సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా దుబ్బాకలో పోలింగ్
ABN , First Publish Date - 2023-12-01T23:21:10+05:30 IST
సిద్దిపేట జిల్లాలో మొత్తంగా సగటున 83.15 శాతం పోలింగ్ నమోదైంది. దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా 87.51 శాతం పోలింగ్ నమోదైంది.

దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో గతం కంటే పెరుగుదల
గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో తగ్గుదల
సిద్దిపేట టౌన్, డిసెంబరు 1 : సిద్దిపేట జిల్లాలో మొత్తంగా సగటున 83.15 శాతం పోలింగ్ నమోదైంది. 2018లో 84.97 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి స్వలంగా తగ్గింది. దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో గతం కంటే ఓటింగ్ శాతం పెరగగా, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో తగ్గింది. జిల్లాలో దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా 87.51 శాతం పోలింగ్ నమోదైంది. సిద్దిపేట నియోజకవర్గంలో 76.33 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా 2018లో జరిగిన ఎన్నికల్లో 79.77 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి గతం కంటే తగ్గింది. సిద్దిపేట నియోజకవర్గంలో 2,33,733 ఓటర్లు ఉండగా మొత్తంగా 1,78,420 ఓట్లు పోల్ కాగా 55,313 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకోలేదు. 2018 ఎన్నికల్లో 2,23,747 ఓటర్లులుండగా 1,67,055 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 9వేల మందికి పైగా యువ ఓటర్లు పెరిగినా పోలింగ్ శాతం మాత్రం తగ్గింది. లత్యల్పండా సిద్దిపేట పట్టణంలోని బీఎంఆర్ డిగ్రీ కళాశాలలో 949 ఓటర్లుండగా 444 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 46.79 శాతంగా పోలింగ్ నమోదైంది. అలాగే హరిప్రియనగర్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో, సాయి గ్రేస్, ప్రతిమ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో 50 శాతం లోపే పోలింగ్ నమోదైంది. సిద్దిపేట రూరల్ మండలంలోని బంజెరుపల్లిలో 434 మంది ఓటర్లుఉండగా 420 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 96.77 శాతం నమోదు కాగా, ఏదులవాడలో 96.00, మాచాపూర్‌లో 95, శెఖర్‌రావుపేటలో 95.38, కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో 93.36 శాతంగా పోలింగ్ నమోదైంది.
గజ్వేల్ 4.49 శాతం మేర తగ్గిన పోలింగ్
గజ్వేల్, డిసెంబరు 1: గజ్వేల్ నియోజకవర్గంలో 84.14 శాతం పోలింగ్ నమోదు కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి తగ్గింది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,74,654 మంది ఓటర్లు ఉండగా 2,33,207 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2018లో 88.63 శాతం పోలింగ్ నమోదైంది. 2,33,207 మంది ఓటర్లు ఉండగా 2,06,699 మంది ఓటేశారు. ఈసారి 41,447మంది ఓటర్లు పెరిగారు. ఇందులో ముంపు గ్రామాలకు చెందిన ఓట్లు దాదాపుగా 10వేల ఓట్లు ఉండగా, దాదాపుగా 30వేల ఓట్లు నియోజకవర్గ వ్యాప్తంగా పెరిగాయి. గతంతో పోల్చితే 4.49శాతం మేర పోలింగ్ శాతం తగ్గింది. పల్లెలతో పోల్చితే పట్టణాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తిని చూపలేదు. అత్యధికంగా మనోహారాబాద్‌లో 99.18 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ కేంద్రంలో 610 మందికి గానూ 605మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక గజ్వేల్ మండలం రంగంపేటలో 96.49శాతం పోలింగ్ నమోదవగా, తూప్రాన్ పట్టణంలో అత్యల్పంగా 61.27శాతం పోలింగ్ నమోదైంది. పల్లెల్లో 80 శాతానికి తగ్గకుండా పోలింగ్ నమోదైంది.
