ఎస్సీ వర్గీకరణపై కేంద్రం వైఖరి మోసపూరితం
ABN , First Publish Date - 2023-02-20T00:45:28+05:30 IST
ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభు త్వం అనుసరిస్తున్న వైఖరి మోసపూరితంగా ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం మొదలైన సుదీర్ఘకాలం తర్వాత వర్గీకరణను సమర్ధించి మొదటగా ఉమ్మడి రాష్ట్ర పార్టీగా తీర్మానం చేసింది బీజేపీయేనని ఆయన గుర్తు చేశారు.
మార్చి 15న తెలుగు రాష్ట్రాల రాజధానుల దిగ్బంధం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
కాళోజీ జంక్షన్, ఫిబ్రవరి 19 : ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభు త్వం అనుసరిస్తున్న వైఖరి మోసపూరితంగా ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం మొదలైన సుదీర్ఘకాలం తర్వాత వర్గీకరణను సమర్ధించి మొదటగా ఉమ్మడి రాష్ట్ర పార్టీగా తీర్మానం చేసింది బీజేపీయేనని ఆయన గుర్తు చేశారు. 1994 నుంచి జరిగిన ప్రతీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్లు సమస్యను పరిష్కరిస్తామని తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి ప్రతిపక్షపార్టీగా మద్దతు ఇస్తామని బీజేపీ లేఖ రాసిందని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా వర్గీకరణ పూర్తి చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రభుత్వం తమకు కావాల్సిన బిల్లులన్ని పాస్ చేయించుకుంటూ ఎస్సీ వర్గీకరణ బిల్లును మూలకు పెట్టిందని మంద కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణ విషయంలో నమ్మక ద్రోహానికి పాల్పడితే బీజేపీని వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
బీజేపీ వైఖరికి నిరసనగా మార్చి 15న రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను దిగ్బంధం చేస్తామని అన్నారు. ఈ మేరకు ఈనెల 22 నుంచి మహాసంగ్రామ యాత్రను ప్రారంభించి, మార్చి 14 నాటికి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలతో కలిసి హైదరాబాద్, విజయవాడ నగరాల సమీపానికి జనాన్ని చేర్చనున్నట్లు మంద కృష్ణ వివరించారు. వివిధ జిల్లాల నుంచి రాజధానులకు వెళ్లే మార్గాలన్నింటిని దిగ్బంధం చేస్తామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ 7 యేళ్ల కిందట అనాథ పిల్లలకు రిజర్వేషన్ కల్పిస్తామని, ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేస్తామన్నా హామీని నిలబెట్టుకొవాలని కోరారు. పలువురు ఎమ్మార్పీఎస్, ఎంఎ్‌సపీ నాయకులు పాల్గొన్నారు.