Share News

AP Elections: కర్ణాటక, తెలంగాణలో గ్రాండ్ సక్సెస్.. ఏపీలో ఏం జరుగుతుందో..!?

ABN , Publish Date - Apr 30 , 2024 | 08:53 PM

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) అధికార వైసీపీకి (YSRCP).. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేనలకు (TDP-BJP-Janasena) చాలా ప్రిస్టేజ్‌గా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని వైసీపీ.. జగన్ ఎలా గెలుస్తారో అని కూటమి వ్యూహాలు, ప్రతివ్యూహాల పనిలో నిమగ్నమయ్యాయి.

AP Elections: కర్ణాటక, తెలంగాణలో గ్రాండ్ సక్సెస్.. ఏపీలో ఏం జరుగుతుందో..!?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) అధికార వైసీపీకి (YSRCP).. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేనలకు (TDP-BJP-Janasena) చాలా ప్రిస్టేజ్‌గా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని వైసీపీ.. జగన్ ఎలా గెలుస్తారో అని కూటమి వ్యూహాలు, ప్రతివ్యూహాల పనిలో నిమగ్నమయ్యాయి. ఇక మేనిఫెస్టో విషయానికొచ్చేసరికి ఇదివరకే వైసీపీ ప్రకటించేయగా.. రెండ్రోజుల వ్యవధిలో కూటమి రిలీజ్ చేసింది. ఇప్పుడు జనాలంతా ఈ రెండింటిలో ఏది బెటర్..? ఎవరికి ఓటేయాలి..? అని బేరీజు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో మహిళలకు అన్నీ శుభవార్తలే ఉండటంతో.. వీరంతా ఎటువైపు మొగ్గుచూపుతారన్నది అర్థం కాని పరిస్థితి.


ఇదీ అసలు సంగతి!

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని ‘హస్త’గతం చేసుకుంది. ఇప్పుడు ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సైతం అధికారాన్ని కొల్లగొడుతుందనే చర్చ రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీంతో పాటు పలు వర్గాలకు కూటమి శుభవార్తలే చెప్పింది.

అటు మహిళలు.. ఇటు ఈ వర్గాలు ఒక్కటై కూటమికి ఓటేస్తే సీన్ మొత్తం మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్న మాట. మరోవైపు.. ఉచిత ప్రయాణం, ఫ్రీ సిలిండర్ల విషయంలో పొరుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఇబ్బందులను కూడా గుర్తు చేసుకుంటున్నారు. బస్సుల్లో సీట్ల కోసం తన్నుకోవడం.. నిత్యం ఇదే రచ్చ రచ్చ నడుస్తుండటంతో ఏపీలో ఏం జరుగుతుందో అని మహిళలు ఆలోచనలో పడ్డారని సోషల్ మీడియా చర్చ నడుస్తోంది.


ఇక వైసీపీ విషయానికొస్తే..

గత ఎన్నికల వేళ.. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన నవరత్నాలు పథకాలు.. ఈ అయిదేళ్ల ఆయన పాలనలో నకిలీ రాళ్లని ప్రజలకు బాగానే అర్థమైంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సైతం కాంక్షిస్తారన్నది తెలిసిందే. కానీ.. జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కుడు తప్పితే.. రాష్ట్రంలో అభివృద్ధి గురించి ఆలోచించిన పరిస్థితులు అస్సలు లేవన్నది జగమెరిగిన సత్యమే. ఇదే విషయాన్ని ప్రతిరోజూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి కూడా. మరీ ముఖ్యంగా.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అపఖ్యాతి మూట కట్టుకుంది. ఇదే ఇప్పుడు వైసీపీకి పెద్ద మైనస్ కాబోతోందని పెద్ద చర్చే నడుస్తోంది.


బాబొస్తే బాగుండు!!

ఇదే సమయంలో 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు నెమరువేసుకుంటున్నారు. ముఖ్యంగా.. రాజదాని కోసం స్థల సమీకరణతోపాటు పోలవరం నిర్మాణం సైతం చేపట్టింది. అంతలో ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల అనంతరం అధికారం కాస్తా వైఎస్ జగన్ చేతిలోకి వెళ్లింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సంక్షేమమే కాదు.. అభివృద్ధి సైతం జరిగిందనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్ సిటీ నిర్మాణం, సైబరాబాద్ నగరాభివృద్ధి, అలాగే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు పిలుపుతో రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్చందంగా వేలాది ఎకరాలు సేకరించారు. అలాగే అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన సైతం జరిగింది. కానీ అదే సీఎం వైయస్ జగన్ హాయాంలో రైతుల కోసం, ప్రజల కోసం ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా? అంటే లేదనే చెప్పాలి. సంక్షేమ పథకాల పేరుతో ప్రతీ సారి బటన్ నొక్కడం తప్ప.. సీఎంగా వైయస్ జగన్ చేసింది ఏమైనా ఉందా.. అంటే ఆలోచించాల్సిందే మరి.!


షణ్ముఖ వ్యూహాం!

సూపర్ సిక్స్ పేరుతో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయడం‌తోపాటు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని తెలిపింది. అలాగే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి కూడా అందిస్తామని చెప్పింది. మరీ ముఖ్యంగా.. ప్రజా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తూనే.. ఇతర ప్రాంతాలను సైతం అభివృద్ది చేస్తామని స్వయంగా చంద్రబాబే చెప్పేశారు.

ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ప్రత్యేక ఎంప్లాయిమెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. ఉద్యోగ కల్పన చేపడుతామని మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో బాబు, పవన్ ద్వయం ప్రకటించారు. ఇవన్నీ అటుంచితే ఇప్పుడు ఏపీలో మహిళలకు కూటమి ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం, మూడు సిలిండర్లపైనే చర్చ నడుస్తోంది. మహిళలు ఇటు కూటమివైపు అడుగులేస్తారా..? లేకుంటే అటు అమ్మ ఒడి, చేయూత ప్రకటించిన వైసీపీ వైపు మొగ్గు చూపుతారా..? అన్నది జూన్-04తో తేలిపోనుంది.

Read latest National News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 09:08 PM