AP Elections 2024: ‘నగరి’దే తొలి ఫలితం
ABN , Publish Date - May 22 , 2024 | 01:08 AM
ఓట్ల లెక్కింపు తేదీ దగ్గరపడుతుండడంతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది.
ఈ నియోజకవర్గ బరిలో ఏడుగురు అభ్యర్థులే
ఆ తర్వాత చిత్తూరు, పుంగనూరు ఫలితాలు
ఆలస్యంగా 12గంటల ప్రాంతంలో పలమనేరు ఫలితం
చిత్తూరు కలెక్టరేట్, మే 21: ఓట్ల లెక్కింపు తేదీ దగ్గరపడుతుండడంతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది. అటు అభ్యర్థులు, ఇటు ప్రజల్లోనూ ఒక్కటే పరిస్థితి. తాము గెలవాలని అభ్యర్థులు, ఓటేసిన అభ్యర్థి గెలవాలని ఓటర్లు నిత్యం జూన్ 4వ తేదీకోసం రోజులు లెక్కిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికలు జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి ఫలితం వెలువడేది నగరిదే. ఇందుకు ప్రధాన కారణం.. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పోలిస్తే నగరిలోనే ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంది. ఇక్కడ ఓటర్ల సంఖ్య 2,02,574. అందుకు తగ్గట్లే తక్కువగా 231 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాలతో పోల్చితే ఒక రౌండ్ ముందుగానే ఓట్ల లెక్కింపు పూర్తయ్యి ఫలితం వెలువడనుంది. పైగా ఇక్కడ అభ్యర్థులు కేవలం ఏడుగురే కావడంతో ఈవీఎంలో ఓట్ల లెక్కింపులకు కూడా తక్కువ సమయం తీసుకుంటుంది. అందుకని పది గంటల ప్రాంతంలోనే ఫలితం రావొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ హాలులో 14 టేబుళ్ళను ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏ పార్టీ అభ్యర్థి తొలుత జెండా ఎగురవేస్తారన్నది తేలిపోతుంది.
ఇక, ఎనిమిది మంది అభ్యర్థులతో 265 పోలింగ్ కేంద్రాలు కలిగి 2,38,868 మంది ఓటర్లున్న పుంగనూరు.. 13మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అతి తక్కువగా 226 పోలింగ్ కేంద్రాలు కలిగి 2,02,850 మంది ఓటర్లు ఉన్న కారణంగా చిత్తూరు ఫలితాలు కూడా ఆ తర్వాత 15 నిమిషాల వ్యవధిలో వెలువడనున్నాయి. ఇక, అత్యధిక (14 మంది) అభ్యర్థులు, 288 పోలింగ్ కేంద్రాలు, 2,67,896 మంది ఓటర్లు కలిగిన పలమనేరు నియోజకవర్గం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీని ఫలితం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వెలువడొచ్చని అధికారులు అంటున్నారు. 11మంది అభ్యర్థులు, 256 పోలింగ్ కేంద్రాలు, 2,04,949 ఓటర్లు కలిగిన గంగాధరనెల్లూరు ఫలితాలు, 12 మంది అభ్యర్థులు, 262 పోలింగ్ కేంద్రాలు, 2,20,999 ఓటర్లు కల్గిన పూతలపట్టు ఫలితాలు, 13 మంది అభ్యర్థులు, 243 పోలింగ్ కేంద్రాలు, 2,25,775 ఓటర్లు కల్గిన కుప్పం ఫలితాలు సుమారు 11 గంటల మధ్య వెలువడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.