చదువుల ‘మోత’
ABN , First Publish Date - 2023-07-05T00:02:50+05:30 IST
ఆడుతూ... పాడుతూ గడపాల్సిన బాల్యంలో పుస్తకాల మోతబరువుతో బాల్యం బరువె క్కుతోంది. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే పుస్తకాల బ్యాగుల మోతతో చిన్నారులు, విద్యార్థులు సతమ తమవుతున్నారు. బ్యాగునిండా పుస్తకాలు పెట్టుకొని భుజాలకు వేసుకొని మోయలేక చిన్నారులు అల్లాడిపోతున్నారు. చదువు సంగతి దేవుడెరుగు కానీ విద్యార్థుల సామర్థ్యానికి మించిన బరువు కలిగిన బ్యాగులను మోయలేక వారి నడుములు ఒంగిపోతున్నాయి.

పుస్తకాల భారంతో కుంగిపోతున్న బాల్యం
చదువుల పేరుతో నడ్డివిరుస్తున్న బడిసంచులు
విద్యార్థి సామర్థ్యానికి మించి బ్యాగు బరువు
ఉత్పన్నమవుతున్న ఆరోగ్య సమస్యలు
చట్టం అమలుపై ప్రభుత్వం చిన్నచూపు
శారీరక ఎదుగుదల ప్రమాదంలో పడుతున్నా పట్టని వైనం
మహబూబాబాద్ ఎడ్యుకేషన్, జూలై 4 : ఆడుతూ... పాడుతూ గడపాల్సిన బాల్యంలో పుస్తకాల మోతబరువుతో బాల్యం బరువె క్కుతోంది. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే పుస్తకాల బ్యాగుల మోతతో చిన్నారులు, విద్యార్థులు సతమ తమవుతున్నారు. బ్యాగునిండా పుస్తకాలు పెట్టుకొని భుజాలకు వేసుకొని మోయలేక చిన్నారులు అల్లాడిపోతున్నారు. చదువు సంగతి దేవుడెరుగు కానీ విద్యార్థుల సామర్థ్యానికి మించిన బరువు కలిగిన బ్యాగులను మోయలేక వారి నడుములు ఒంగిపోతున్నాయి. ఇంటి నుంచి బయలుదేరి బస్సులు ఆగే స్టేజీ వద్దకు పుస్తకాల బ్యాగు భుజాలకు వేసుకొని ఒక చేతితో లంచ్‌బాక్స్‌ను పట్టుకొని రెండు, మూడు అంతస్తులలో ఉన్న తరగతి గదుల్లోకి వెళ్లాలంటే విద్యార్థులు అరిగోస పడుతున్నారు. పుస్తకాల భారంతో విద్యార్థుల శారీరక ఎదుగుదలలో ప్రమాదం పొంచి ఉందనే విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వాలకు మాత్రం పట్టింపు లేదు. పుస్తకాల బరువు విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించి ఉండకూడదని చిల్ట్రన్స్ స్కూల్ బ్యాగ్ యాక్ట్-2006 చెబుతున్నప్పటికీ రెట్టింపు (నూరు శాతానికిపైగా) బరువుతో విద్యార్థుల నడుము ఒంగిపోతుంది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు అసలు పుస్తకాలే మోయవద్దని చట్టం చెబుతున్నప్పటికీ పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.
బరువే భారంగా చదువు.....
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 129 ప్రైవేట్ పాఠశాలలుండగా వాటిల్లో సుమారు 27వేల మంది విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు. కనీస వసతులు లేని పాఠశాలల ఉండటంతో పాటు రెండు, మూడు అంతస్తుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు సైతం ఉన్నాయి. అసలే బ్యాగుల బరవు..పైగా రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న తరగతి గదుల్లోకి వెళ్లాలంటే చతికిలబడుతున్నారు. పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో విద్యార్థుల వద్ద ఉన్న పాఠ్యపుస్తకాలను కిలోల్లో లెక్కిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల పాఠ్యపుస్తకాలతో పాటు వర్క్‌బుక్స్, నోట్‌బుక్స్‌ను కలుపుకొని బ్యాగులో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు ఆయా తరగతులను బట్టి పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ కలుపుకొని 16 నుంచి 38 వరకు ఉంటాయని సర్వేలో వెల్లడైనట్లు స్పస్టంచేశారు.
