Minister Mandipalli: అమాత్యుడి సతీమణి అతి
ABN , Publish Date - Jul 02 , 2024 | 03:24 AM
ఆమె.. మంత్రి లేదా చట్టసభ సభ్యురాలు కాదు. కనీసం ప్రజాప్రతినిధి కూడా కాదు.
తన కాన్వాయ్‌లో రాలేదని ఎస్‌ఐపై ఆగ్రహం
నడిరోడ్డుపై జనం చూస్తుండగానే ఓవరాక్షన్
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భార్య అనుచిత తీరు
చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం
ఉద్యోగుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి
ఘటనపై సీఎం తీవ్ర అసంతృప్తి.. మంత్రికి ఫోన్
అన్నమయ్య జిల్లా చిన్నమండెం ఎస్‌ఐ రమేశ్‌బాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భార్య హరిత
అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఆమె.. మంత్రి లేదా చట్టసభ సభ్యురాలు కాదు. కనీసం ప్రజాప్రతినిధి కూడా కాదు. జరుగుతున్నది ప్రభుత్వ కార్యక్రమం. మంత్రి భార్యగా ఓ ప్రైవేటు వ్యక్తిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారంతే. ఆమె వస్తున్నారని పోలీసులు ఎలాంటి ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం లేదు. అయినాసరే తమ కాన్వాయ్‌లో ఎస్‌ఐ రాలేదంటూ అమాత్యుడి సతీమణి అతి చేశారు. నడిరోడ్డు మీద స్థానిక ప్రజలు చూస్తుండగానే ఎస్‌ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖా మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి (Mandipalli Ramprasad Reddy) భార్య హరిత వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతలకు, వీళ్లకు తేడా ఏంటని ప్రజలు విమర్శిస్తున్నారు. సోమవారం అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి రాంప్రసాద్‌రెడ్డి భార్య హరిత హాజరయ్యారు. తమ కాన్వాయ్‌లో చిన్నమండెం ఎస్‌ఐ రమేశ్‌బాబు రాకపోవడంతో మండిపడ్డారు. జరిగిన సంభాషణ..
మంత్రి భార్య: ఏం ఇప్పుడు తెల్లారిందా?
ఎస్‌ఐ: కాన్ఫరెన్స్ ఉండింది మేడం.
మంత్రి భార్య: సీఐకి లేని కాన్ఫరెన్స్ నీకే ఉందా? పెళ్లికొచ్చావా? డ్యూటీలో రావాలి. యూనిఫాంలో రావాలని కూడా తెలియదా మీకు?
ఎస్‌ఐ: సారీ మేడం.
మంత్రి భార్య: దేనికి సారీ?
ఎస్‌ఐ: పొరపాటు జరిగింది మేడం.
మంత్రి భార్య: ఏం పొరపాటు? హ.. గవర్నమెంటే కదా జీతం ఇస్తోంది. వైసీపీ వాళ్లు ఏమైనా ఇచ్చారా? మరి.. డ్యూటీ చేస్తున్నారా? ఇంకేమన్నా.. మీ కోసం అరగంట నుంచి వెయిట్ చేశాం.
ఎస్‌ఐ: (మంత్రి భార్యకు ఏదో చెప్పారు. అనంతరం సెల్యూట్ చేశారు.)
మంత్రి భార్య: హ.. పాండి. (పదండి..)
పిలిపించి మరీ...
సోమవారం ఉదయం 9 గంటలకు దేవగుడిపల్లెకు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భార్య హరిత వెళ్లారు. అక్కడ సీఐతో పాటు ముగ్గు రు సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఎస్‌ఐ రమేశ్ బాబు లేకపోవడంతో మంత్రి భార్య ఆరాతీశారు. దీంతో సీఐ ఫోన్ చేసి ఎస్‌ఐను అక్కడికి రప్పించారు. సాధారణ దుస్తుల్లో వచ్చిన ఆయన సీఐ సూచనతో సమీపంలో వాహనంలో ఉన్న యూనిఫాం వేసుకుని వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సతీమణి ఆగ్రహం వ్యక్తం చేశారు.