WARNING : కొడకల్లారా.. నరికేస్తాం
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:56 AM
‘‘కొడకల్లారా.. టీడీపీ వాళ్లు కనిపిస్తే నరికేస్తాం..! ఉంటే వైసీపీలో ఉండండి. లేదంటే ఊరు విడిచి వెళ్లండి..! పరిటాల వాళ్లు ఇక్కడికి ఎలా వస్తారు..?’’ ఇదీ.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి వార్నింగ్..! తమ స్వగ్రామం తోపుదుర్తిలో అనుచరులతో కలిసి ఆయన భయానకవాతావరణాన్ని సృష్టించారు. ఎన్నికల సమయంలో ఈ స్థాయిలో దౌర్జన్యాలు సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. కోడ్ అమలులోకి వచ్చినా.. ఇంకా అధికార పార్టీ సేవలోనే తరిస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు....
ఉంటే వైసీపీలో ఉండండి..
లేదంటే ఊరు విడిచి వెళ్లిపోండి..
టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే సోదరుడి వార్నింగ్
ఇళ్లలోకి చొరబడి టీడీపీ నాయకులపై దాడులు
స్వగ్రామం తోపుదుర్తిలో రాజశేఖర్ రెడ్డి హల్‌చల్
‘‘కొడకల్లారా.. టీడీపీ వాళ్లు కనిపిస్తే నరికేస్తాం..! ఉంటే వైసీపీలో ఉండండి. లేదంటే ఊరు విడిచి వెళ్లండి..! పరిటాల వాళ్లు ఇక్కడికి ఎలా వస్తారు..?’’ ఇదీ.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి వార్నింగ్..! తమ స్వగ్రామం తోపుదుర్తిలో అనుచరులతో కలిసి ఆయన భయానకవాతావరణాన్ని సృష్టించారు. ఎన్నికల సమయంలో ఈ స్థాయిలో దౌర్జన్యాలు సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. కోడ్ అమలులోకి వచ్చినా.. ఇంకా అధికార పార్టీ సేవలోనే తరిస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.
ఆత్మకూరు, ఏప్రిల్ 28: రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజారెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తునకొద్దీ టీడీపీ వర్గీయులపై విరుచుకుపడుతున్నారు. తన అనుచరులతో కలిసి వైరిపక్షం ఇళ్లపైకి
దండెత్తుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అధికార పార్టీ వారి రాజ్యమే నడుస్తోంది. పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దీనికి నిదర్శనం. రామగిరి మండలం పీఆర్ కొట్టాలలో మాదాపురం ఎంపీటీసీ సంపతపై శనివారం పట్టపగలు దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి అతనిపై, కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అడ్డుకున్న స్థానిక దళిత మహిళ లక్ష్మక్కను జుట్టుపట్టి ఈడ్చికొట్టారు. మరొకరిపై కట్టెలతో దాడి చేశారు. సంపతను కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే వద్దకు తీసుకువెళ్లారు. బలవంతంగా వైసీపీ కండువాను వేయించారు. ఆ తరువాత అర్ధరాత్రి ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో మరింత అరాచకానికి పాల్పడ్డారు. గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వారి ఇళ్లలోకి చొరబడి దాడులకు పాల్పడ్డారు.
అర్ధరాత్రి దాడులు
తోపుదుర్తి గ్రామంలోని టీడీపీ దళిత నాయకుడు వన్నూరప్ప ఇంట్లోకి రాజారెడ్డి అనుచరులు శనివారం అర్ధరాత్రి చొరబడి తీవ్రస్థాయిలో బెదిరించారు. వైసీపీలో చేరాలని, లేకపోతే చంపేస్తామని హెచ్చరించారు. వన్నూరప్ప నిరాకరించడంతో దాడికి దిగారు. పిడిగుద్దులు గుద్దుతూ గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే ఇంటివద్దకు తీసుకెళ్లారు. ‘ఉంటే వైసీపీలో ఉండు.. లేదంటే మరో 13 రోజుల్లో నిన్న చంపుతాం’ అని బెదిరించారు. ఆ తర్వాత టీడీపీ బీసీ నాయకుడు బోయ లింగమయ్య ఇంటిదగ్గరకు రాజారెడ్డి అనుచరులు వెళ్లారు. ‘అన్న పిలుస్తున్నాడు.. రా..’ అని పిలిచారు. ఆ ఇంటివద్ద హల్‌చల్ చేశారు. తాను రానని లింగమయ్య స్పష్టం చేయడంతో విషయం రాజారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆవేశంతో ఊగిపోతూ వచ్చిన రాజారెడ్డి.. లింగమయ్య ఇంట్లోకి చొరబడ్డాడు. ‘ఉంటే వైసీపీలో ఉండాలి.. లేదంటే ఊరు విడిచిపెట్టి వెళ్లాలి. పార్టీలో చేరకపోతే నరికిపారేస్తాం..’ అని బెదిరించాడు. ఇదే సమయంలో మద్యం మత్తులో ఉన్న పలువురు వైసీపీ కార్యకర్తలు ఆ ఇంటిని చుట్టుముట్టారు. లింగమయ్య కుటుంబ సభ్యులు వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు.
