Share News

Congress: ఏపీలో మొదటి గ్యారెంటీని ప్రకటించిన కాంగ్రెస్.. ఖర్గే ఏ హామీ ఇచ్చారంటే..?

ABN , Publish Date - Feb 26 , 2024 | 09:44 PM

ఏపీలో ‘‘ఇందిరమ్మ అభయం’’ పేరుతో మొదటి గ్యారెంటీను AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ప్రకటించారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5 వేలు ఇచ్చేలా గ్యారెంటీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేలు ఇస్తామన్నారు. సోమవారం నాడు అనంతపురం పట్టణంలో ఏపీ పీసీసీ ‘‘న్యాయ సాధన’’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది.

Congress: ఏపీలో మొదటి గ్యారెంటీని ప్రకటించిన కాంగ్రెస్.. ఖర్గే ఏ హామీ ఇచ్చారంటే..?

అనంతపురం: ఏపీలో ‘‘ఇందిరమ్మ అభయం’’ పేరుతో మొదటి గ్యారెంటీను AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ప్రకటించారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5 వేలు ఇచ్చేలా గ్యారెంటీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5 వేలు ఇస్తామన్నారు. సోమవారం నాడు అనంతపురం పట్టణంలో ఏపీ పీసీసీ ‘‘న్యాయ సాధన’’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో మల్లికార్జున్ ఖర్గే, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.... తాను ఇక్కడకు వచ్చింది శ్రీమంతుల కోసం కాదని.. ఆంధ్ర రాష్ట్రంలోని పేదలకు ఒక పథకం గురించి చెప్పడానికి తాను వచ్చానని తెలిపారు. ఇందిరమ్మ ‘‘అభయం’’ గ్యారెంటీ ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ గ్యారెంటీ ఇచ్చిందంటే అమలు చేసి తీరిందని స్పష్టం చేశారు. ‘ఈ గ్యారెంటీ మా గుండెల్లో ఉంటుందని .. మీ గుండెల్లో కూడా ఉండాలి’ అని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గత 10 ఏళ్లుగా తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆంధ్రకు రాలేదని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.


అక్కడ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొంటున్నారు..?

ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి దేశం గర్వించే గొప్ప నాయకుడిని అందించిందని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. మహానాయకుడు బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డిని ఈ రాష్ట్రానికి సోనియాగాంధీ అధ్యక్షురాలిగా చేశారని చెప్పారు. షర్మిల న్యాయకత్వాన్ని బలపరుద్దామని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు కాంగ్రెస్ జపం చేస్తున్నారని.. దేశంలో కాంగ్రెస్ లేనే లేదని అంటున్నాడన్నారు. అలాంటప్పుడు తమ ప్రభుత్వాలను ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొంటున్నారు..? అని నిలదీశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ముంపు వాటిల్లిందని హెచ్చరించారు.

ఈ దేశ రాజ్యాంగానికి ముంపు ఉందన్నారు. మోదీ అనే నియంత పాలనలో దేశ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. మోదీకి కాంగ్రెస్ అంటే భయం పట్టుకుందని ఆరోపించారు. అందుకే ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద తిట్ల దండకం చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు తనను కూడా వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు సూర్యుడిని కూడా తానే తెచ్చానని మోదీ చెబుతాడని ఎద్దేవా చేశారు. ఏపీకు ఒకనాడు షర్మిల ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నటికీ రైతుల పక్షం, పేదల పక్షం, మహిళల పక్షమేనని వివరించారు. మోదీ మాత్రం మన డబ్బులను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని విరుచుకుపడ్డారు. మోదీ కార్పొరేట్ పక్షమని.. ఈ దేశాన్ని మోసం చేస్తున్నారని మల్లికార్జున్ ఖర్గే దుయ్యబట్టారు.


మోదీకి జగన్ వంగి వంగి దండాలు పెడుతున్నారు..

ఈ దేశంలో 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలని.. మోదీ ఎందుకు ఇవ్వలేేదని మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. ఏపీలో రెండు కోట్ల ఉద్యోగాలను కేంద్రం ప్రకటించాలని.. రాష్ట్రానికి ఉద్యోగాలు వచ్చాయా.. ? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఒక్క ఉద్యోగం రాకపోయినా మోదీకి జగన్ వంగి వంగి దండాలు పెడుతున్నారని దెప్పిపొడిచారు. ఈ దేశంలో మోదీ అన్ని రకాల పన్నులు వేశాడని అన్నారు. పెట్రోల్ ధరలు భారీగా పెంచాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి మోదీ ప్రత్యేక హోదా అంశాన్ని ఎగ్గొట్టారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుకున్నారన్నారు. కనీసం నిధులు కూడా ఏపీకు ఇవ్వలేదని చెప్పారు.

మోదీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న బ్లాక్‌మని తెస్తానని చెప్పారని.. తెచ్చారా అని నిలదీశారు. ఒకొక్కరికీ బ్యాంకులో రూ.15 లక్షలు వేస్తా అన్నారని.. ఒక్కరూపాయి కూడా ఈ దేశానికి ఎందుకు తేలేదని ప్రశ్నించారు. ఒక్కరి అకౌంట్‌లో అయినా కనీసం ఒక్క రూపాయి కూడా పడలేదని వివరించారు. రైతుల ఆదాయం రెండింతలు పెంచుతానని మోదీ అన్నారు...పెరిగిందా ? అని నిలదీశారు. వైఎస్సార్ హయాంలో నేరుగా ప్రధాని, సోనియాలతో మాట్లాడే వారని.. నేరుగా తలుపు తట్టే వారని... రాష్ట్ర హక్కులను సాధించే వారని చెప్పారు. ఇప్పటి ముఖ్యమంత్రులు మోదీనీ ఎన్ని సార్లు కలిశారు..? ఏపీకు ఏం తీసుకు వచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే...ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. పోరాడుదాం... సాదిద్ధామని.. ఏపీను పునర్ నిర్మాణం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమని మల్లికార్జున ఖర్గే తెలిపారు.

Updated Date - Feb 26 , 2024 | 10:16 PM