పింఛన్ ఇంకెప్పుడు?
ABN , First Publish Date - 2023-02-12T00:45:32+05:30 IST
జిల్లాలో ఆసరా పెన్షన్‌ల కోసం నెలలుగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

నవంబరు నెల పెన్షనే ఇంకా రాకపాయే!
పింఛన్ డబ్బులపైనే ఆధారపడి జీవిస్తున్న పండుటాకులు ఎందరో..
ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ, చేనేత, కల్లుగీత కార్మికులతో పాటు పలువురు లబ్ధిదారులకు తప్పని తిప్పలు
‘ఆసరా’కు అడ్డంకులెన్నో..
ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవాల చుట్టు తిరుగుతూనే ఉన్న 57ఏళ్లు దాటిన వృద్ధులు
జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో 25వేలకు పైగా కొత్త పెన్షన్ దరఖాస్తులు
నిజామాబాద్ అర్బన్, ఫిబ్రవరి 11: జిల్లాలో ఆసరా పెన్షన్‌ల కోసం నెలలుగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత మూడు నెలలుగా ప్రభుత్వం నుంచి పెన్షన్‌లు అందడం లేదు. న వంబరు 2022 నుంచి ఇప్పటివరకు పెన్షన్ జాడ లేదు. కేవలం పెన్షన్ డబ్బుల మీదనే ఆధారపడి జీవించే వారికి తిప్పలు తప్పడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రతినెలా అందజేస్తున్న ఆసరా పెన్షన్‌ల కోసం పెన్షన్‌దారులు ఎదురుచూస్తుండగా అర్హులైన కొత్త పెన్షన్‌దారులు ఏళ్లుగా పెన్షన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా 57 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్‌లు మంజూరు చేస్తుండడంతో.. అర్హులైనవారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల 48వేల కొత్తపెన్షన్‌లు ఇచ్చినప్పటికీ.. ఇంకా అర్హులైనవారు చాలా మంది ఉన్నారు. ఇంకా కొత్తవారు పెన్షన్‌ల కోసం సైతం దరఖాస్తులు చేసుకునేందుకు మీసేవా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు జిల్లాలో 2లక్షల 86వేల 761 మంది లబ్ధిదారులకు ప్రతినెలా ప్రభుత్వం ఆసరా పెన్షన్‌లను అందజేస్తుంది. నవంబర్ 2022కు సంబంధించిన పెన్షన్ డబ్బులు ఇంకా పెన్షన్‌దారులకు ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది పెన్షనర్‌లకు బీపీవోల ద్వారా పంపిణీ చేస్తుంది. బ్యాంక్ ఖాతాల ద్వారా పెన్షన్ పొందే పెన్షనర్‌లకు మూడు నెలలుగా పెన్షన్ ఖాతాలలో జమ కాలేదు. ప్రస్తుతం ఫిబ్రవరి మాసం నడుస్తున్నప్పటికీ మూడు నెలల పెన్షన్ కోసం పెన్షన్‌దారులు ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో 2లక్షల 86వేల 761 పెన్షన్‌లు
జిల్లాలో ప్రస్తుతం 2లక్షల 86వేల 761 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పెన్షన్‌లను అందజేస్తుంది. ఇందులో వృద్ధాప్య పింఛన్‌లు 79వేల 259 ఉండగా, వికలాంగుల పింఛన్‌లు 20,065, వితంతు పింఛన్‌లు 77,158, చేనేత కార్మికులు 197, కల్లు గీత కార్మికులు 1,185, ఒంటరి మహిళలు 10,520, బీడీ కార్మికులు 96,264, ఫైలేరియా బాధితులు 387 మంది ఉండగా, ఎయిడ్స్‌వ్యాధిగ్రస్తులు (ఆర్టు పెన్షన్‌లు) 1,726 మంది ఉన్నారు. వీరికి ప్రతినెల 59కోట్ల 81లక్షల 75వేల 176 రూపాయలను అందజేస్తున్నారు. ఇందులో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 37 వేల 296 మంది పెన్షన్‌దారులు, ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో 11వేల 917 మంది, బోదన్ మున్సిపల్ పరిధిలో 10వేల 746 మంది పెన్షన్‌దారులున్నారు.
కొత్తగా 25వేలకు పైగా దరఖాస్తులు
జిల్లాలో ఇప్పటికే 2లక్షల 86వేల 761 మందికి ఆసరా పెన్షన్‌లు అందుతుండగా.. 25వేలకు పైగా దరఖాస్తులు కొత్త పెన్షన్‌ల కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం జిల్లాలో 48 వేల మంది లబ్ధిదారులకు కొత్త పెన్షన్‌లు మంజూరు చేసినప్పటికీ.. అందులో కొంతమందికి మాత్రమే పెన్షన్‌లు అందుతున్నాయి. ఇంకా 20వేలకు పైగా అర్హులైనవారికి పెన్షన్ అందడం లేదు. ప్రభుత్వం ఇటీవల బీడీ కార్మికుల జీవనభృతికి సంబంధించిన పాత నిబంధనలను సవరించినట్లు ప్రకటించినప్పటికీ.. ఇంకా పెన్షన్‌లు ఇవ్వడం లేదు. పాత నిబంధనలు సడలిస్తే మరో 10వేల మందికి పైగా పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, రెండు వేల వరకు వితంతు పెన్షన్‌లు, దాదాపు వెయ్యి దివ్యాంగుల పెన్షన్‌లు, మరో 15వేల వరకు వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆన్‌లైన్ దరఖాస్తులు బంద్
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో పెన్షన్‌ల కోసం అనేకమంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్న ఆన్‌లైన్‌లో సైట్‌లను ప్రభుత్వం నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మ్యాన్‌వల్‌లో మాత్రమే లబ్దిదారులు దరఖాస్తులను చేసుకుంటున్నారు. అదికారులు సైతం పెన్షన్‌లు ఎప్పుడు వచ్చేది చెప్పలేమంటు సమాధానం చెబుతుండడంతో పెన్షన్‌లు ఎప్పుడు వస్తాయోనని అర్హులైన లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 25వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్న ఈ సంఖ్యమరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.
పెండింగ్ పెన్షన్‌లు త్వరలోనే వస్తాయి
: చందర్‌నాయక్, డీఆర్‌డీవో, నిజామాబాద్
నవంబరు నెలకు సంబంధించిన పెన్షన్‌లు గ్రామీణ ప్రాంతాల్లో అందజేస్తున్నాం. త్వరలో బ్యాంక్ ఖాతాల ద్వారా పెన్షన్లు పొందేవారికి త్వరలో వారి ఖాతాల్లో జమచేయడం జరుగుతుంది. పెన్షన్‌దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.