Encounter: బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. హిడ్మాకు గాయాలు..!
ABN , First Publish Date - 2023-01-11T17:34:45+05:30 IST
బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Hidma) గాయపడినట్లు సమాచారం.
హైదరాబాద్: బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Hidma) గాయపడినట్లు సమాచారం. హిడ్మాపై రూ. 45 లక్షల రివార్డు ఉంది. అయితే హిడ్మా ఎన్‌కౌంటర్‌ను మావోయిస్టు కేంద్ర కమిటీ ధ్రువీకరించలేదు. కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్న హిడ్మాకు నాలుగంచెల భద్రత ఉంటుంది. హిడ్మా భద్రత దళాలకు మోస్ట్ వాంటెడ్. దండకారణ్యంలో జరిగే ప్రతి దాడి వెనుకా ఆయన హస్తం ఉంటుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ఎవరీ హిడ్మా
ఛత్తీస్‌గఢ్ రాష్రంలోని బస్తర్ జిల్లా పూవర్తిలోని ఆదివాసీ కుటుంబంలో జన్మించిన హిడ్మాకు బస్తర్, సుక్మా, దంతేవాడ, బీజాపూర్ (Dantewada Bijapur) ప్రాంతాల్లో గట్టి పట్టుంది. దండకారణ్యంలోని ఆదివాసీలతో సత్సంబంధాలు ఉన్నాయి. 15ఏళ్ల వయస్సులోనే 1990లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. మిలిటెంట్‌గా పని చేస్తూ బస్తర్ కమాండర్‌గా ఎదిగారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)లో కీలక నేతగా మారాడు. మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్ సౌత్ సబ్ జోనల్ కమాండర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా హిడ్మా పని చేశారు.
2010లో తడ్ మెట్ల మెరుపు దాడిలో 24 మంది జవాన్లు మృతికి ఆయన సూత్రధారి అని తెలుస్తోంది. 2013లో జీరామ్ ఘాటి వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీలక పాత్రగా పోలీసులు గుర్తించారు. 2017 ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్‌పీఎఫ్ జవా న్లపై దాడి హతమార్చిన ఘటన భద్రత దళాలకు భారీ ఎదురుదెబ్బగా మిగిలిపోయింది. 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కు కుని 22 మంది బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు. ఇలాంటి కనీసం 26 దాడుల్లో హిడ్మా కీలకంగా ఉన్నాడు.