CM Chandrababu : టీడీపీ సారథిగా పల్లా శ్రీనివాసరావు
ABN , Publish Date - Jun 17 , 2024 | 05:08 AM
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేసిన పల్లా తన నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసరావు.. చంద్రబాబు ప్రకటన
చంద్రబాబు ప్రకటన.. అచ్చెన్నకు అభినందనలు
అమరావతి/విశాఖపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేసిన పల్లా తన నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటి వరకు టీడీపీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబరిచిన పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిని ఆయన అభినందించారు. పల్లా ఈ ఎన్నికల్లో 95,235 ఓట్ల భారీ మెజారిటీతో గాజువాక నుంచి గెలుపొందారు. రాష్ట్రంలో ఈయనదే అత్యధిక మెజారిటీ. 2014లోనూ గెలిచిన ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ అనేక సమీకరణల కారణంగా వీలుకాలేదని, ఇప్పుడాయనపై చాలా పెద్ద బాధ్యత పెట్టామని బాబు చెప్పినట్లు తెలిసింది. పల్లా కుటుంబం ఆది నుంచీ టీడీపీతోనే ఉంది. ఆయన తండ్రి సింహాచలం 1994లో విశాఖ-2 ఎమ్మెల్యేగా ఆ పార్టీ తరఫున గెలిచారు. పల్లా విశాఖ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా 2000 నుంచి 2024 ఎన్నికల వరకు పనిచేశారు.