వైభవంగా వసంత పంచమి మహోత్సవం
ABN , First Publish Date - 2023-01-27T03:11:48+05:30 IST
వసంత పంచమి సందర్భంగా రాష్ట్రంలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయం, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని శుంభుగిరి కొండలపై వెలసిన విద్యాధరి క్షేత్రానికి గురువారం భక్తులు పోటెత్తారు.

భక్తులతో కిక్కిరిసిన బాసర, విద్యాధరి క్షేత్రం
బాసర/వర్గల్, జనవరి, 26(ఆంధ్రజ్యోతి): వసంత పంచమి సందర్భంగా రాష్ట్రంలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయం, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని శుంభుగిరి కొండలపై వెలసిన విద్యాధరి క్షేత్రానికి గురువారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన వసంతపంచమి వేళ తల్లిందడ్రులు తమ పిల్లలకు అక్షర శ్రీకారం నిర్వహించారు. బాసర సరస్వతి ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు ప్రత్యేక అక్షరాభ్యాసం, సాధారణ అక్షరాభ్యాసము, వీఐపీల కోసం మరో చోట ఇలా... మూడు చోట్ల అక్షర శ్రీకార పూజలు ఏర్పాటు చేసిన్పటికీ భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. క్యూలైన్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వసంతపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మంగళ వాయిద్యాల మధ్య బాసర సరస్వతి అమ్మవారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. అలాగే వర్గల్ మండలంలోని విద్యా సరస్వతి అమ్మవారి ఆలయంలో ఉదయం 4 గంటలకే గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభించారు. ఆలయంలో మొదటిసారి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అక్షర స్వీకారాల టికెట్లు జారీచేశారు. దీంతో సుమారు 5 వేల మంది చిన్నారులకు అక్షర స్వీకారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి 56 రకాల మిఠాయిలతో విశేష మహా నివేదన సమర్పించారు.