ఈసారైనా కరుణించేనా
ABN , First Publish Date - 2023-02-01T00:25:46+05:30 IST
దశాబ్దాలుగా సిద్దిపేట జిల్లా ప్రజలను ఊరిస్తున్న రైలు ప్రయాణ భాగ్యం ప్రతి యేటా అందని ద్రాక్షగానే మారుతున్నది.
- కేంద్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజల ఆశలు
- నత్తనడకన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్
- నిధుల కొరతతో ఆరేళ్లుగా కొనసాగుతున్న పనులు
- మూడు స్టేషన్లు, 33 కిలోమీటర్ల ట్రాక్ మాత్రమే నిర్మాణం
- అంచనాలో సగం నిధులు కూడా విడుదల కాని వైనం
- కాళేశ్వరానికి జాతీయ హోదాపై ఆశలు
- నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, జనవరి 31: దశాబ్దాలుగా సిద్దిపేట జిల్లా ప్రజలను ఊరిస్తున్న రైలు ప్రయాణ భాగ్యం ప్రతి యేటా అందని ద్రాక్షగానే మారుతున్నది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ ఏర్పాటుకు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2016లో ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. నాడు రూ.1160 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఈ నిధుల్లో సగం శాతం కూడా విడుదల కాకపోవడం వల్ల రైల్వేలైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నేడు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ ఏడాదైనా సమృద్ధిగా నిధుల కేటాయింపు ఉండాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర బడ్జెట్ రూపకల్పన ఉంటుందన్న నేపథ్యంలో జిల్లాకు ప్రాధాన్యత దక్కుతుందనే ఆశలు నెలకొన్నాయి. లోకసభ ఎన్నికలకు ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున .. ఈ దిశగా నిధుల విడుదల కేటాయించే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో మెదక్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైనుకు తగిన నిధులు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు రూ.1000కోట్ల పైచిలుకు నిధులు కేటాయిస్తే ఈ ఏడాదిలోనే సిద్దిపేటలో రైలు కూత వినిపించే భాగ్యం కలుగుతుంది. కానీ ప్రతీ బడ్జెట్‌లోనూ నామమాత్రపు నిధులను కేటాయిస్తున్నారు.
ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి 33కిలోమీటర్ల రైల్వేలైను నిర్మించారు. మొత్తం మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల లైను నిర్మించాల్సి ఉండగా ఇందులో ఐదోవంతు మాత్రమే పూర్తయింది. 15 రైల్వే స్టేషన్లకు కేవలం నాచారం, వీరానగర్, గజ్వేల్ స్టేషన్లు మాత్రమే పూర్తయ్యాయి. కొడకండ్ల, లకుడారం సిద్దిపేట స్టేషన్లు ప్రగతిలో ఉండగా దుద్దెడ, గుర్రాలగొంది స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లా చిన్నలింగాపూర్, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కరీంనగర్ జిల్లా వెదిరలో రైల్వేస్టేషన్లను నిర్మించనున్నారు. ఈ స్టేషన్ల మీదుగా కొత్తపల్లి స్టేషన్ వరకు లైను ఏర్పాటు చేయనున్నారు. అయితే నిధుల కేటాయింపు జరిగితేనే ఇదంతా సాధ్యమవుతుంది. లేదంటే మరో ఐదారేళ్ల కాలం వేచిచూడక తప్పదు.
కాళేశ్వరానికి జాతీయహోదా దక్కేనా
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్న సాగర్, కొండపోచమ్మసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్లను నిర్మించారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణంలో భాగంగా దాదాపు 20 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేలాది మంది నిర్వాసితులయ్యారు. పలుచోట్ల ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో పరిహారం, నివాస స్థలాలు, కాలనీల ఏర్పాటుతో సంతృప్తి పరిచారు. అయినప్పటికీ నిత్యం నిర్వాసితుల ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. నిధుల కొరతతోనే నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పిస్తే కేంద్రం నుంచి కూడా నిధుల కేటాయింపు జరుగుతుంది. వీటివల్ల నిర్వాసితులకూ లాభం జరిగే అవకాశం ఉంటుంది.
చిన్నచూపు తగదు
- కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ
నిధుల కేటాయింపులో ప్రతీసారి కేంద్రం చిన్నచూపు చూస్తుంది. ఫలితంగా రాష్ట్రంపై భారం పడుతున్నది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైనుకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులను కేటాయించగా కేంద్రం విడుదల చేయడం లేదు. సిద్దిపేటలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి. దుబ్బాకలో చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరేలా స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ను కేటాయించాలి. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పిస్తే మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ల నిర్వాసితులకు మరింత మేలు చేకూరుతుంది.