AP Politics: ‘ఉండి’ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం.. రఘురామ కోసమేనా..?
ABN , Publish Date - Apr 12 , 2024 | 12:39 PM
ఉండి(Undi) నియోజకవర్గం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) కీలక భేటీ నిర్వహించారు. ఉండి నియోజకవర్గాన్ని రఘురామకృష్ణం రాజుకు(Raghurama Krishnam Raju) కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీ సందర్భంగా చంద్రబాబు సైతం కీలక కామెంట్స్ చేశారు.
అమలాపురం, ఏప్రిల్ 12: ఉండి(Undi) నియోజకవర్గం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) కీలక భేటీ నిర్వహించారు. ఉండి నియోజకవర్గాన్ని రఘురామకృష్ణం రాజుకు(Raghurama Krishnam Raju) కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీ సందర్భంగా చంద్రబాబు సైతం కీలక కామెంట్స్ చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉండి నియోజకవర్గం నేతలతో భేటీ అవ్వాల్సి వస్తోందన్నారు చంద్రబాబు. పొత్తుల కారణంగా కొన్ని సీట్లు తలకిందులు అయ్యాయని పార్టీ కేడర్‌కు వివరించే ప్రయత్నం చేశారు చంద్రబాబు.
‘ప్రత్యేక పరిస్థితుల్లో ఉండి నుంచి మీ అందరినీ పిలవాల్సి వచ్చింది. పొత్తుల వలన కొన్ని సీట్లు తలకిందులు అయ్యాయి. కొందరిని అకామిడేట్ చేయలేకపోయాము. నరసాపురం సీటు బీజేపీకి వెళ్లడం వలన సమస్య అయింది. ఉండి ఎమ్మెల్యే రామరాజుపై ఎలాంటి వివక్ష లేదు. ఏవిధంగా రామరాజుకు న్యాయం చేయాలనేది ఆలోచిస్తున్నాము. కార్యకర్తలకు చెప్పాలని పిలిచాము. రామరాజు.. రఘురామలకు న్యాయం చేయాలి. రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. రామరాజు మొన్నటి ఎన్నికల్లో బాగా పనిచేశారు. ఇప్పుడు కూడా బాగా చేసాడు. రఘురామ జగన్ బాధితుడు. నాలాంటి వ్యక్తి కూడా జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇలా అందరినీ జైల్లో పెట్టి అధికారం చెలాయించాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడు. పార్టీని నమ్ముకున్న రామరాజును న్యాయం చేస్తాం. నేను నమ్మిన నాయకులు, కార్యకర్తలను వదులుకోను. మధ్యాహ్నం బీజేపీనీ కలుస్తున్నాం. కో ఆర్డినేషన్ పై చర్చించుకుంటున్నాము. రఘురామ జగన్ బాధితుడు. ప్రజలు కూడా ఆయనకు న్యాయం జరగాలని ఆశిస్తున్నారు. కార్యకర్తలు అర్థం చేసుకుని సంయమనం పాటించాలి.’ అని చంద్రబాబు సూచించారు.
రఘురామకే ఉండి సీటు..
కార్యకర్తలతో చంద్రబాబు భేటీ.. ఆయన చేసిన కామెంట్స్‌ను బట్టి చూస్తే ఉండి అసెంబ్లీ టికెట్‌ను రఘురామకృష్ణం రాజుకే కేటాయిస్తారని క్లారిటీ వస్తోంది. ఇటీవల రఘురామ సైతం ఉండి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఊతమిచ్చినట్లుగా.. చంద్రబాబు కూడా సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో క్లారిటీ ఇచ్చేశారు. అయితే, రామరాజుకు కాకుండా.. రఘురామకు టికెట్ కేటాయించడాన్ని ఆయన అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. రామరాజుకు టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్ంయలోనే వీరిని శాంతింపజేసేందుకు చంద్రబాబు నేరుగా కలిశారు. వారికి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఒకటి రెండు రోజుల్లో రఘురామ కృష్ణం రాజు పేరును ఉండి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ ప్రకటన వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాలి.