిస్తున్నారు. శుక్రవారం అంబర్‌పేట నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇరువర్గాలు కేటీఆర్‌కు ఫిర్యాదు చేశాయి.
పట్టించుకోని అధిష్ఠానం
రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు గ్రూపులుగా ఏర్పడి గందరగోళం సృష్టిస్తున్నా పార్టీ అధిష్ఠానం పట్టించుకోకపోగా.. ఈ అంశంపై మౌనం ప్రదర్శిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో.. జరుగుతున్న పోటీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు. పార్టీ పెద్దలు వారిని పిలిచి మాట్లాడిన దాఖలాల్లేవు. కొన్నిచోట్ల హైకమాండే వెనకుండి ప్రోత్సహిస్తుందనే ప్రచారం సాగుతోంది.