Share News

Tragic Road Accident: మొక్కు తీర్చుకోడానికి వెళ్తూ

ABN , Publish Date - Apr 01 , 2025 | 06:24 AM

మొక్కు తీర్చుకునేందుకు వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐటీసీ ఉద్యోగి సందీప్, అతని తల్లిదండ్రులు, కుమార్తె దుర్మరణం చెందారు

Tragic Road Accident: మొక్కు తీర్చుకోడానికి వెళ్తూ

  • లారీని ఢీకొన్న కారు.. ఒకే కుటుంబంలోని నలుగురి దుర్మరణం

  • అవనిగడ్డ సమీపంలో ప్రమాదం... నిద్రమత్తే కారణమా?!

అవనిగడ్డ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కొడుకు పుట్టాడన్న సంతోషంలో దేవుడికి మొక్కు తీర్చుకునేందుకు కారులో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఐటీసీ ఉద్యోగి.. తన ఇద్దరు బిడ్డలతోపాటు తల్లిదండ్రులనూ కోల్పోయారు. కృష్ణా జిల్లా పులిగడ్డ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గిడుగు సందీప్‌ హైదరాబాద్‌లోని ఐటీసీ కంపెనీలో పని చేస్తున్నారు. ఇటీవల కుమారుడు పుట్టడంతో కుటుంబ సమేతంగా, మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తెనాలి నుంచి సోమవారం కారులో బయలుదేరారు. సాయంత్రం 3 గంటల సమయంలో మోపిదేవి మార్గంలోని పులిగడ్డ-పెనుమూడి వారధి, టోల్‌గేట్‌ నడుమ ఎదురుగా వస్తున్న లారీని కారు వేగంగా వెళ్లి ఢీకొంది. రహదారిపై ఎడమవైపుగా వెళ్లాల్సిన కారు, కుడి వైపునకు వెళ్లి ఎదురుగా లారీపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


కారును సందీప్‌ డ్రైవ్‌ చేస్తుండగా, ముందు సీటులో ఉన్న ఆయన తండ్రి జీఆర్‌ మోహన్‌బాబు (60), వెనుక కూర్చున్న తల్లి అరుణ (55) అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక సీటులో సందీప్‌ భార్య పల్లవి, కుమార్తె సాత్విక (5)తో పాటు పల్లవి ఒడిలో రెండు నెలల షణ్ముఖ్‌ కూడా ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన సాత్వికను అవనిగడ్డ నుంచి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతిచెందింది. సందీ్‌పకు తీవ్ర గాయాలు కాగా, ఆయన భార్య పల్లవి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో సందీప్‌ షాక్‌లోకి వెళ్లాడు. కొద్దిసేపు తానెవరో చెప్పలేకపోయిన ఆయన, ఆ తర్వాత తెనాలి నుంచి వచ్చినట్లుగా పోలీసులకు వివరించారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు అంతబట్టడంలేదని, బహుశా సందీప్‌ నిద్రమత్తులో ఉండడంవల్ల జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - Apr 01 , 2025 | 06:24 AM