పోలీసులు ఏం చేస్తున్నట్లు..?
అర్ధరాత్రి ఎమ్మెల్యే సోదరుడి ఆరాచకంతో గ్రామస్థులు బెంబేలెత్తిపోయారు. దౌర్జన్యకాండ జరుగుతున్నంత సేపు ఇళ్ల నుంచి గ్రామస్థులు ఎవరూ బయటకు రాలేదు. ఎమ్మెల్యే సోదరుడు టీడీపీ నాయకుల ఇళ్లపై చొరబడి దాడులు, బెదిరింపులకు తెగబడుతున్నా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. పోలీసులకు సమాచారం అందించినా దొంగలుపడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా నింపాదిగా ఆదివారం ఉదయం ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ గ్రామానికి వచ్చి.. తిరిగి వెళ్లిపోయారు. గ్రామంలో పోలీసు పికెట్ ఉన్నా... అర్ధరాత్రి దాడులు జరుగుతున్న సమయంలో స్పందించలేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, పోలీసులు అధికార పార్టీ నేతలు కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు.
ఎమ్మెల్యే సోదరుల నుంచి ప్రాణహాని .. వన్నూరప్ప
రాప్తాడు ఎమ్మెల్యే సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని తోపుదుర్తి గ్రామానికి చెందిన టీడీపీ దళిత నాయకుడు వన్నూరప్ప ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అనుచరులు అర్ధరాత్రి తమ ఇంట్లోకి చొరబడి దాడి చేశారని వాపోయారు. తనను బలవంతంగా ఎమ్మెల్యే ఇంటివద్దకు తీసుకెళ్లారని, ఉమారెడ్డి అనేవ్యక్తి మద్యం సేవించి దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా కొడకా చంపుతాం.. టీడీపీ నా కొడుకులు ఊళ్లో కనబడకూడదు. పరిటాల వాళ్లు ఎలా వస్తారు..?’ అని రాజశేఖర్ రెడ్డి బెదిరించారని అన్నారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు విన్నవించారు.
జిల్లా నుంచి బహిష్కరించండి
మాజీ మంత్రి పరిటాల సునీత
రామగిరి/అనంతపురం, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి దౌర్జన్యకాండకు హద్దులేకుండా పోయిందని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. ఆయనను జిల్లా నుంచి బహిష్కరించాలని పోలీసులను డిమాండ్ చేశారు. స్వగ్రామం వెంకటాపురం, అనంతపురం నగరంలోని ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పీఆర్ కొట్టాల, తోపుదుర్తిలో జరిగిన ఘటనలపై ఆమె స్పందించారు. ఎమ్మెల్యే సోదరుడి వరుస దాడులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే స్వగ్రామం తోపుదుర్తిలో ఎస్సీలు, వాల్మీకులు టీడీపీలోకి చేరారనే అక్కసుతో అర్ధరాత్రి దాడులకు తెగబడ్డారని అన్నారు. తోపుదుర్తిలో బోయ లింగమయ్యను బెదిరించారని, దాడికి ప్రయత్నించడంతో బంధువులు ప్రతిఘటించారని తెలిపారు. ఎమ్మెల్యే సోదరుడు గనమెనతో పాటు 30 మందికిపైగా అనుచరులతో
దాడులకు దిగారని, దుర్భాషలాడుతూ, చంపుతామని బెదిరించారని అన్నారు. ఈ అరాచకాన్ని ఓ వ్యక్తి చిత్రీకరిస్తుండగా, అతనిపై దాడి చేసి సెల్‌ఫోన లాగేసుకున్నారని అన్నారు. వన్నూరప్ప ఇంటిపైకి 30 మంది వెళ్లారని, వన్నూరప్పతో పాటు అతని కుటుంబసభ్యులను ఎమ్మెల్యే ఇంటి వద్దకు లాక్కువెళ్లారని అన్నారు. ఎమ్మెల్యే అనుచరుడు కుమార్‌రెడ్డి వన్పూరప్పపై దాడిచేసి, రాజారెడ్డి కాళ్లు పట్టుకొని క్షమించమని వేడుకోవాలని బెదిరించాడని అన్నారు. చివరికి అతని తల్లి రాజారెడ్డి కాళ్ల మీద పడి వేడుకోగా... వదిలేశారంటే.. ఎమ్మెల్యే సోదరుడి దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ ఘటనలపై సీఐ, ఎస్‌ఐకి ఫోన ద్వారా సమాచారమిచ్చినా సరిగా స్పందించలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గనమెనను దాడులకు, బెదిరింపులకు వినియోగిస్తున్నారని, ఇలా అయితే ఎన్నికలు ఎలా సజావుగా సాగుతాయని ప్రశ్నించారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రతిరోజూ 200 మందికిపైగా వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారని, దీన్ని జీర్ణించుకోలేకే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే వలసలు ఆపుకోవాలని, దాడులు చేయడం ఏమిటని మండిపడ్డారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....