Share News

CPI State Secretary Ramakrishna : భారీగా వైసీపీ భూఆక్రమణలు

ABN , Publish Date - Aug 19 , 2024 | 05:29 AM

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్‌ భూములను గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బినామీ పేర్లతో ఆక్రమించుకుని, అమ్ముకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

CPI State Secretary Ramakrishna :  భారీగా వైసీపీ భూఆక్రమణలు

  • మదనపల్లెలో ఫైళ్ల దహనం ఉదంతమే నిదర్శనం

  • అగ్రిగోల్డ్‌ భూములనూ అమ్మేసిన వైసీపీ నేతలు: సీపీఐ రామకృష్ణ

కూడేరు, ఆగస్టు 18: రాష్ట్రంలోని అగ్రిగోల్డ్‌ భూములను గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బినామీ పేర్లతో ఆక్రమించుకుని, అమ్ముకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామం వద్దగల అగ్రిగోల్డ్‌ వెంచర్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. అక్కడే నిరసన తెలిపారు.

రామకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 23 వేల ఎకరాల అగ్రిగోల్డ్‌ ఆస్తులున్నాయన్నారు. వేల కోట్ల విలువైన ఆస్తులున్నా... బాధితులకు న్యాయం చేయలేదన్నారు. అగ్రిగోల్డ్‌ భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని, వాటిని అమ్మి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడు అగ్రిగోల్డ్‌ భూమును కొనుగోలు చేసి, జైలుకెళ్లారని గుర్తుచేశారు. బత్తలపల్లి మండలంలో రూ.60కోట్ల విలువైన 20 ఎకరాల మంఠం భూములను బినామీ పేర్లతో ఆక్రమించుకున్నారన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా భూఆక్రమణలు పెద్దఎత్తున జరిగాయని, మదనపల్లెలో ఫైళ్ల దహనం ఉదంతమే ఇందుకు నిదర్శనమన్నారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సైతం ఫైళ్లను దహనం చేశారన్నారు.

వీటన్నింటిపై ఈనెల 28న విజయవాడలో రాష్ట్ర భూబాధితుల సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

బాధితులందరూ హాజరవ్వాలన్నారు. వారి నుంచి వచ్చిన వినతులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం రాష్ట్ర గౌరవాద్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2024 | 05:29 AM