CM Chandrababu: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కార్యాచరణ
ABN , Publish Date - Apr 01 , 2025 | 06:04 AM
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో సమావేశమైన కేంద్ర ఉక్కు శాఖ ప్రతినిధులు భద్రత, బ్లాస్ట్ ఫర్నేస్‌ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు

సీఎంతో భేటీ అయిన కేంద్ర ఉక్కు సహాయ మంత్రి, అధికారులు
అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధి బృందం సోమవారం సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం(ఎస్పీఎ్‌ఫ)తో ప్లాంట్‌కు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందుకు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం, ప్రస్తుతం పనిచేస్తున్న రెండు బ్లాస్ట్ ఫర్నె్‌సలతోపాటు మూడో ఫర్నె్‌సను కూడా తిరిగి ప్రారంభించడం వంటి అంశాలను ప్రతినిధి బృందంతో సీఎం చర్చించారు. ప్లాంట్‌కు పూర్వవైభవం తీసుకురావడానికి అవసరమైన సాయాన్ని రాష్ట్రప్రభుత్వం అందిస్తూనే ఉంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పాండే, జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర, ఎన్‌ఎండీ సీఎండీ అమితవ ముఖర్జీ పాల్గొన్నారు.