Share News

AP High Court Verdict: మైనర్‌ మినరల్స్‌ నిబంధనల్లో జోక్యం చేసుకోలేం

ABN , Publish Date - Apr 01 , 2025 | 06:30 AM

హైకోర్టు ధర్మాసనం మైనర్ మినరల్స్ లీజు కేటాయింపులపై 2022లో జారీ చేసిన జీవోలు 13, 14ను సవాల్ చేసిన వ్యాజ్యాలను కొట్టివేసింది. కోర్టు, సెక్యూరిటీ డిపాజిట్ మరియు ఆక్షన్ విధానంపై తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను చట్టబద్ధంగా సమర్థించింది

AP High Court Verdict: మైనర్‌ మినరల్స్‌ నిబంధనల్లో  జోక్యం చేసుకోలేం

  • జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు కొట్టివేసిన హైకోర్టు

    అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మైనర్‌ మినరల్స్‌ లీజు కేటాయింపునకు ఆక్షన్‌ విధానంతో పాటు వార్షిక డెడ్‌ రెంట్‌ చెల్లింపు, సెక్యూరిటీ డిపాజిట్‌ నిబంధనలకు సవరణ చేస్తూ 2022లో గనులశాఖ తీసుకొచ్చిన జీవో 13, 14లను సవాల్‌ చేసిన వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. సెక్యూరిటీ డిపాజిట్‌గా ఎంత సొమ్ము జమ చేయాలన్నది కోర్టు నిర్ణయించడం సరికాదని పేర్కొంది. అది పూర్తిగా విధానపరమైన నిర్ణయమని తెలిపింది. వార్షిక డెడ్‌ రెంట్‌కు మూడింతలు నగదు రూపంలో సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాలన్న నిబంధన ఏకపక్షమైనదిగా ప్రకటించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. సవరించిన మైనర్‌ మినరల్స్‌ నిబంధనలను అధికారులు దుర్వినియోగం చేస్తున్నారనే కారణంతో చట్టబద్ధత కలిగిన ఆ నిబంధనలు రద్దు చేయలేమంది. ఈ విషయంలో పిటిషనర్లు నిర్ధిష్ఠ ఉదాహరణలు కోర్టు ముందు ఉంచలేదని పేర్కొంది. పలు మైనింగ్‌ సంస్థలు, లీజుదారులు వేసిన వ్యాజ్యాలను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌. రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. లీజు కేటాయింపునకు ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ విధానాన్ని అనుసరించకుండా ఆక్షన్‌ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరేషన్‌ ఆఫ్‌ మైనర్‌ మినరల్స్‌ ఇండస్ట్రీ, పలువురు మైనింగ్‌ లీజుదారులు తమ పిటిషన్లలో తప్పుపట్టారు. మూడేళ్ల డెడ్‌రెంట్‌కు సమానమైన సొమ్మును సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలన్న నిబంధనను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల తుది విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది.

Updated Date - Apr 01 , 2025 | 06:30 AM