కనిపించని వ్యాయామం..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏ విధంగా వ్యాయామం, క్రీడలు నిర్వహిస్తున్నారో అదే విధంగా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా వ్యాయామం, క్రీడలు నిర్వహించాలి. కానీ ప్రైవేట్ పాఠశాలల్లో గ్రేడ్, ర్యాంకులంటూ చదువులకే పరిమితం చేస్తూ వ్యాయామానికి దూరం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విద్యార్థులు చిన్ననాటి నుంచే మానసిక ఒత్తిడికి గురికావడంతో పాటు బ్యాగుల బరువుతో శారీరక ఎదుగుదల నిలిచిపోవటమే కాకండా నడుమునొప్పిలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటితో చదువేమో కానీ విద్యార్థులు చిన్ననాటి నుంచే మానసిక ఆందోళనకు గురవుతూ చదువులో రాణించలేక బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.
సామర్థ్యానికి మించి విద్యార్థుల తరలింపు.....
వాహనాలలో విద్యార్థులను పాఠశాలలకు తీసుకువచ్చేందుకు సీటింగ్ కెపాసిటీకి మించి తీసుకువస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రమైనందున చుట్టు పక్కల మండలాల నుంచి విద్యార్థులను పట్టణంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలకు బస్సులు, వాహనాల ద్వారా తీసుకువస్తున్నారు. కానీ సామర్థ్యానికి మించి విద్యార్థులను బస్సుల్లో తరలిస్తుండటంతో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన సంబంధిత అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
చట్టం ఏం చెబుతోందంటే....
నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు స్కూల్‌బ్యాగ్ మోయకూడదు. ఇతర తరగతుల వారు విద్యార్థి శరీర బరవుకంటే స్కూల్ బ్యాగు బరువు 10 శాతం మించి ఉండకూడదు.
స్కూల్ బ్యాగు బరువు రోజువారీగా తెచ్చుకోవాల్సిన పుస్తకాలపై శాస్త్రీయ అంచనాతో పాఠశాలలు తల్లిదండ్రులకు మార్గదర్శకాలు ఇవ్వాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పుస్తకాలను పాఠశాలలోనే ఉంచుకునేందుకు లాకర్లను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి
ప్రైవేట్ పాఠశాలల్లో యజమాన్యాలే విద్యార్థుల పుస్తకాలను పాఠశాలలో ఉంచుకునేందుకు (పాఠశాలలో అవసరమైనవి ఇంటికి తీసుకువెళ్లకుండా ఉండేందుకు) ప్రతి విద్యార్థికి లాకర్లు, డెస్క్‌లను ఏర్పాటు చేయాలి. వీటిని ఏర్పాటు చేయకపోయినా, ఈ నిబంధనలను పాటించకపోయినా పాఠశాలలపై చట్ట పరమైన చర్యలు చేపట్టాలి. రూ.3లక్షల వరకు జరిమానా విధించవచ్చును. అయినప్పటికీ నిబంధనలు పాటించకపోతే పాఠశాల గుర్తింపును రద్దుచేయవచ్చును.
బ్యాగు బరువుతో ఆరోగ్యానికి దెబ్బ : డాక్టర్ బానోత్ నెహ్రూరాథోడ్, ప్రముఖ వైద్యులు, మహబూబాబాద్
విద్యార్థి బ్యాగు బరువు అధికంగా ఉంటే శరీర ఎదుగుదల దెబ్బతింటుంది. ఎముకలు, కండరాల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. మెడ, భుజాలు, వెన్నుపూస పై భాగం, కింది భాగం దెబ్బతిని వెన్నునొప్పి వస్తుంది. భుజాలు ముందుకు వంగిపోవటంతో పాటు కిందికి ఒంగిపోతాయి. వెన్నుముక ఒంగిపోవటమే కాకుండా దెబ్బతినే ప్రమాదం ఉంది. శ్వాస సరిగ్గా పీల్చుకోలేని పరిస్థితి రావటంతో పాటు ఆయాసం పెరుగుతుంది.