Share News

drip irrigation రైతుల చూపు బిందు సేద్యం వైపు

ABN , Publish Date - Aug 31 , 2024 | 01:37 AM

గత ఐదేళ్ల వైకాపా పాలనలో చతికిలపడ్డ బిందు, తుం పర్ల సేద్యం కూటమి ప్రభుత్వం రాకతో జీవం పోసుకుంది. 90 శాతం రాయితీని ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో రైతులు బిందు, తుంపర్ల సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.

drip irrigation రైతుల చూపు బిందు సేద్యం వైపు
పొలంలో ఏర్పాటు చేసిన బిందు సేద్యం యూనిట్‌

జిల్లాలో 62.5 వేల ఎకరాల్లో ఏర్పాటు లక్ష్యం

చెరకు సాగుకు ప్రాధాన్యం

చిత్తూరు (సెంట్రల్‌), ఆగస్టు 30: గత ఐదేళ్ల వైకాపా పాలనలో చతికిలపడ్డ బిందు, తుం పర్ల సేద్యం కూటమి ప్రభుత్వం రాకతో జీవం పోసుకుంది. 90 శాతం రాయితీని ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో రైతులు బిందు, తుంపర్ల సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. జగన్‌ ప్రభుత్వంలో ఏటా కేవలం 11,250 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తుండగా, కూటమి ప్రభుత్వంలో ఏకంగా 53.75 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ఆమోదం తెలిపింది. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశాలతో 62.5 వేల ఎకరాల్లో బిందు, తుంపర్ల సేద్యం యూనిట్లు రైతులకు అందజేయనున్నారు. జిల్లాలో బిందు, తుంపర్ల యూనిట్ల కోసం రిజిస్ట్రేషన్‌కు విశేష స్పందన లభిస్తోంది. 2023-24 సంవత్సరానికి 23000 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, తాజాగా 28000 ఎకరాలకు రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ప్రభుత్వం యూనిట్‌ ధరలు నిర్ణయించగానే, మొత్తంగా 51 వేల ఎకరాల్లో బిందు సేద్యం యూనిట్లు మంజూరు చేసేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో సాధారణంగా రైతులు సాగు చేసే ఉద్యాన పంటలైన టమోటా, వంకాయ, బీన్స్‌, ఉర్లగడ్డ, దానిమ్మ, జామ, మామిడి, కొబ్బరి, చెరకు, బొప్పాయి, తదితర పంటలకు బిందు సేద్యం యూనిట్లు అందజేయనున్నారు. ఈ ఏడాది జిల్లాలో చెరకు సాగు రైతులకు బిందు సేద్యంలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నగరి, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం తదితర మండలాల్లో చెరకు సాగు అధికంగా ఉన్న క్రమంలో రైతులను మరింత ప్రోత్సహించాలని ఏపీఎంఐపీ అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.


90 శాతం రాయితీతో యూనిట్ల మంజూరు

బిందు, తుంపర్ల సేద్యం కింద సాగు చేసే రైతులకు 90 శాతం రాయితీతో యూనిట్లను అందజేయనున్నారు. ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు 90 శాతం, ఆపైబడి సాగుకు 75 శాతం సబ్సిడీ ఉంటుంది. కూరగాయల సాగుకు యూనిట్‌ ధర రూ.1.5 లక్షలు ఉండగా, పండ్ల తోటలకు యూనిట్‌ ధర రూ.30 వేలు ఉంది. ఇక, బిందు, తుంపర్ల సేద్యం యూనిట్లను రైతుల పొలాల్లో అమర్చేందుకు జిల్లాలో దాదాపు 27 కంపెనీలు ఉన్నాయి. ఆయా కంపెనీల సామర్థ్యం ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రాంతాల వారీగా రైతుల పొలాల్లో యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయి.

ప్రతి రైతుకు యూనిట్‌ ఇస్తాం : బాలసుబ్రమణ్యం, ఏపీఎంఐపీ పీడీ

బిందు, తుంపర్ల సేద్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అడిగిన ప్రతి రైతుకూ నిబంధనల ప్రకారం యూనిట్లు మంజూరు చేస్తాం. ఈ ఏడాది లక్ష్యం 53.75 వేల ఎకరాలు కాగా, కలెక్టర్‌ ఆదేశాల మేరకు 62.5 వేల ఎకరాలకు యూనిట్లు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటి వరకు 51 వేల ఎకరాల్లో యూనిట్లు ఇచ్చేందుకు అవసరమైన నివేదికలు సిద్ధం చేశాం.

Updated Date - Aug 31 , 2024 | 01:37 AM