Share News

Metro Rail: రోజుకు రూ.కోటిన్నర నష్టం.. మెట్రో చార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించండి

ABN , Publish Date - Mar 28 , 2025 | 08:37 AM

మాకు రోజుకు రూ.కోటిన్నర నష్టం.. మెట్రో చార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించండి.. అంటూ ఎల్‌అండ్‌టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధమైంది. రోజూ 5.10 లక్షల మంది ప్రయాణాలు చేస్తన్నప్పటికీ నష్టాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయంటూ ఆ సంస్ధ యాజమాన్యం పేర్కోంటోంది.

Metro Rail: రోజుకు రూ.కోటిన్నర నష్టం.. మెట్రో చార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించండి

- మెట్రో చార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించండి

- రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న ఎల్‌అండ్‌టీ

- ప్రజలపై భారం వేసేందుకు సర్కారు విముఖత!

- నష్టాల భర్తీకి వీలుగా స్థలాల లీజుకు యోచన

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మెట్రో రైలు టికెట్‌ రేట్లు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు ఎల్‌అండ్‌టీ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) సంస్థ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రోజుకు కోటిన్నర రూపాయల నష్టం వస్తోందని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఇప్పటికీ వడ్డీలు చెల్లించలేకపోతున్నామని ఎల్‌అండ్‌టీ సంస్థ చెబుతోంది. అయితే ప్రయాణికులపై అదనపు భారం వేయొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరల పెంపునకు సుముఖంగా లేదని తెలుస్తోంది.

ఈ వార్తను కూడా చదవండి: Rice: సన్నబియ్యం వచ్చేశాయ్‌.. వచ్చే నెల నుంచే రేషన్‌షాపుల్లో పంపిణీ


రోజూ 5.10 లక్షల మంది ప్రయాణం

నగరంలో మొదటిదశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యం (పీపీపీ)లో 2012లో రూ.14,132 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి 2017 నవంబరులో పూర్తిచేశారు. మూడు కారిడార్ల పరిధిలో ప్రయాణించే వారి సంఖ్య రోజూ 5.10 లక్షలకు చేరింది. కరోనాకు ముందు రోజుకు రూ.80 లక్షలకు పైగా ఎల్‌ అండ్‌ టీ ఆదాయం సమకూర్చుకుంది. అయితే, 2020లో కరోనా లాక్‌డౌన్‌తో మెట్రో కుదేలైంది. 2022 నుంచి క్రమంగా కోలుకున్నా నష్టాల ఊబి నుంచి బయటపడలేదని చెబుతోంది. మెట్రో నిర్వహణలో రోజుకు సుమారు రూ.కోటిన్నర వరకు నష్టం వస్తున్నట్లు ఎల్‌ అండ్‌ టీ అధికారులు తరచూ చెబుతున్నారు. ఆశించినవిధంగా ప్రయాణికుల సంఖ్య రోజుకు 6 లక్షలకు పెరగకపోవడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు.


మరోసారి ప్రయత్నం

టికెట్‌ రేట్ల సవరణ విషయంపై హెచ్‌ఎంఆర్‌ సంస్థ, అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబరులో కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రజాభిప్రాయాన్ని సేకరించి నివేదిక సమర్పించింది. అదే సమయంలో 2023 జనవరి నుంచి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రావడంతో టికెట్‌ చార్జీల విషయం మరుగునపడింది. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ద్వారా కేంద్రం అనుమతి కోరేందుకు హెచ్‌ఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

city3.2.jpg


నష్టాలను పూడ్చుకుంటామని..

మహాలక్ష్మి పథకం ద్వారా మెట్రోకు మహిళా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిందని, కనీసం టికెట్‌ చార్జీలు పెంచుకునే అవకాశం కల్పిస్తే కొంతైనా నష్టాలను పూడ్చుకుంటామని ఎల్‌అండ్‌టీ కోరుతోంది. అయితే మెట్రో రెండో దశ నిర్మాణంపై దృష్టి సారించిన సర్కారు ఇప్పుడు కేంద్రానికి ఈ విషయం తెలియజేస్తే... అసలు లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తోంది. అంతేకాకుండా కాలుష్యరహితంగా నడిచే మెట్రో రైళ్లలో టికెట్‌ ధరలు అందుబాటులో ఉండాలని, పెంచితే ప్రయాణికుల సంఖ్య పడిపోతుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటోంది.


నష్టాలు వస్తున్నాయని చెబుతున్న ఎల్‌ అండ్‌టీకి రవాణా ఆధారిత అభివృద్ధి (టీఓడీ) కింద నగరంలో మరికొన్ని స్థలాలను లీజు కింద అప్పగించాలని చూస్తోంది. మాల్స్‌, షాపులు ఏర్పాటు చేసుకుని వచ్చే ఆదాయంతో నష్టాలను పూడ్చుకోవాలని వారికి సూచిస్తోంది. దీనిపై ఇటు హెచ్‌ఎంఆర్‌, అటు ఎల్‌ అండ్‌ టీ వేచిచూస్తున్నట్లు సమాచారం. నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ప్రయాణ చార్జీ టికెట్లు కనిష్ఠ ధర రూ.10, గరిష్ఠ ధర రూ.60 గా ఉంది. చార్జీల సవరణ జరిగితే మెట్రోలో కనిష్ఠ టికెట్‌ రేటు రూ.20, గరిష్ఠంగా రూ.80 వరకు పెరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్‌

పాస్టర్‌ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు

మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు

గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2025 | 10:35 AM