Arvind Kejriwal: తిరుమలకు తొలిసారి వచ్చిన కేజ్రీవాల్..
ABN , Publish Date - Nov 13 , 2024 | 09:04 PM
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు.
తిరుపతి: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు ఆయన చేరుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయంలో కేజ్రీవాల్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబంతో కలిసి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ రాత్రికి తిరుమలలో బస చేసి గురువారం ఉదయం శ్రీవారిని కేజ్రీవాల్ దర్శించుకోనున్నారు.
మరోవైపు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. మంగళవారం రోజున 61,448 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి 21,374 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.3.18 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో నూతన కౌంటర్‌ను అధికారులు ప్రారంభించారు. దీంతో దర్శనం టికెట్లు తీసుకోవడం మరింత సులభతరం కానుంది.