దుబ్బాకలో 87.51 శాతం పోలింగ్ నమోదు
దుబ్బాక, డిసెంబరు1: దుబ్బాక నియోజకవర్గంలో 87.51 శాతం పోలింగ్ నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో 85.99 శాతం నమోదవగా ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. నియోజకవర్గంలో 1,98,100 మంది ఓటర్లు ఉండగా 1,73,366 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో పురుష ఓటర్లే అత్యధికంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. 97,019 మందికి 85,551 మంది ఓటేశారు. ఇక 1,81,000 మంది మహిళా ఓటర్లకు గాను 87,815 మంది వినియోగించుకున్నారు. దుబ్బాక మండలంలోని 53 పోలింగ్ కేంద్రాల్లో 47,834 ఓటర్లు ఉండగా 40,698 మంది ఓటేశారు. అక్బర్‌పేట-భూంపల్లి మండలంలో 87.02 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలోని 33 పోలింగ్ కేంద్రాల్లో 23,599 మందికి 20,537మంది వినియోగించుకున్నారు. మిరుదొడ్డి మండలంలో 89 శాతం నమోదైంది. 18,278 మందికి 16,124 మంది ఓటేశారు. దౌల్తాబాద్ మండలంలో 89.84 శాతం నమోదైంది. 23,850 మంది ఓటర్లు ఉండగా వీరిలో 21,428మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. నార్సింగి మండలంలో 90.76 శాతం నమోదైంది. 8,845 మంది ఓటర్లకు 7,847 మంది ఓటేశారు. రాయపోల్ మండలంలో 21,125 మంది ఓటర్లకు 19,426 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 89.92 శాతం పోలింగ్ నమోదైంది. తొగుట మండలంలోని 20,265 మంది ఓట్లకు గాను 18,700 ఓట్లు పోలయ్యాయి. మొత్తం మండలం 88 శాతం పొలింగ్ నమోదైంది. చేగుంట మండలంలో 85.65 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 30,929 మంది ఓటర్లకు గాను 26,492 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హుస్నాబాద్‌లో గత ఎన్నికల కంటే 1.04 శాతం పెరుగుదల
హుస్నాబాద్, డిసెంబరు 1 : హుస్నాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 83.61 శాతం నమోదు కాగా ఈ ఎన్నికల్లో 84.65 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే దాదాపు 1.04 పోలింగ్ శాతం పెరిగింది. నియోజకవర్గంలో మొత్తం 2,42,177 మంది ఓటర్లుండగా 2,05,017 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలో కూడ గతం కంటే ఓటింగ్ పెరిగింది. గత ఎన్నికల్లో 79.72 శాతం పోలింగ్ కాగా ఈ సారి 80.31 శాతం నమోదైంది. పట్టణంలో 18,118 మంది ఓటర్లుండగా 14,550 మంది ఓటు వేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో హుస్నాబాద్ మండలంలో అత్యధికంగా 87.51 శాతం నమోదు కాగా భీమదేవరపల్లి మండలంలో అత్యల్పంగా 82.20 శాతం నమోదైంది. అక్కన్నపేట మండలంలో 85.75శాతం కోహెడ మండలంలో 85.61శాతం, చిగురుమామిడి మండలంలో 83.86శాతం, సైదాపూర్ మండలంలో 85.11 శాతం, ఎల్కతుర్తి మండలంలో 86.76 శాతం నమోదైంది. ఓటింగ్ శాతం పెరగడం ఉత్సహం కలిగిస్తున్నా ఇది ఎవరికి ప్రయోజనం చేకూరుతుందనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
జనగామలో 85.70శాతం పోలింగ్ నమోదు
చేర్యాల/మద్దూరు, డిసెంబరు 1 : జనగామ నియోజకవర్గంలో 85.70 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2,37,108 మంది ఓటర్లు ఉండగా 2,03,205 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని చేర్యాల మండలంలో 44,217మంది ఓటర్లు ఉండగా 38,160 మంది ఓటేశారు. కొమురవెల్లి మండలంలో 14,707 మంది ఓటర్లకు గానూ 13,068 మంది వినియోగించుకున్నారు. మద్దూరు, దూళిమిట్ట మండలాల్లో మొత్తం 31,465 ఓట్లకు గానూ 27,467 ఓట్లు పోలయ్యాయి. మద్దూరు మండలంలో 16,255 మంది, దూళిమిట్టలో 11,212 మంది ఓటేశారు.