Share News

CM Revanth: సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం.. ఏమన్నారంటే?..

ABN , First Publish Date - 2023-12-07T14:25:29+05:30 IST

Telangana: ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలు బద్దలు కొట్టామని.. ఇకపై అందరూ ప్రగతిభవన్‌కు రావచ్చని.. ప్రగతిభవన్ ఇకపై జ్యోతి రావు ఫూలే ప్రజాభవన్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగంలో తెలిపారు. గురువారం ఎల్బీస్టేడియంలో ప్రమాణస్వీకార మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది.

CM Revanth: సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం.. ఏమన్నారంటే?..

హైదరాబాద్: ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలు బద్దలు కొట్టామని.. ఇకపై అందరూ ప్రగతిభవన్‌కు రావచ్చని.. ప్రగతిభవన్ ఇకపై జ్యోతి రావు ఫూలే ప్రజాభవన్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన తొలి ప్రసంగంలో తెలిపారు. గురువారం ఎల్బీస్టేడియంలో ప్రమాణస్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రిగా రేవంత్ తొలిసారి ప్రసంగించారు. జై సోనియమ్మ అంటూ సీఎం రేవంత్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు.

‘‘పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ. త్యాగాల పునాది మీద తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం. ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. అమరవీరుల ఆకాంక్షను నెరవేరుస్తాం. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తాం. సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ ఇచ్చింది. ప్రజాస్వామ్యం హత్యకి గురైంది. ప్రజల సమస్యలు చెప్పుకుందాం అంటే వినే ప్రభుత్వమే లేకుండే. తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు భరోసాగా ఉంటాం. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. సామాజిక న్యాయం జరుగుతుంది. ప్రగతిభవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెను బద్దలు కొట్టాం. ప్రగతిభవన్‌కు ఇక అందరూ వెళ్లొచ్చు. తెలంగాణ ప్రజలు తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా. రేపు ఉదయం 10 గంటలకు ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. ప్రగతిభవన్ ఇకపై జ్యోతి రావు ఫూలే ప్రజా భవన్. నిస్సహాయులకు మేమున్నాం. మీ సోదరుడిగా అందరికీ నేను అండగా ఉంటానని మాట ఇస్తున్నా మేము పాలకులం కాదు.. ప్రజా సేవకులం. మాకు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా తీసుకుంటున్నాం. ప్రతీ కార్యకర్త కష్టాన్ని గుర్తు పెట్టుకుంటా. కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటా’’ అంటూ హామీ ఇస్తూ.. జై కాంగ్రెస్, జై జై సోనియమ్మ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ తన ప్రసంగాన్ని ముగించారు. కాగా.. ఎల్బీస్టేడియంలో జరిగిన ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏఐసీసీ అగ్రనేతలు హాజరయ్యారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

రెండు దస్త్రాలపై సంతకం...

రేవంత్ ప్రసంగం ముగిసిన తర్వాత రెండు దస్త్రాలపై సంతకం చేశారు. మొదటి సంతకం ఆరు గ్యారంటీల అమలుపై చేయగా.. దివ్యాంగురాలు రజిని ఉద్యోగ నియామక పత్రంపై సీఎం రేవంత్ రెండో సంతకం చేశారు.

Updated Date - 2023-12-07T14:54:11+05:30 IST